TS Elections 2023: కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కావాలే.. బండి సంజయ్‌

9 Nov, 2023 08:40 IST|Sakshi
రోడ్‌షోలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహంనింపిన బండి సంజయ్‌ రోడ్‌షో

బీఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు

కేసీఆర్‌..రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపాటు

ఓట్లు చీల్చొద్దు.. బీజేపీని గెలిపించాలని విన్నపం

మహబూబ్‌నగర్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌షో విజయవంతమైంది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తల్లో ఉత్సాహం నింపే ప్రసంగం చేశారు. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. బుధవారం నారాయణపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.రతంగ్‌పాండురెడ్డి నామినేషన్‌ వేసిన అనంతరం నిర్వహించిన రోడ్‌ షోకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హెలీకాప్టర్‌ సాంకేతిక కారణాలతో 4 గంటలు ఆలస్యంగా వచ్చినా జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పళ్ల హనుమాన్‌ మందిర్‌లో ప్రత్యేక పూజలు చేసిన బండిసంజయ్‌ అనంతరం రోడ్‌షో ప్రారంభించారు. కిందిగేరి, సరాఫ్‌బజార్‌, సెంటర్‌చౌక్‌, సుభాష్‌ రోడ్డు, పాతబస్టాండ్‌ మీదుగా సత్యనారాయణ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీళ్లు, నియామకాలు, నిధుల కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందే సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు.

22 రోజులు కష్టపడి పనిచేయాలని, డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ చేస్తే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బాక్సులు బద్దలు కావాలన్నారు. పచ్చగా ఉన్న పాలమూరులో బండి సంజయ్‌ చిచ్చు పెట్టాడని కేసీఆర్‌ అంటున్నాడని, డిసెంబర్‌ 3న రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాసిపెట్టుకో బిడ్డా.. అంటూ సవాల్‌ విసిరారు. నారాయణపేట జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడి వలస కూలీల గోస ఏంటో చూశారని పేర్కొన్నారు.

పచ్చ కామెరోళ్లకి లోకమంతా పచ్చగా కనబడుతుందని, పాలమూరు పచ్చగా కళకళలాడుతుందని, వలసలన్నీ ఆగిపోయినవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతి రోజు పొట్ట చేతపట్టుకొని బొంబాయి, సూరత్‌ పోతున్న వందలాది కుటుంబాలను ప్రపంచానికి చూపించి కేసీఆర్‌ను నిలదీయాలన్నారు. ఉపాధి కోసం పసిపిల్లలను సంకనేసుకొని వలసపోతున్న వాళ్లను, నెర్రెలు బాసిన భూములను చూసి కన్నీళ్లు పెట్టుకున్నా అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇక్కడున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, పరిశ్రమలు పెట్టాలని ఆనాడే నిర్ణయించుకున్నానన్నారు.

ఉద్యోగావకాశాలు కల్పించడంలో విఫలం
జాయమ్మ చెరుకుకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యేదని, కేసీఆర్‌ ఎందుకు ఇవ్వలేదు అని బండి ప్రశ్నించారు. నేను పాదయాత్ర చేసిన సమయంలో పదే పదే ఆ అంశాన్ని ప్రస్తావించినా పట్టించుకోలేదని, కేసీఆర్‌ సర్కారుకు పోయేకాలం దగ్గర పడిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యుద్ధపాదికన జాయమ్మ చెరువుకు నిధుల కేటాయించి, ఏడాదిలోనే లక్ష ఎకరాలకు సాగునీరందించేలా కృషి చేస్తానని అన్నారు.

ఇక నారాయణపేట ప్రాంతంలో ఖనిజ సంపద పుష్కలంగా లభిస్తుందని, ఐరన్‌ గనులున్నాయని, వాటిని తవ్వితే పరిశ్రమలు పెట్టడంతో పాటు ఉద్యోగాలు ఇవ్వవచ్చని అన్నారు. కానీ, కేసీఆర్‌ ఉన్నదంతా తవ్వి తీసుకుపోయే రకమని, బీజపీ అధికారంలోకి వస్తే ఐరన్‌ గనులను తవ్వి పరిశ్రమలు స్థాపించడంతోపాటు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.

3 మండలాల ఏర్పాటుకు కృషి
నారాయణపేట నియోజకవర్గంలో కోటకొండ, కానుకుర్తి, గార్లపాడు గ్రామాలను మండలాలుగా ప్రకటించాలనే డిమాండ్‌ ప్రజల్లో ఉందని, రతంగ్‌పాండురెడ్డిని గెలిపిస్తే ప్రజల అభిష్టం మేరకు మండలాల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. రైతులకు రుణమాఫీతోపాటు బీసీబంధు, దళితబంధు ఎవరికై నా ఇచ్చారా అని ప్రశ్నించుకోవాలని, బీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వెయ్యాలో ఆలోచించాలని అన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి గెలిస్తే తిరిగి బీఆర్‌ఎస్‌లో చేరతారని, ఈసారి నారాయణపేట గడ్డ మీదా ధర్మం గెలవాలని, బీజేపీ అభ్యర్థి రతంగ్‌పాండురెడ్డిని గెలిపిస్తే స్థానికంగా, మీకు అందుబాటులో ఉంటాడని, బీజేపీని ఆదరించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, సత్యయాదవ్‌, పగడాకుల శ్రీనివాస్‌, రఘురామయ్యగౌడ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు