భయపెడుతున్న మిచాంగ్‌ తుపాను

5 Dec, 2023 05:28 IST|Sakshi
హొళగుందలో ధాన్యం తడవకుండా తార్పిళ్లను కప్పిన దృశ్యం

కర్నూలు(అగ్రికల్చర్‌): బంగాళాఖాతంలో ఏర్పడిన మిచాంగ్‌ తుపాను ప్రభావం ఉమ్మడి కర్నూలు జిల్లాపైనా చూపనుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కర్నూలు జిల్లాకు ఎల్లో, నంద్యాల జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ను ప్రకటించింది. కర్నూలు కంటే నంద్యాల జిల్లాపైనే తుపాను ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆకాశం మేఘావృతమై చలి వాతావరణం నెలకొంది. శనగ పంట 55 రోజుల దశలో ఉండటంతో ఈ సమయంలో ఒక పదును అయితే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తుపాను ప్రభావం నేపథ్యంలో రైతులను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్‌ సృజన వ్యవసాయ యంత్రాంగాన్ని ఆదేశించారు. వరి కోతలు, మిరప తెంపడం వంటి వాటిని తుపాను ప్రభావం తొలగిపోయే వరకు వాయిదా వేసుకోవడం మంచిదని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న వరిలో సత్వరమే కంబైన్డ్‌ హార్వెస్టర్లను ఉపయోగించి వచ్చిన ధాన్యాన్ని సురక్షిత ప్రాంతంలో తడవకుండా జాగ్రత్త చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్‌ వరలక్ష్మి తెలిపారు.

కాచిగూడ–చెంగల్‌పట్టు రైలు రద్దు

కర్నూలు(రాజ్‌విహార్‌): తుపాను కారణంగా కాచిగూడ నుంచి కర్నూలు మీదుగా చెంగల్‌పట్టు (తమిళనాడు)కు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌ రైలును సోమవారం (4వ తేదీ) రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ రాకేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రెండు వైపులా తిరిగే 17651, 17652 రైళ్లను రద్దు చేశామని, ప్రయాణికులు గమనించి, సహకరించాలని కోరారు.

విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

తుపాను ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విద్యుత్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ కర్నూలు ఆపరేషన్స్‌ ఎస్‌ఈ ఎం. ఉమాపతి ఆదేశించారు. సోమవారం ఆయన కింది స్థాయి సిబ్బందితో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తుపాను ప్రభావంతో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని, సమస్య ఏర్పడినట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. వర్షం, గాలి సమయంలో పనులు చేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎల్‌సీ తీసుకుని, ఫ్యూజ్‌ తొలగించి, సరఫరా లేదని ధ్రువీకరించున్న తరువాతే పని ప్రారంభించాలన్నారు. అర్త్‌ రాడ్‌ వేసుకోవడంతో పాటు తలకు హెల్మెట్‌ ధరించాలని సూచించారు.

నంద్యాల జిల్లాకు ఆరెంజ్‌,

కర్నూలు జిల్లాకు ఎల్లో అలర్ట్‌

>
మరిన్ని వార్తలు