బీజేపీకి బూస్ట్‌..

18 Mar, 2023 01:34 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌: మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ మేరకు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లావ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. పార్టీశ్రేణులు జెండాలు చేతబూని పలు సెంటర్లలో ప్రదర్శనలు నిర్వహించారు. స్వీట్లు పంచి బాణసంచా కాల్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో అడుగులు వేస్తున్న కమల దళంలో ఈ గెలుపు జోష్‌ నింపింది. అంతేకాదు.. పాలమూరుపై పార్టీ నాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టిన నేపథ్యంలో ఈ విజయం బూస్టు వంటిదని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

పక్కా వ్యూహంతో..

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి.. అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ అధినాయకత్వం పక్కా వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ప్రజలకు చేరువయ్యేలా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. మహబూబ్‌నగర్‌–రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో బరిలో నిలిచిన ఏవీఎన్‌ రెడ్డి గెలుపు కోసం ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ప్రధానంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్‌న్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, పార్జీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్‌ తదితరులు ప్రచారం చేశారు. ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ప్రతి 25మంది ఉపాధ్యాయ ఓటర్లకు ఒకరు చొప్పున కీలక నేతలకు బాధ్యతలు అప్పగించి.. సమన్వయంతో అన్నీ చక్కదిద్దుకుంటూ రూపొందించుకున్న ప్లాన్‌ను పక్కాగా అమలు చేశారు.

సంగ్రామయాత్రతో మొదలు..

గతంలో బీజేపీకి పాలమూరులో కొంతమేర పట్టుంది. అలంపూర్‌ నుంచి రావుల రవీంద్రనాథ్‌ రెడ్డి బీజేపీ తరఫున మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా జితేందర్‌రెడ్డి గెలుపొందారు. 2012 ఉపఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి యెన్నం శ్రీనివాస్‌రెడ్డి విజయం సాధించారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2014, 2018 ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పలేదు. ఈ రెండు పర్యాయాలు ఆచారి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్‌ ఎంపీగా పోటీ చేసిన డీకే అరుణ గెలవలేకపోయినా.. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి ముచ్చెమటలు పట్టించారు. అదేవిధంగా నారాయణపేట, మక్తల్‌, కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్లతోపాటు పలు పట్టణాల్లో పార్టీకి ఓటు బ్యాంకు ఉన్నా.. వరుస ఓటములతో శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. అయితే గతేడాదిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన రెండో విడత ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతం కావడం వారిలో ఆశలు రేపింది. ఆ తర్వాత పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇక్కడే రెండు రోజులపాటు నిర్వహించడంతో జోష్‌ పెరిగింది. ప్రజాగోస–బీజేపీ భరోసా పేరిట పార్టీ కార్యక్రమాలు ఊపందుకోవడం, మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నుంచి అమిత్‌షా పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపు అయింది. తాజాగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ మద్దతిచ్చిన ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందడం వారిలో మరింత ఉత్తేజం నింపుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మీ తీర్పుపైనే భవిష్యత్‌ అంటూ..

ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించిన బీజేపీ నేతలు ముఖ్యంగా ఉపాధ్యాయ సమస్యలను లేవనెత్తి.. వాటి పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఎండగట్టారు. ప్రధానంగా 317 జీఓతో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కష్టాలు.. దీనిపై బీజేపీ ఉద్యమించిన తీరును వివరించారు. తమ పోరాటంతోనే ఉపాధ్యాయ వర్గానికి కొంతమేలు జరిగిందనే విషయాన్ని నొక్కి చెప్పారు. సీపీఎస్‌ విధానం, పీఆర్సీ, ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లు, పాఠశాలల్లోని సమస్యలు ఇలా ప్రతి అంశాన్ని ప్రస్తావించి ఉపాధ్యాయులను ఆకర్షించారు. మేధావులైన ఉపాధ్యాయ, అధ్యాపకుల తీర్పుపైనే తెలంగాణ భవిష్యత్‌ ఆధారపడిందని చెప్పి వారిని ఆలోచింపజేశారు. మిగిలిన అభ్యర్థులు ఎవరు గెలిచినా.. వారు అధికార పార్టీలో చేరుతారంటూ గతంలో చోటుచేసుకున్న ఘటనలను సైతం ఉదహరించారు. ఈ విధంగా ఏవీఎన్‌ రెడ్డి విజయం కోసం బీజేపీ నేతలు రూపొందించుకున్న ప్రణాళికను పకడ్బందీగా అమలు చేసి గెలుపును సొంతం చేసుకున్నారు.

ఎమ్మెల్సీగా ఏవీఎన్‌ రెడ్డి విజయం

పాలమూరుపై ప్రత్యేక ఫోకస్‌

ఫలించిన ముఖ్యనేతల కృషి, ప్రచారం

పక్కా వ్యూహంతో ఆత్మీయ సమ్మేళనాలు

ప్రచారాస్త్రాలుగా 317 జీఓ, బదిలీలు, ప్రమోషన్లు, సీపీఎస్‌

గెలుపుతో ‘కమలం’ శ్రేణుల్లో నూతనోత్సాహం

మరిన్ని వార్తలు