మామూళ్ల దందా

18 Mar, 2023 01:34 IST|Sakshi
ఉప్పునుంతల మండలం మొల్గర వద్ద దుందుభీ వాగులో ఇసుక తవ్వకాలు

సాక్షి, నాగర్‌కర్నూల్‌: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా దందా జోరుగా సాగుతోంది. జిల్లాలోని దుందుభీ వాగు తీరం వెంబడి ఎక్కడబడితే అక్కడ విచ్చలవిడిగా ఇసుక దోపిడీ కొనసాగుతోంది. ప్రభుత్వం ద్వారా ఇసుక సరఫరా చేసేందుకు రెండేళ్ల కిందటే ‘సాండ్‌ టాక్సీ’ విధానాన్ని ప్రవేశపెట్టినా ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ప్రభుత్వ ఇసుక పాలసీ ద్వారా దక్కాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. జిల్లాలో రాత్రి, పగలు తేడా లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలింపు కొనసాగుతున్నా సంబంధిత అధికారులకు పట్టడం లేదు. వ్యవస్థీకృతంగా మారిన ఇసుక మాఫియా నుంచి అందుతున్న మామూళ్ల మత్తుతోనే అధికారులు మిన్నకుండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అక్రమార్కులదే ఇష్టారాజ్యం..

జిల్లాలోని ఉప్పునుంతల మండలం మొల్గర, పెద్దాపూర్‌, దాసర్లపల్లి గ్రామాల వద్ద దుందుభీ వాగు తీరంలో ఇసుక అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ, జేసీబీలతో తోడేస్తున్నా సంబంధిత పోలీసు, రెవెన్యూ, మైనింగ్‌ శాఖ అధికారులకు పట్టడం లేదు. ఉప్పునుంతల మండలంలోని కొరటికల్‌, తిర్మలాపూర్‌, కంసానిపల్లి గ్రామాల వద్ద నిర్మించిన చెక్‌డ్యాంలో నీటి నిల్వ ఉండటంతో ప్రధానంగా మొల్గర, పెద్దాపూర్‌, దాసర్లపల్లి గ్రామ శివారులోని దుందుబీ వాగు నుంచి ఇసుక తరలింపు కొనసాగుతోంది. ఉప్పునుంతల మండల కేంద్రం గుండా అచ్చంపేట, బల్మూరు, ఇతర మండలాలకు ట్రాక్టర్లకు యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా సాగుతోంది.

ప్రభుత్వ పనుల సాకుతో..

ఉప్పునుంతలకు 4 కి.మీ దూరంలో ఉన్న దేవదారికుంట పంచాయతీలో నాలుగు సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు పంచాయతీ భవన నిర్మాణం కోసం 96 ట్రాక్టర్‌ ట్రిప్పుల ఇసుక తరలింపునకు స్థానిక తహసీల్దార్‌ అనుమతినిచ్చారు. అలాగే మండలంలోని తాడూరు పంచాయతీ పరిధిలో సీసీరోడ్డు నిర్మాణానికి మరో 50 ట్రాక్టర్‌ ట్రిప్పుల తరలింపునకు అనుమతులు మంజూరయ్యాయి. అయితే ఉప్పునుంతల మండల పరిధి దాటి అచ్చంపేట, బల్మూరు, లింగాల, తెలకపల్లి మండలాలకు ట్రాక్టర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక రవాణా కొనసాగుతోంది. బహిరంగంగానే ఇసుక తరలింపు కొనసాగుతుండగా.. అడ్డుకోవాల్సిన అధికారులు అభివృద్ధి పనుల కోసం తరలిస్తున్నారంటూ అక్రమార్కులకే వంతపాడుతుండటం గమనార్హం.

జిల్లాలో బహిరంగంగా

కొనసాగుతున్న ఇసుక రవాణా

ఉప్పునుంతల మండలంలో పట్టపగలే రెచ్చిపోతున్న అక్రమార్కులు

మామూలుగా వదిలేస్తున్న అధికారులు

జిల్లాలో నిలిచిన ప్రభుత్వ ఇసుక సరఫరా

మా పరిధి కాదు..

ఉప్పునుంతల మండల పరిధిలో దుందుభి వాగు నుంచి ప్రభుత్వ అనుమతితోనే అభివృద్ధి పనులకు ఇసుక తరలింపు కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా విషయం రెవెన్యూ వారికి సంబంధించినది. మా పరిధి కాదు.. మాకు ఎలాంటి సంబంధం ఉండదు.

– శేఖర్‌గౌడ్‌, ఎస్‌ఐ, ఉప్పునుంతల

మరిన్ని వార్తలు