ప్రేమ వివాహం చేసుకుందని.. చెల్లెలిపై అన్న ఘాతుకం!

21 Feb, 2024 01:54 IST|Sakshi

చెల్లిపై కత్తితో దాడి చేసిన అన్న

పరిస్థితి విషమం

మహబూబ్‌నగర్‌: ప్రేమ వివాహం చేసుకుందని ఓ అన్న చెల్లెలిని కత్తితో దాడి చేసిన ఘటన మంగళవారం మండలంలోని గుంపన్‌పల్లిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చెంచుపల్గుతండాకు చెందిన అఖిల, గుంపన్‌పల్లికి చెందిన శ్రీరాం ప్రేమించుకున్నారు. ఇటీవల దేవాలయంలో వివాహం చేసుకున్నారు. వారం రోజుల కిందట పట్టణ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

స్థానిక పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించారు. యువతి మైనర్‌ కావడంతో పెద్దలు ఎవరి ఇంటికి వారు వెళ్లాలని సూచించారు. రెండు రోజుల క్రితం యువతి గుంపన్‌పల్లికి వచ్చింది. విషయం తెలుసుకున్న యువతి సోదరుడు అఖిల్‌ మంగళవారం గుంపన్‌పల్లికి వచ్చి చెల్లెలితో మాట్లాడుతూ.. ఒక్కసారిగా తన వెంట తెచ్చుకున్న కత్తితో నడుము భాగాన పొడిచాడు.

ఆమె అరవడంతో అఖిల్‌ అక్కడి నుంచి పారిపోయాడు. ఇరుగుపొరుగు వారు వచ్చి యువతిని అచ్చంపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నాగర్‌కర్నూల్‌ ఆస్పత్రికి తరలించారు. కిడ్నీ భాగాన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తరలించినట్లు గుంపన్‌పల్లి మాజీ సర్పంచ్‌ రతన్‌సింగ్‌ తెలిపారు. అఖిల ఫిర్యాదు మేరకు సోదరుడు అఖిల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాములు తెలిపారు.

ఇవి చదవండి: కారును ఓవర్‌టేక్‌ చేస్తుండగా.. విద్యార్థి విషాదం!

whatsapp channel

మరిన్ని వార్తలు