మహారాష్ట్రలో పరువు హత్య

28 Jan, 2023 05:00 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లాలో వైద్య విద్యార్థిని పరువు హత్యకు గురైంది. ప్రేమ వ్యవహారంతో తమ పరువు తీసిందనే కోపంతో తండ్రి, సోదరుడు ఇతర కుటుంబసభ్యులు కలిసి ఆమెను ఉరి వేసి చంపి, ఆపై దహనం చేశారు. లిబ్‌గావ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పింప్రి మహిపాల్‌ గ్రామంలో ఈ నెల 22వ తేదీన ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. హోమియోపతి మెడిసిన్‌ అండ్‌ సర్జరీ(బీహెచ్‌ఎంఎస్‌) మూడో సంవత్సరం చదువుతున్న శుభాంగి జొగ్‌దండ్‌కు ఇటీవల కుటుంబసభ్యులు పెళ్లి సంబంధం కుదిర్చారు.

అయితే, తను గ్రామానికే చెందిన మరో వ్యక్తిని ప్రేమిస్తున్నానని, అతడినే పెళ్లి చేసుకుంటానని శుభాంగి వరుడికి తెలిపింది. పెళ్లి ఆగిపోవడంతో గ్రామంలో పరువు పోయిందని కుటుంబసభ్యులు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నెల 22 రాత్రి తండ్రి, సోదరుడు, మరో ముగ్గురు కుటుంబసభ్యులు కలిసి శుభాంగిని తమ పొలానికి తీసుకెళ్లి తాడుతో ఉరివేశారు. అనంతరం మృతదేహాన్ని కాల్చివేసి, మిగిలిన ఆనవాళ్లను నీళ్లలో పడవేశారు. ఈ మేరకు ఐదుగురిపై హత్య, తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.

మరిన్ని వార్తలు