జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు మృతి.. ఉపాధ్యాయ సంఘాలు సంతాపం

7 Dec, 2023 09:18 IST|Sakshi

జడ్చర్ల టౌన్‌: పట్టణంలోని బాదేపల్లికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడు కె.వేణుగోపాల్‌ (75) బుధవారం మృతి చెందారు. నాలుగు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మహబూబ్‌నగర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుడిగా దివంగత అబ్దుల్‌ కలాం చేతుల మీదుగా ఆయన అవార్డు అందుకున్నారు. అదేవిధంగా 30ఏళ్ల పాటు ఎస్‌టీయూ సంఘం బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు.

మున్సిపాలిటీలోని నేతాజీ చౌరస్తాలో సుభాష్‌ చంద్రబోస్‌ విగ్రహం ప్రతిష్ఠించడంలోనూ ఆయన కీలకపాత్ర పోషించారు. బాదేపల్లి శాఖ గ్రంథాలయం అభివృద్ధికి కృషి చేశారు. జడ్చర్లలో జరిగిన అనేక కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు. విద్యార్థులను సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్రోత్సహించే వారు. ఆయన మృతిపై పలు ఉపాధ్యాయ సంఘాలు సంతాపం వ్యక్తం చేశాయి. మృతుడికి ముగ్గురు కుమారులు ఉన్నారు. ఆయన అంత్యక్రియలు గురువారం బాదేపల్లిలో నిర్వహించనున్నారు.

>
మరిన్ని వార్తలు