నమ్మకంతో బరిలోకి..

15 Nov, 2023 01:12 IST|Sakshi

న్నికల వేళ అన్ని పార్టీల్లోనూ మార్పులు, చేర్పులు జరగడం సహజం. ఈ సందర్భంగా పార్టీ టికెట్‌ ఆశించినా దక్కకపోవచ్చు. టికెట్‌పై ఆశలేని వారికి అవకాశం దక్కవచ్చు. ఈ నేపథ్యంలో తప్పక గెలుస్తామనే నమ్మకం ఉన్నవారు, పార్టీ ప్రకటించిన అభ్యర్థి కంటే తమకే బలం ఎక్కువని నమ్మే వారే కాకుండా.. పార్టీ టికెట్‌పై పోటీ చేయడం ఇష్టం లేని వారు ఎన్నికల బరిలో ఇండిపెండెంట్లుగా దిగుతున్నారు. ఇలా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలువురు స్వతంత్రులుగా రంగంలోకి దిగి చరిత్ర సృష్టించారు. మరికొందరికి పరాజయమే ఎదురైంది.

రెండుసార్లు ఒక్కరే..

2009లో కనుమరుగైన అమరచింత నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి ఓ రికార్డు ఉంది. ఈ సెగ్మెంట్‌కు 1952 నుంచి 2004 వరకు మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 1962, 1967 ఎన్నికల్లో అమరచింత సంస్థానానికి చెందిన రాజవంశీయుడు రాజా సోంభూపాల్‌ ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. అయితే రాజవంశీయుడు కావడంతో సహజంగానే అన్ని పార్టీల వారు తమ తరఫున పోటీకి దిగాలని కోరారు. కానీ ఏ పార్టీని ఎంచుకున్నా మరో పార్టీని తిరస్కరించినట్లు అవుతుందని, అది మంచి పద్ధతి కాదనే భావనతో రాజ సోంభూపాల్‌ ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగి విజయం సాధించారు. ఇక మూడోసారి 1972 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీచేసి ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుంచి 1957లో జరిగిన ఎన్నికల్లో డి.మురళీధర్‌రెడ్డి స్వతంత్ర అభ్యర్థిగానే విజయం సాధించారు. అంటే ఒక్క నియోజకవర్గం నుంచి ఇద్దరు స్వతంత్రులు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కావడం, ఒక్కరే రెండుసార్లు విజయం సాధించడం విశేషంగా చెప్పవచ్చు.

మరిన్ని వార్తలు