పొలం ఇప్పుడే ఇవ్వడం కుదరదన్న అత్తమామ.. మామపై అల్లుడి దారుణం!

2 Dec, 2023 09:21 IST|Sakshi

కట్నంగా ఇస్తానన్న ఎకరం పొలం విషయంలో గొడవ

ఉప్పునుంతల: పెళ్లి సమయంలో తనకు కట్నంగా ఇస్తామన్న ఎకరం పొలం విషయంలో తరచుగా అత్తమామలతో గొడవపడుతున్న అల్లుడు మామను దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన మండలంలోని మర్రిపల్లిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ గురుస్వామి వివరాల ప్రకారం.. మండలంలోని మర్రిపల్లికి చెందిన సోనమోని అలివేళ, వెంకటయ్య (50) దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.

కూతురు మాధవిని రెండేళ్ల క్రితం ఉప్పునుంతలకు చెందిన గడ్డం సాయిబాబుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి సమయంలో 13 తులాల బంగారం, రూ.3.50 లక్షలు నగదుతోపాటు ఎకరం పొలాన్ని తమ కూతురుకు ఇస్తామని చెప్పారు. ఇప్పుడే అల్లుడికి పొలం ఇస్తే అమ్ముకుంటాడనే భావనతో వారు వాయిదా వేస్తూ వస్తున్నారు.

తనకు ఇస్తామన్న ఎకరం పొలాన్ని ఇవ్వాలంటూ సాయిబాబు పెళ్లయిన ఆరు నెలల నుంచి తరుచుగా భార్యను కొట్టడంతోపాటు అత్తమామలు సోనమోని అలివేళ, వెంకటయ్యలతో గొడపపడేవాడు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం తన బైక్‌పై మర్రిపల్లికి వెళ్లిన సాయిబాబు ఇంటివద్ద ఉన్న అత్త అలివేళతో పొలం తన పేరిట చేయాలని గొడ వపడ్డాడు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వా రు తిట్టడంతో అక్కడి నుంచి వెళ్లిపోయా డు.

మామ వెంకటయ్యను చంపుతానంటూ గ్రా మంలో అతనికోసం వెతికాడు. వెంకటయ్య వ్యవసాయ పొలం వద్దకు వెళ్లినట్లు తెలుసుకొని అక్కడకు వెళ్లాడు. అతనితో గొడవపడి కొట్టడంతో వెంకటయ్య తలకు బలమైన గాయాలై అక్కడిక్కడే పడి చనిపోయాడు. పక్క పొలం రైతు రెడ్డమోని జగదీష్‌ గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించాడు. వెంకటయ్యను అల్లుడే కొట్టి చంపాడని శుక్రవారం భార్య అలివేల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

గుర్తుతెలియని మహిళ మృతి
అచ్చంపేట రూరల్‌: అనారోగ్యంతో గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఎస్‌ఐ గోవర్ధన్‌ వివరాల మేరకు.. అచ్చంపేట పట్టణంలోని పాతబజార్‌ ప్రధాన రహదారిపై గతనెల 28న గుర్తుతెలియని మహిళ అపస్మారక స్థితిలో ఉండగా.. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం 108 లో స్థానిక ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు శుక్రవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు