ఆలిండియా ఫుట్‌బాల్‌ పోటీలకు జిల్లావాసులు

18 Mar, 2023 01:40 IST|Sakshi

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో శనివారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు జరగనున్న ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ పోటీలకు ఉమ్మడి జిల్లావాసులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు జి.భానుప్రకాశ్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, మునిమోక్షం), రామకృష్ణ (జెడ్పీహెచ్‌ఎస్‌ నసరుల్లాబాద్‌), శేఖర్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌), శశిధర్‌రెడ్డి (వ్యవసాయశాఖ), ఇమ్మాన్యుయేల్‌ జేమ్స్‌ (వైద్య ఆరోగ్యశాఖ)లు తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఇమ్మాన్యుయేల్‌ జేమ్స్‌ తెలంగాణ సివిల్‌ సర్వీసెస్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. వీరి ఎంపికపై మహబూబ్‌నగర్‌ జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు ఎన్‌పీవెంకటేశ్‌, ప్రధాన కార్యదర్శి గజానంద్‌కుమార్‌, సభ్యులు టీఎస్‌.రంగారావు, ఆర్‌.రమేశ్‌, శంకర్‌లింగం, సీనియర్‌ క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

డీజిల్‌ దొంగల పరార్‌

ఎర్రవల్లిచౌరస్తా: జాతీయ రహదారిపై డీజిల్‌ చోరీకి పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను గురువారం రాత్రి పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా పరారైనట్లు కోదండాపురం ఎస్‌ఐ వెంకటస్వామి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి కారులో వచ్చి జాతీయ రహదారిపై నిలిపి ఉన్న లారీలలో డీజిల్‌ దొంగతనాలకు పాల్పడుతున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీస్‌ సిబ్బంది పెట్రోలింగ్‌ చేస్తుండగా పుటాన్‌దొడ్డి సమీపంలో నిందితులను గుర్తించారు. దీంతో పోలీసులు వాహనం ద్వారా దొంగలను వెంబడించగా దుండగులు ధర్మవరం సమీపంలో కారును వదిలిపెట్టి పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు