శ్రీశైల క్షేత్రం.. కార్తీక శోభితం

5 Dec, 2023 05:28 IST|Sakshi
కార్తీకదీపాలను వెలిగిస్తున్న భక్తులు

శ్రీశైలంటెంపుల్‌: పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీకమాసం కావడంతో ముక్కంటి దర్శనానికి భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం మూడవ సోమవారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు వేలాదిగా తరలివచ్చారు. వేకువజామునే పాతాళగంగలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, మల్లన్న దర్శనానికి బారులుదీరారు. ఉచిత దర్శన క్యూలైన్లు గంగాధర మండపం వరకు భక్తులు క్యూలైన్లలో వేచిఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వేకువజామున ఆలయ ద్వారాలను తెరిచి భక్తులను స్వామిఅమ్మవార్ల దర్శనానికి అనుమతించారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే అవకాశం కల్పించారు. ఉచిత దర్శనానికి 6 గంటల సమయం, శీఘ్ర దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద, ఆలయ ఉత్తర (శివ)మాఢవీధిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన దీపారాధనలో పలువురు భక్తులు దీపాలు వెలిగించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. కాగా కార్తీకమాసం మూడవ సోమవారాన్ని పురస్కరించుకుని ఆలయ పుష్కరిణి వద్ద జరగాల్సిన లక్షదీపోత్సవం, దశవిధ హారతులు తుఫాను కారణంగా దేవస్థానం అధికారులు రద్దు చేశారు.

>
మరిన్ని వార్తలు