పుష్ప కాదు పులి.. ఊరు ఖాళీ చేయండి, అబ్బే తగ్గేదేలే

21 Apr, 2023 00:44 IST|Sakshi

టైగర్‌జోన్‌లోని మూడు గ్రామాల తరలింపునకు ప్రతిపాదనలు

సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి పంపిన అధికారులు

అనుకున్న ప్రదేశం కేటాయిస్తేనే వెళ్తామంటున్న గిరిజనులు

జన్నారం: పులి సంరక్షణ కోసం కవ్వాల్‌ అభయారణ్యంలోని గ్రామాల తరలింపునకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. పునరావాసానికి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో అడవిలోని మూడు గ్రామాల్లో మరోమారు సర్వే నిర్వహించారు. నివేదికలను ప్రభుత్వానికి పంపారు. ప్రభుత్వం నుంచి బడ్జెట్‌ విడుదల కాగానే, పునరావాస ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.

అలజడి తగ్గించే దిశగా..

అడవిలో వన్యప్రాణులకు, పులికి అలజడి లేకుండా అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అడవుల్లోకి మనుషులు, పశువులు వెళ్లకుండా నివారించారు. కోర్‌ ఏరియా పరిధిలో ఆంక్షలు విధించారు. అలజడి తగ్గించే ఏర్పాట్లు చేశారు. అయినా అడవి లోపలి గ్రామాల ప్రజలు పశువులను అడవిలోకి తోలుకెళ్తున్నారు. తరతరాలుగా అడవిలోనే ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజనులు అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ క్రమంలో అడవిలో అలజడి తగ్గడం లేదు. అలజడి తగ్గిస్తే తప్ప పులులు ఇక్కడ ఆవాసం చేసుకునే అవకాశం లేదని అధికారులు గుర్తించారు.

ఆవాసం ఉండని పులి..

కవ్వాల్‌ అభయరాణ్యాన్ని 2012, ఏప్రిల్‌ 10న టైగర్‌జోన్‌గా కేంద్రం ప్రకటించింది. ఈ టైగర్‌జోన్‌లో 893 చదరపు కిలోమీటర్ల కోర్‌ ఏరియాగా, 1,123 చదరపు కిలోమీటర్లలో బఫర్‌ ఏరియాగా ఏర్పాటు చేశారు. కవ్వాల్‌ టైగర్‌ జోన్‌కు సమీపంలోని తడోబా, ఇంద్రావతి టైగర్‌ జోన్ల నుంచి పులులు వచ్చే అవకాశాలున్నాయి. దీంతో టైగర్‌జోన్‌ పరిధిలో దట్టమైన అడవులు ఉండి, అలజడి లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అయితే అడవుల్లో పశువుల, మనుషుల సంచారం అధికంగా ఉండటంతో పులులు వచ్చి వెళ్లిపోతున్నాయి. స్థానికంగా ఆవాసం ఏర్పాటు చేసుకోవడం లేదు. ఇందుకు అలజడే కారణమని అధికారులు గుర్తించారు.

మాల తరలింపు షురూ..

అడవిలో ఉంటూ జీవనం సాగిస్తున్న గిరిజన గ్రామాలను తరలించి.. వారికి పునరావాసం కల్పించి, అలజడి తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో టైగర్‌జోన్‌ పరిధిలోని రాంపూర్‌, మైసంపేట, అలీనగర్‌, దొంగపల్లి, మల్యాల గిరిజన గ్రామాలను ముందుగా తరలించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో మొదటి దశలో నిర్మల్‌ జిల్లా కడెం మండలం రాంపూర్‌, మైసంపేట గ్రామాల ప్రజలకు పునరావాసం కలిగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేశాయి. ఈ క్రమంలో మొదటి దశలో ఈ గ్రామాల ప్రజలకు కడం మండలం కొత్త మద్దిపడగ గ్రామంలో భూమి కేటాయించి కాలనీ నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి సౌకర్యాలు కల్పిస్తే గ్రామాలు ఖాళీ చేస్తామని గిరిజనులు తెలిపారు.

కోరుకున్న ప్రదేశం కేటాయిస్తేనే..

పునరావాసం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఐదేళ్ల క్రితం విముఖత చూపిన గిరిజనులు తాజాగా సుముఖత వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామాలకు రోడ్డు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యం లేకపోవడం, కనీసం అంబులెన్స్‌ కూడా వచ్చే వీలు లేకపోవడంతో అడవి నుంచి బయటకు రావడానికి అంగీకరిస్తున్నారు. అయితే తాము కోరుకున్న ప్రాంతం కేటాయించాలని కండీషన్‌ పెడుతున్నారు. కొత్తూరుపల్లి గ్రామ సమీపంలోని సర్వే 270లో ఇళ్లు నిర్మించి వ్యవసాయ భూమి కేటాయించాలని కోరుతున్నారు. అయితే కొత్తూరుపల్లి కూడా టైగర్‌ జోన్‌ కోర్‌ ఏరియాలో ఉన్నందున పుట్టిగూడ ప్రాంతంలో భూమి కేటాయిస్తామని అటవీ అధికారులు పేర్కొంటున్నారు.

ఒక్కో కుటుంబానికి రూ.15 లక్షలు..

ఐదేళ్ల క్రితం పునరావాసం కల్పించే గ్రామాల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.10 ల క్షలు ప్రతిపాదించారు. ఇందులో కేంద్రం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు కేటాయించాలి. అయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తాజాగా ఆ మొత్తాన్ని రూ.15 లక్షలకు పెంచినట్లు అధికారులు తెలిపారు. ఒ క్కో కుటుంబానికి రూ.15 లక్షల ప్యాకేజీ లేదా భూమి ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయి. వీటికి తోడు ఇప్పుడు ఉన్న భూమికి బదులుగా భూమిని ఇస్తూ ఇళ్ల నిర్మాణం, కాలనీ ఏర్పాటు, పూర్తి సౌకార్యాలు కల్పించాలనే నిబంధన ఉంది. అయితే ఇందులో కొందరు ప్యాకేజీ తీసుకోవడానికి, కొందరు భూమి తీసుకోవడానికి సుముఖత చూపుతున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే పునరావాస పనులు ప్రారంభించే అవకాశం ఉంది.

మరో మూడు గ్రామాలకు ప్రతిపాదనలు..

కవ్వాల్‌ టైగర్‌జోన్‌ ప్రాంతంలోని జన్నారం అటవీ డివిజన్‌లో మరో మూడు అటవీ గ్రామాలను తరలించడానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మల్యాల, దొంగపల్లి, అలీనగర్‌ గ్రామాల్లో రెవెన్యూ, అటవీ అధికారులు జాయింట్‌గా సర్వే నిర్వహించారు. కుటుంబాల వివరాలు నమోదు చేశారు. తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. ఆయా గ్రామాలను వీడేందుకు గిరిజనులు కూడా అంగీకరించలేదు. తాజాగా మల్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని దొంగలపల్లి, అలీనగర్‌, మల్యాల గ్రామాలను అడవి నుంచి బయటకు తీసుకురావాలని ప్రతిపాదించారు. అలీనగర్‌లో 70 ఇళ్లు, 350 మంది, దొంగపల్లిలో 85 ఇళ్లు, 380 మంది, మల్యాలలో 55 ఇళ్లు, 130 మంది నివాసం ఉంటున్నారు. అయితే కుటుంబాల వివరాలు సేకరించేందుకు నెల క్రితం మరోసారి సర్వే నిర్వహించి 316 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను ప్రభుత్వానికి పంపారు. పునరావాసానికి కావాల్సిన నిధుల గురించి వివరించినట్లు అధికారులు తెలిపారు.

కొత్తూరుపల్లిలో కేటాయించాలి..

1994లో కొత్తూరుపల్లి ప్రాంతంలో జంగల్‌ కొట్టుకున్నాం. 270 సర్వే నంబర్‌లో మా మూడు గ్రామాలకు సరిపడా భూమి ఉంది. అక్కడకు తరలిస్తే వెళ్లడానికి సిద్ధం. జంగల్‌ కొట్టినప్పుడు మాపై కేసులు పెట్టారు. జైళ్లకు పంపారు. ఇంత కష్టపడ్డ ఆ భూమిని అటవీ అధికారులు తీసుకుంటున్నారు. మా మూడు గ్రామాలను అదే ప్రాంతానికి తరలించి సౌకర్యాలు కల్పించాలి.
– హన్మంతరావు, సర్పంచ్‌, మల్యాల

ప్రతిపాదనలు పంపాం

అటవీ గ్రామాలకు పునరావాసం కల్పించే విషయంపై సర్వే నిర్ణయించాం. ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాం. బడ్జెట్‌ కేటాయించాలని కోరాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే పునరావాసంపై నిర్ణయం తీసుకుంటాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పనులు చేపడతాం. గిరిజనుల విన్నపాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.
– సిరిపురం మాధవరావు, డిప్యూటీ కన్జర్వేటర్

మరిన్ని వార్తలు