ప్రియురాలిని పెళ్లాడిన బ్రిటిష్‌ ప్రధాని 

31 May, 2021 03:40 IST|Sakshi
వివాహం అనంతరం డౌనింగ్‌ స్ట్రీట్‌ గార్డెన్‌లో బోరిస్‌ దంపతులు

లండన్‌లో నిరాడంబరంగా బోరిస్‌ జాన్సన్, క్యారీ సైమండ్స్‌ పెళ్లి  

చాలా రోజులుగా సహజీవనం.. ఇప్పటికే ఒక కుమారుడు  

లండన్‌: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ (56) తన ప్రియురాలు క్యారీ సైమండ్స్‌ (33)ను పెళ్లాడారు. లండన్‌లోని రోమన్‌ క్యాథలిక్‌ వెస్ట్‌మినిస్టర్‌ క్యాథెడ్రల్‌ చర్చిలో శనివారం మధ్యాహ్నం నిరాడంబరంగా ఈ వివాహం జరిగినట్లు అధికార వర్గాలు ఆదివారం తెలిపాయి. వధూవరుల కుటుంబ సభ్యులు, మిత్రులు అతికొద్ది మంది మాత్రమే హాజరయ్యారని వెల్లడించాయి. రానున్న వేసవిలో బంధుమిత్రులతో కలిసి వివాహ సంబరాలు ఘనంగా జరుపుకోనున్నారని పేర్కొన్నాయి. బోరిస్‌ జాన్సన్, క్యారీ సైమండ్స్‌ చాలాకాలంగా సహజీవనం చేస్తున్నారు. వారికి 2020 ఏప్రిల్‌లో కుమారుడు విల్‌ఫ్రెడ్‌ క్యారీ నికోలస్‌ జాన్సన్‌ జన్మించాడు. సైమండ్స్‌కు ఇది మొదటి పెళ్లి కాగా, జాన్సన్‌కు మూడో వివాహం. తాము కలిసి జీవిస్తున్నామని, ఎంగేజ్‌మెంట్‌ సైతం చేసుకున్నామని వారిద్దరూ 2020లో ఫిబ్రవరిలో బహిర్గతం చేశారు. క్యారీ సైమండ్స్‌ అప్పటికే గర్భవతి అనే విషయాన్ని కూడా బయటపెట్టారు. గత 200 సంవత్సరాల్లో పదవిలో ఉండగా పెళ్లి చేసుకున్న మొదటి బ్రిటన్‌ ప్రధానమంత్రిగా బోరిస్‌ జాన్సన్‌ రికార్డుకెక్కడం విశేషం.


ప్రియురాలితో బోరిస్‌ జాన్సన్‌   

చివరిసారిగా 1822లో అప్పటి ప్రధాని రాబర్ట్‌ బ్యాంక్స్‌ జెంకిన్సన్‌ పదవిలో ఉండగా వివాహం చేసుకున్నారు. బోరిస్‌ జాన్సన్‌ తొలుత 1987లో కళాకారిణి, జర్నలిస్టు అలెగ్రా మోస్టిన్‌ ఓవెను, తర్వాత 1993లో భారత సంతతికి చెందిన న్యాయవాది, జర్నలిస్టు మెరీనా వీలర్‌ను పెళ్లాడారు. 25 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం తాము విడాకులు తీసుకుంటున్నట్లు జాన్సన్, వీలర్‌ 2018లో ప్రకటించారు. 2020లో ఈ విడాకుల తంతు పూర్తయ్యింది. క్యారీ సైమండ్స్‌ 1988 మార్చి 17న జన్మించారు. ఆమె తండ్రి మాథ్యూ సైమండ్స్‌ ‘ద ఇండిపెండెంట్‌’ పత్రిక సహ వ్యవస్థాపకుడు. తల్లి జోసెఫైన్‌ లాయర్‌. క్యారీ సైమండ్స్‌ 2010లో కన్జర్వేటివ్‌ పార్టీ ప్రెస్‌ ఆఫీసులో చేరారు. రెండేళ్ల తర్వాత బోరిస్‌ జాన్సన్‌ ప్రచార బృందంలో చేరారు. ఆయన రెండోసారి లండన్‌ మేయర్‌గా ఎన్నిక కావడం వెనుక ఆమె కృషి ఉందని అంటుంటారు. 2018లో కన్జర్వేటివ్‌ పార్టీ కమ్యూనికేషన్ల విభాగం బాధ్యతలు చేపట్టారు. ప్రధాని అధికారిక నివాసమైన 10 డౌనింగ్‌ స్ట్రీట్‌లో పెళ్లికాకుండానే ప్రధానితో కలిసి జీవనం సాగించిన తొలి మహిళగా క్యారీ సైమండ్స్‌ పేరుగాంచారు. 

మరిన్ని వార్తలు