పనులొద్దు.. పైసలొద్దు

17 Mar, 2023 02:38 IST|Sakshi

‘మహబూబాబాద్‌ నియోజకవర్గంలోని ఓ గిరి జనతండా సర్పంచ్‌ మూడేళ్లుగా తండాలో రూ.18లక్షలతో నర్సరీ, సీసీరోడ్లు, శ్మశాన వాటి క, డంపింగ్‌యార్డుతో పాటు ఇతర పనులు చేపట్టారు. కాగా ఇప్పటి వరకు ఆయనకు రూ.2లక్షల బిల్లులు మాత్రమే వచ్చాయి. మరో రూ. 16లక్షలు రావాల్సి ఉంది. అప్పులు చేసి పనులు చేపట్టానని, మిత్తి మీదపడుతుందని సర్పంచ్‌ వాపోయారు.’

కురవి మండలంలోని ఓ గ్రామానికి చెందిన సర్పంచ్‌ ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ మెటీరియల్‌ కాంపౌండ్‌ కింద వచ్చిన నిధులతో పనులు చేశారు. కాగా కొన్ని బిల్లులు రాగా మరో రూ.2లక్షలు రావాల్సి ఉంది. తన తర్వాత పనులు చేసిన వారికి బిల్లులు వచ్చాయని తనకు మాత్రం బిల్లులు చెల్లించడంలేదని సర్పంచ్‌ ఆరోపించారు. పనులు చేసిన పాపానికి ప్రజా సమస్యల కోసం ఇంటికి వచ్చేవారి కంటే అప్పులోల్లు ఎక్కువ మంది వస్తున్నారని, ఇంట్లో గొడవలు అవుతున్నాయని సర్పంచ్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సాక్షి, మహబూబాబాద్‌: ఇలా జిల్లాలోని ఏ గ్రామ సర్పంచ్‌ను కదిలించినా.. పనులు చేసినందుకు అప్పుల పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాత పనుల బిల్లులే రాలేదని, కొత్త పనులు చేసి మరిన్ని అప్పులు చేయలేమని కొందరు సర్పంచ్‌లు చేతులెత్తేస్తున్నారు.

పనులు ప్రారంభించడానికి వెనకడుగు..

పాత పనుల బిల్లులు ఇప్పటి వరకు రాకపోవడంతో కొత్త పనులు చేసేందుకు జిల్లాలోని సర్పంచ్‌లు వెనకడుగు వేస్తున్నారు.కొందరైతే ‘మీ పనులు వద్దు.. మీ డబ్బులు’ వద్దంటూ నిర్మొహమాటంగా చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈజీఎస్‌ ద్వారా జిల్లాకు 501 సీసీరోడ్లు, 66 డ్రెయినేజీలు, 81 మెటల్‌ రోడ్లు మొత్తం 648 పనులు చేసుకునే అవకాశం వచ్చింది. ఇందుకు రూ.67.08 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. ఈ పనులు మార్చి 31వ తేదీ వరకు పూర్తి చేస్తేనే బిల్లులు వస్తాయి. అంటే మరో 15రోజుల్లో పనులు పూర్తి చేయాలి. ఎన్‌బీలు, క్యూసీ రిపోర్టులు మొదలైన ప్రక్రియలు పూర్తి చేయాలి. కానీ ఇప్పటి వరకు జిల్లాలో 366పనులు ప్రారంభించలేదు. కేవలం రూ.4.66 కోట్ల విలువ చేసే పనులు మాత్రమే పూర్తి చేశారు.

కోట్ల రూపాయలు పెండింగ్‌..

జిల్లాలో పంచాయతీరాజ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పనుల బిల్లులు రూ.91.35కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి గత ఆర్థిక సంవత్సరం వరకు పనులు చేపట్టారు. ఇందులో ఈజీఎస్‌ ద్వారా 3,531చోట్ల సీసీ రోడ్లు నిర్మించేందుకు ఎస్టిమేట్‌ వేశారు. పనులు మంజూరు చేయగా, ఇప్పటి వరకు 2,489 పనులు పూర్తి చేశారు. దీంతో సీసీరోడ్ల కోసం కేటాయించిన రూ.168.42కోట్లకు గానూ రూ.102.36కోట్లు మాత్రమే వచ్చాయి. మిగిలిన రూ.66.05కోట్ల పనులు, బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. అదేవిధంగా రూ. 82లక్షలతో 13 అంగన్‌న్‌వాడీ భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు చేయగా.. ఎనిమిది భవనాలు ప్రారంభించలేదు. 5భవనాలు నిర్మించగా.. ఇంకా పూర్తిగా బిల్లులు రాలేదు. 89 గ్రామ పంచాయతీలకు నూతన భవనాల కోసం రూ.14.24 కోట్లు మంజూరు కాగా ఇందులో 48 భవనాలు పూర్తి చేశారు. 13భవనాల పని పూర్తి కాలేదు. 28 భవనాలు ఇంకా ప్రారంభించలేదు. వీటికి రూ.7.19 కోట్లు మాత్రమే బిల్లులు చెల్లించగా.. రూ.7.05కోట్ల బిల్లులు, పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటితో పాటు శ్మశాన వాటికలు, రైతు వేదికలు,మన ఊరు–మన బడి పనుల్లో కొన్నింటికి ఇప్పటి వరకు బిల్లులు రాలేదు. కొన్ని పనులు పూర్తి చేయలేదు. మరికొన్ని పనులు ఇప్పటికీ ప్రారంభించలేదు.

రూ.95లక్షల బిల్లులు

ఆన్‌లైన్‌ నుంచి మాయం

పనుల బిల్లుల వివరాలు ఆన్‌లైన్‌ నుంచి మాయమయ్యాయి. జిల్లాలోని తొర్రూరు, పెద్దవంగర, నర్సింహులపేట, నెల్లికుదురు, కురవి, మరిపెడ మండలాల్లోని 25గ్రామాల్లో నిర్మించిన జీపీ భవనాలు, శ్మశాన వాటికలు, చిన్నగూడూరు మండల పరిధి జయ్యారంలో రైతు వేదిక పనులు పూర్తి చేశారు. మొత్తం పనులకు రూ.3.88కోట్లు కాగా.. రూ.2.93కోట్ల బిల్లులు రాగా.. మరో రూ.95లక్షల బిల్లులు రాకుండానే ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. ఇదేమిటని అడిగితే తమకేమీ తెలియదని పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చెబుతున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనులు చేసి మూడేళ్లు గడిచినా అందని బిల్లులు

నిరుత్సాహంలో సర్పంచ్‌లు

అధికారుల అలసత్వంతో

పెండింగ్‌లో ఫైల్స్‌

బిల్లుల కోసం ఆఫీసుకు వస్తే

అధికారుల అవహేళన

కొత్తగా మంజూరైన పనులు

చేపట్టేందుకు వెనకడుగు..

అధికారుల ఇష్టారాజ్యం

పనులు చేపట్టిన అనంతరం పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు క్వాలిటీని పరిశీలించి బిల్లులు చేయాలి. కానీ తమకు నచ్చితే ఒకతీరు.. నచ్చకపోతే మరోతీరుగా అధికారులు వ్యవహరిస్తున్నారని జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అధికారులు అడిగిన విధంగా కమీషన్‌ ఇస్తేనే ఫైల్‌ కదులుతుందని, ఈ వ్యవహారమంతా కార్యాలయంలోని ఓ ఉద్యోగి కనుసన్నల్లో జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కాగా సమస్యను జిల్లా ఉన్నతాధికారికి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని తెలిసింది. పైగా డబ్బులు వచ్చినప్పుడే తీసుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు