పాలకు వెళ్లి అనంతలోకాలకు..

6 Mar, 2023 01:00 IST|Sakshi
లాలు మృతదేహం

మామునూరు: మసక చీకట్లోనే గేదె పాలు తెస్తానని ఇంట్లో చెప్పి బైక్‌పై వెళ్లిన ఓ వ్యక్తి అనంతలోకాలకు వెళ్లాడు. ట్రాక్టర్‌ బైక్‌ను ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున గవిచర్ల రోడ్డుపై రాంగోపాలపురం బస్టాప్‌ వద్ద చోటు చేసుకుంది. మామునూరు పోలీస్‌స్టేషన్‌ పరిధి గుంటూరుపల్లికి చెందిన బొట్ల రమాదేవి, మల్లికార్జున్‌ దంపతుల కుమారుడు ప్రదీప్‌ చౌదరి(28) శివనగర్‌ పల్లవి ఆస్పత్రి ఏరియాలో భార్య, మూడేళ్ల కుమార్తెతో కలిసి నివాసం ఉంటూ పాలు,పెరుగు వ్యాపారం చేస్తున్నాడు. ప్రదీప్‌ చౌదరి బైక్‌పై ప్రతిరోజు ఉదయం 5 గంటలకు సంగెం మండలం గుంటూరుపల్లికి వెళ్లి గేదె పాలు తెస్తుంటాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 5 గంటలకు గుంటూరుపల్లికి బైక్‌పై బయల్దేరాడు. ఈ క్రమంలో గవిచర్ల రోడ్డుపై రాంగోపాలపురం బస్‌స్టాప్‌ వద్దకు చేరుకోగానే ఎదురుగా అతివేగంగా వస్తున్న ట్రాక్టర్‌ బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ప్రదీప్‌చౌదరికి తలకు బలమైన తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రున్ని 108 వాహనంలో తరలించేందుకు ప్రయత్నిస్తుండగా మృతి చెందాడు. ప్రదీప్‌ మృతితో గుంటూరుపల్లి, శివనగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి మామునూరు ఎస్సై కృష్ణవేణి చేరుకుని వివరాలు సేకరించారు. మృత్యువుకు కారణమైన ట్రాక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని మృతదేహన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి మల్లికార్జున్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ఉరేసుకుని రైల్వే ఉద్యోగి మృతి

కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో నివాసం ఉంటూ రైల్వే డీజిల్‌ షెడ్‌లో టెక్నీషియన్‌–3గా పనిచేస్తున్న ఉద్యోగి ఆదివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఇన్‌స్పెక్టర్‌ గట్ల మహేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. బీహార్‌ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన రవికుమార్‌ సిన్హా (26) దాదాపు 8 నెలల కింద వివాహం చేసుకున్నాడు. భార్య పుట్టింటికి వెళ్లడంతో ఒంటరిగానే ఇంట్లో ఉంటూ విధులకు హాజరై వెళ్లివస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ రవికుమార్‌ సిన్హా ఆత్మహత్యకు పాల్పడ్డాడని, భార్య, బంధువులు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించినట్లు సీఐ తెలిపారు.

డివైడర్‌ ఢీకొని ఒకరు..

మరిపెడ: స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని మహబూబాబాద్‌ రోడ్డులోని డివైడర్‌ను ద్విచక్రవాహనంపై వెళ్తున్న క్రమంలో ఇద్దరు యువకులు బైకు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టారు. ఈ క్రమంలో గుగులోతు లాలు(41) అక్కడికక్కడే మృతి చెందగా సుధాకర్‌కు తీవ్రగాయాలయ్యాయి. నర్సింహులపేట మండలం జయపురం గ్రామం శివారు దాసుతండాకు చెందిన వీరు మరిపెడలోని ఓ శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తున్న క్రమంలో బైక్‌అదుపు తప్పి ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వ్యక్తి..

సంగెం/కాశిబుగ్గ : ప్రమాదవశాత్తు రైలునుంచి జారిపడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై సీహెచ్‌. పరశురాములు తెలిపారు. ఆదివారం ఉదయం వరంగల్‌–విజయవాడ డౌన్‌ లైన్‌లో 391/22–24 కిలోమీటర్‌ వద్ద చింతలపల్లి, ఎల్గూర్‌ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు నుంచి జారిపడడంతో 25 నుంచి 30 ఏళ్ల వయసు గల యువకుడు మృతి చెందాడన్నారు. మృతుడు బ్లూ కలర్‌ జీన్స్‌ ప్యాంట్‌ లేత గులాబీ రంగు పుల్‌షర్ట్‌ దానిపై బ్లూ కలర్‌ నైలాన్‌ జాకెట్‌ ధరించి ఉన్నాడు. నలుపురంగు తల వెంట్రుకలు, గడ్డం, మీసాలు గుండ్రని ముఖం, ఎరుపురంగు ఐదున్నర అడుగుల ఎత్తు కలిగి ఉన్నాడన్నారు. మృతునివద్ద బ్లాక్‌ కలర్‌ గ్లోనీ కంపెనీ ఫోన్‌ అందులో ఎన్‌సెల్‌ సిమ్‌, నేపాల్‌ రూ.20 నోట్‌ దొరికినట్లు తెలిపారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరచినట్లు తెలిపారు. మృతునికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తెలిస్తే వరంగల్‌ రైల్వే ఎస్సై 9866330257, 9440627532 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

విద్యుదాఘాతంతో వ్యక్తి..

డోర్నకల్‌ : మండల శివారులో చేపలవేటకు వెళ్లి ఓ వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఖమ్మం రూరల్‌ మండలం కాసిరాజిగూడెం శివారు రేకులతండాకు చెందిన దారావత్‌ కృష్ణ(46) మండలంలోని ముల్కలపల్లి శివారులోని ఆకేరువాగులో ఆదివారం సాయంత్రం చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఎస్సై శ్యాంసుందర్‌ను వివరణ కోరగా మృతుడు చేపల వేటకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు సమాచారం అందిందన్నారు. మృతదేహం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఘటన జరిగిన ప్రదేశం డోర్నకల్‌ మండల పరిధిలో ఉండటంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ట్రాక్టర్‌ ఢీకొని వ్యక్తి దుర్మరణం

మృతుడు శివనగర్‌ వాసి

మరిన్ని వార్తలు