రైలు నుంచి జారి పడి వ్యక్తి అక్కడిక్కడే మృతి

7 Dec, 2023 10:30 IST|Sakshi

గద్వాల్‌ క్రైం: ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడి ఒకరు మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం, నాపాడు జిల్లా, బాబుపలికి చెందిన గౌరి శంకర్‌(40) మంగళవారం ఉదయం 7 గంటలకు యశ్వంత్‌పూర్‌ నుంచి కోర్బా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైల్‌లో భార్య లంబేసాగర్‌, 6 ఏళ్ల కుమారుడితో బెంగుళూరుకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో గద్వాల్‌ రైల్వేస్టేషన్‌ దాటిన అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో పూడూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో వెళ్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తు గౌరిశంకర్‌ జారి కిందపడడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ రామకృష్ణ తెలిపారు.

తాగిన మైకంలో కిందపడి..
జడ్చర్ల టౌన్‌:
పట్టణానికి చెందిన విష్ణు (26) బుధవారం వీరశివాజీనగర్‌లోని మద్యం దుకాణం సమీపంలో ఉన్న డ్రెయినేజీ పక్కన పడి మృతిచెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మద్యానికి బానిసయ్యాడు.

తాగిన మైకంలో పడిపోగా.. బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి బంధువులకు సమాచారమిచ్చారు. వారు వచ్చి చూడగా అప్పటికే చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ చంద్రమోహన్‌ తెలిపారు.

అంత్యక్రియలకు వెళ్తూ మరొకరు..
జడ్చర్ల టౌన్‌:
సమీప బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వెళ్తున్న ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు రైల్వే ప్లాట్‌ఫారంపై పడి మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసులు (52) మహబూబ్‌నగర్‌లో సమీప బంధువు చనిపోవడంతో బుధవారం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు రైలులో బయలుదేరాడు.

జడ్చర్లలో ఉన్న కుమార్తెను తీసుకెళ్లేందుకు స్టేషన్‌లో రైలు ఆగకముందే దిగేందుకు ప్రయత్నించి ప్లాట్‌ఫారంపై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. రైల్వే పోలీసులు పంచనా మా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బాదేపల్లి ఆస్పత్రికి తరలించారు.

ఇంటి తాళం పగలగొట్టి బంగారం, నగదు అపహరణ
చారకొండ:
మండల కేంద్రంలో ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తాళం పగలగొట్టి బంగారం, వెండి, నగదు చోరీకి పాల్పడ్డారు. ఎస్‌ఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కొప్పుల బాల్‌నారయ్య ఈనెల 4న తమ కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్లారు.

తిరిగి 5వ తేదీన ఇంటికి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడడంతో ఇంట్లోకి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లో దాచిన రెండు చైన్‌లు, పూసలదండా, రింగులు, బంగారు నగలు నాలుగు తులాలు, వెండి ఆభరణాలు, రూ.98 వేల నగదు చోరీకి గురయ్యాయి. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు