TS Election 2023: డబ్బు, మద్యం అరికట్టేందుకు చర్యలు

19 Oct, 2023 11:28 IST|Sakshi
మాట్లాడుతున్న రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

ఫిర్యాదుల మానిటరింగ్‌ సెల్‌పై విస్తృత ప్రచారం

శాంతిభద్రతల సమస్యపై ప్రత్యేక దృష్టి

పోలింగ్‌ కేంద్రాల్లో అన్నిరకాల వసతుల కల్పన

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌

మహబూబ్‌నగర్‌లో జిల్లా ఎన్నికల కార్యాలయం ఏర్పాటు

మహబూబ్‌నగర్‌: ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎఫ్‌ఎస్‌టీ కదలికలు చాలా ముఖ్యమని, వాటిని పటిష్టంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు డీజీ సంజయ్‌కుమార్‌ జైన్‌తో కలిసి ఉమ్మడి జిల్లాలోని ఎన్నికల అధికారులు, ఎస్పీలు, రిటర్నింగ్‌ అధికారులతో అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎన్నికల అధికారుల కార్యాలయం ఏర్పాటు చేసి కంట్రోల్‌ రూం నుంచి ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ బృందాల కెమెరాలకు అనుసంధానం చేయాలన్నారు. సీవిజిల్‌తోపాటు జిల్లా ఎన్నికల అధికారులు కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంప్లెయింట్‌ మానిటరింగ్‌ సెల్‌కు సంబంధించిన సమాచారాలపై విస్తృత ప్రచారం కల్పిస్తే ప్రజలు ఫిర్యాదు చేయడానికి సులభంగా ఉంటుందన్నారు.

అలాగే సీ విజిల్‌ యాప్‌ సైతం చాలా ముఖ్యమని, అన్ని గ్రామాల్లో పోస్టర్లను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసేలా చూడాలన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల నుంచి వచ్చే ఫిర్యాదులపై కలెక్టర్లు, ఎస్పీలు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఓటరు టర్న్‌ అవుట్‌ పెంచే అంశాలపై ప్రత్యేక శ్రద్ధవహించాలని, ఓటు వినియోగం, ఓటుహక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు.

కొత్త ఓటరుగా నమోదు చేసుకున్న వారి గుర్తింపు కార్డులు సక్రమంగా ప్రింట్‌ వచ్చేలా పునఃపరిశీలన చేసుకోవాలన్నారు. ఈవీఎంల ర్యాండమైజేషన్‌ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని, సువిధ యాప్‌ ద్వారా అన్ని అనుమతులు ఒకేచోట ఇవ్వాలన్నారు.

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ రవినాయక్‌ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సంసిద్ధతపై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. నారాయణపేట కలెక్టర్‌ శ్రీహర్ష, జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ వల్లూరి క్రాంతి, వనపర్తి కలెక్టర తేజాస్‌ నందులాల్‌ పవార్‌, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ ఉదయ్‌కుమార్‌, ఆయా జిల్లాల ఎస్పీలు హర్షవర్ధన్‌, రితిరాజ్‌, యోగేష్‌ వర్ధన్‌, రక్షిత కె.మూర్తి, వైభవ్‌ గైక్వాడ్‌ ఎన్నికల నిర్వహణకు తీసుకున్న చర్యలను వివరించారు.

సమావేశానికి జోగుళాంబ డీఐజీ ఎల్‌ఎస్‌ చౌహాన్‌, మక్తల్‌ రిటర్నింగ్‌ అధికారి మయాంక్‌ మిట్టల్‌, కొల్లాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి కుమార్‌ దీపక్‌, గద్వాల రిటర్నింగ్‌ అధికారి అపూర్వ చౌహాన్‌, ఉమ్మడి జిల్లా అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారులు, పోలీస్‌, నోడల్‌ అధికారులు హాజరయ్యారు.

మహబూబ్‌నగర్‌ సమీపంలోని జేపీఎన్‌సీఈ కళాశాలలో ప్రతిపాదించనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని, జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను సీఈఓ వికాస్‌రాజ్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో సౌకర్యాలు, క్యూలైన్లు, బారికేడింగ్‌, వాహనాల పార్కింగ్‌ తదితర అంశాలను పరిశీలించారు.

అక్కడే ఉన్న బీఎల్‌ఓలతో మాట్లాడుతూ ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు.. కొత్తగా ఎంత మంది చేరారు.. చనిపోయిన వారు, డబుల్‌ ఓట్ల తొలగింపు, తుది ఓటరు జాబితాలో తప్పొప్పుల గురించి ఆరాతీశారు. మహబూబ్‌నగర్‌ రిటర్నింగ్‌ అధికారి అనిల్‌కుమార్‌, అర్బన్‌ తహసీల్దార్‌ నాగార్జున, రూరల్‌ తహసీల్దార్‌ సుందర్‌రాజు, డీటీ శ్యాంసుందర్‌రెడ్డి, ఆర్‌ఐలు కాంత్రికుమార్‌గౌడ్‌, చైతన్యగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

శాంతిభద్రతల సమస్య రావొద్దు
ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని వికాస్‌రాజ్‌ చెప్పారు. మోడల్‌ పోలింగ్‌ కేంద్రాల్లో స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలన్నారు. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు అన్ని గ్రామాల నుంచి పటిష్టమైన సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఆయా పోస్టులు ఖాళీ లేకుండా చూసుకోవాలని, నామినేషన్ల సందర్భంగా రిటర్నింగ్‌ అధికారుల చాంబర్లు సరిపోయేలా చర్యలు తీసుకోవాలన్నారు.

బ్యాలెట్‌ పేపర్ల విషయంలో అవసరమైనన్ని అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. నియోజకవర్గాల్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాల కల్పన, మహిళా, పీడబ్ల్యూడీ పోలింగ్‌ కేంద్రాలు, ఈవీఎంల ర్యాండమైజేషన్‌, సిబ్బందికి శిక్షణ, శాంతిభద్రతల సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారంపై సీఈఓ సమీక్షించారు.

మరిన్ని వార్తలు