హ్యాట్సాఫ్‌ డాక్టర్‌

2 Nov, 2020 13:56 IST|Sakshi

సైనికుడి తల్లికి ఉచిత చికిత్స..

సాక్షి, ముంబై: మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కి చెందిన యూరాలజిస్ట్‌ దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుడి తల్లికి ఉచిత చికిత్స చేసినందుకు గానూ రాజకీయ నాయకులతో సహా వివిధ ప్రాంతాల ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. చికిత్స తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయే సమయంలో వృద్ధురాలిని పట్టుకుని కంటతడి పెట్టుకుంటూ ఓదార్చిన డాక్టర్‌ అల్తాఫ్‌ షేక్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాంగ్రెస్‌ నాయకుడు, మహారాష్ట్ర ప్రజా వ్యవహారాలశాఖ మంత్రి అశోక్‌ చవాన్‌.. డాక్టర్‌ను స్వయంగా పిలిపించుకొని ప్రశంసించారు. 

కిడ్నీ సమస్యతో బాధపడుతూ తన దగ్గరికి వైద్యం కోసం వచ్చిన శాంతాబాయ్‌ సూరద్‌ అనే వృద్దురాలికి డాక్టర్‌ అల్తాఫ్‌ ఉచితంగా వైద్యం అందించారు. తన ఇద్దరు కుమారులను పొగొట్టుకుని నిరుపేదరాలిగా మారిన ఆమె కన్నీటిగాథ గురించి తెలుసుకుని డాక్టర్‌ అల్తాఫ్‌ కరిగిపోయారు. శాంతాబాయ్‌ ఇద్దరు కుమారుల్లో ఒకరు గుండెపోటు మరణించగా, మరొక కొడుకు ఏడు సంవత్సరాల క్రితం దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడి ఆమెకు ఉచితంగా శస్త్రచికిత్స చేశారు డాక్టర్‌ అల్తాఫ్‌. ఆస్పత్రి నుంచి ఆమెను పంపించే సమయంలో డాక్టర్‌ అల్తాఫ్‌ భావోద్వేగానికి గురయ్యారు. శాంతాబాయ్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని, కన్నీళ్లు తుడిచారు. ఈ వీడియో సోషల్‌ వైరల్‌ కావడంతో మంత్రి అశోక్‌ చవాన్‌ దృష్టిలో పడింది. డాక్టర్‌ అల్తాఫ్‌ను వ‍్యక్తిగతంగా పిలిపించుకొని ప్రశంసించారు. ఈ వీడియోను చూసినవారంతా ‘మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌’ సినిమాలోని ‘జాదూకీ జప్పీ’ సన్నివేశాలను గుర్తు చేసుకుంటున్నారు. డాక్టర్‌ అల్తాఫ్‌కు సలాం చెబుతున్నారు.

మరిన్ని వార్తలు