ప్రమాదమా.. హత్యా? అసలేం జరిగింది..? అల్లుడిపై అనుమానం!

8 Oct, 2023 09:13 IST|Sakshi
భార్య, కొడుకుతో రమేష్‌ (ఫైల్‌), పోలీసు స్టేషన్‌ వద్ద మృతురాలి కుటుంబ సభ్యులు

బైక్‌తో నీటిగుంతలో పడిన కుటుంబం..

భార్య, కుమారుడి మృతి.. భర్త క్షేమం!

పరకాల మండలం వెల్లంపల్లి శివారులో ఘటన..

అల్లుడిపై మృతురాలి కుటుంబీకుల అనుమానం!

వరంగల్‌: ఓ వ్యక్తి తన భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు. అనంతరం ద్విచక్రవాహనంపై రాత్రి ఇంటికి ప్రయాణమయ్యాడు. ఈ క్రమంలో బయలుదేరిన గంటలోనే ద్విచక్రవాహనం నీటి గుంతలో పడింది. ఈ ప్రమాదంలో భార్య, కుమారుడు మృతి చెందగా భర్త క్షేమంగా బయటపడ్డారు.

కాగా, ఈ ఘటనలో అల్లుడికి (మృతురాలి భర్త) ఎలాంటి గాయాలు కాకపోవడంతో పాటు రాత్రి సమయంలో ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురావడంపై మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం వరంగల్‌ శంభునిపేటకు చెందిన పస్తరి సమ్మక్క, రాజేందర్‌ దంపతుల పెద్ద కూతురు రాజేశ్వరి(21)ని మూడున్నర సంవత్సరాల క్రితం నడికూడ మండలం నర్సక్కపల్లికి చెందిన తూర్పాటి రమేష్‌కు ఇచ్చి వివాహం చేశారు.

దంపతులు ఆరు నెలల వరకు అన్యోన్యంగా ఉన్నారు. అనంతరం మనస్పర్థలు ప్రారంభమయ్యాయి. రమేష్‌కు మరో యువతితో పరిచయం కావడంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు సాయి ఇషాన్‌ ఉన్నాడు. ఈ క్రమంలో రాజేశ్వరి మళ్లీ గర్భం దాల్చడంతో శుక్రవారం వరంగల్‌లోని సీకేఎం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాడు.

అనంతరం రాత్రి వేళలో ఇంటికి బయలుదేరుతుండగా వద్దని మృతురాలి అక్కాచెల్లెలు ఎంత వారించినా పట్టించుకోలేదు. ద్విచ్రవాహనంపై భార్య, కుమారుడిని తీసుకుని బయలుదేరాడు. ఈ క్రమంలో రాత్రి 9 గంటలకు ద్విచక్రవాహనం పరకాల మండలం వెల్లంపల్లి క్రాస్‌ సమీపంలోని నేతాని కుంటలో పడింది. ఈ ఘటనలో భార్య రాజేశ్వరి, కుమారుడు ఇషాన్‌ మృతి చెందగా రమేష్‌ క్షేమంగా బయటపడ్డాడు.

రాత్రి కుమారుడు, ఉదయం తల్లి మృతదేహాలు లభ్యం!
నీటి గుంతలో పడగానే రమేష్‌ ఫోన్‌ చేసి ఇరు కుటుంబాలకు సమాచారం అందించాడు. వారు హుటాహుటినా ఘటనా స్థలికి చేరుకుగానే రాజేశ్వరి దొరకడం లేదని.. సాయి ఇషాన్‌ మృతదేహాంతో విలపిస్తూ కనిపించాడు.

సమాచారం అందుకున్న పరకాల పోలీసులు రాత్రి నుంచి అగ్నిమాపక సిబ్బంది సాయంతో గాలింపు చేపట్టగా శనివారం ఉదయం 10 గంటలకు రాజేశ్వరి మృతదేహాం లభ్యమైంది. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పరకాలకు తరలించారు. కాగా, తన కుమార్తె, మనువడి మృతికి అల్లుడే కారణమంటూ మృతురాలి తల్లి సమ్మక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత..!
ద్విచక్రవాహనం నీటి గుంతలో పడి తల్లి, కుమారుడు మృతి చెందాడని తెలుసుకున్న రాజేశ్వరి బంధువులు ఆమె భర్తపై అనుమానం వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో పరకాల పోలీసుస్టేషన్‌ వద్దకు చేరుకున్నారు. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

పోలీసుస్టేషన్‌లో రమేష్‌ ఆత్మహత్యాయత్నం..
ఘటనపై మృతురాలి బంధువులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో తనపై అనవసరపు నిందలు వేస్తున్నారంటూ పోలీసు స్టేషన్‌లోనే రమేష్‌ బ్లేడ్‌తో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మరిన్ని వార్తలు