చెత్తతో ఎరువు తయారీపై దృష్టిసారించాలి

18 Mar, 2023 01:36 IST|Sakshi
వీసీలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రవినాయక్‌

జెడ్పీసెంటర్‌ (మహబూబ్‌నగర్‌): జిల్లాలో సేకరించిన చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేయడంపై దృష్టిసారించాలని కలెక్టర్‌ రవినాయక్‌ అన్నారు. శుక్రవారం ఎంపీడీఓలు, ఎంపీఓలతో కలెక్టర్‌ వీసీ నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి కూలీల సంఖ్య పెంచాలన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హరితహారం నర్సరీల్లో నీడ ఇచ్చే విధంగా నెట్లను ఏర్పాటు చేయాలన్నారు. అలాగే దళితబంధు పథకం కింద మొబైల్‌ యాప్‌లో వివరాలను 93 శాతం అప్‌లోడ్‌ చేశారని, మిగతావి వెంటనే పూర్తిచేయాలన్నారు. ఎంపీఓలు నెలలో తప్పనిసరిగా 16 గ్రామ పంచాయతీలను సందర్శించి.. డంపింగ్‌ యార్డులను పరిశీలించాలన్నారు. నెలాఖరు నాటికి అన్ని గ్రామాల్లో పన్నుల వసూలు పూర్తి చేయాలన్నారు. మైనార్టీ శాఖ ద్వారా అమలు చేస్తున్న ఆర్థిక చేయూత పథకం లబ్ధిదారుల ఎంపిక జాబితాను పంపించాలన్నారు. పంచాయతీలకు విద్యుత్‌ బిల్లులు ఎక్కువ రాకుండా చూసుకోవాలన్నారు. వైకుంఠధామాల్లో అంత్యక్రియలు జరిగేలా ప్రజలను చైతన్యం చేయాలన్నారు. గ్రామీణ క్రీడా ప్రాంగణాలను తక్షణమే పూర్తిచేయాలని, ఈ–శ్రామ్‌ కింద అసంఘటిత కార్మికులను రిజిస్ట్రేషన్‌ చేయాలని, సోషల్‌ ఆడిట్‌ రికవరీపై దృష్టిసారించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ సీతారామారావు, డీఆర్‌డీఓ యాదయ్య, ఏపీడీ జకియాసుల్తానా, డీపీఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు