అడుగు పడలె..!

6 Mar, 2023 04:28 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న జంగరాయి సబ్‌స్టేషన్‌

మెదక్‌జోన్‌: జిల్లాకు ఐదు విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరు కాగా నిర్మాణ పనులు మాత్రం ఒకే సబ్‌స్టేషన్‌లో కొనసాగుతున్నాయి. అది కూడా రెండేళ్ల అనంతరం. నాలుగు సబ్‌స్టేషన్లలో రెండు టెండర్‌ దశలో ఉండగా.. మరో రెండు స్థల పరిశీలన దశలో ఉన్నాయి. జిల్లాలో చెప్పుకోదగిన సాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో రైతులు బోరుబావులపై ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4 లక్షల ఎకరాల వ్యవసాయ భూములు ఉండగా.. 98,692 బోరుబావులు ఉన్నాయి. 22,855 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా 165 సబ్‌స్టేషన్ల ద్వారా సాగు, ఇళ్లకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు.

● ఒక్కో సబ్‌స్టేషన్‌ పరిధిలో ఐదు నుంచి ఆరు గ్రామాలకు విద్యుత్‌ సరఫరా అవుతుంది. లోఓల్టేజీ సమస్య ఏర్పడితే ఎల్‌సీ తీసుకోవాల్సి వస్తోంది.

● మరమ్మతులు పూర్తయ్యే సరికి గంటల తరబడి సమయం పడుతుంది. దీంతో ఆ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాలకు విద్యుత్‌ నిలిపివేస్తున్నారు.

● పంట పొలాలకు సరిపడా నీటి తడలు అందడం లేదు. ఇళ్లకు కరెంట్‌ నిలిపివేయడంతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

● అయితే లోఓల్టేజీ సమస్యలను అధిగమించేందుకు జిల్లాలో అదనంగా ఐదు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు.

● సుమారు రూ. 7 కోట్లు మంజూరు చేశారు. వీటిలో ఒక సబ్‌స్టేషన్‌ పనులే కొనసాగుతుండగా.. మరో నాలుగు నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు.

స్థలం కొనిచ్చిన రైతులు..

● గవ్వలపల్లి సబ్‌స్టేషన్‌ నుంచి పలు గ్రామాలతో పాటు గిరిజన తండాలకు విద్యుత్‌ సరఫరా అవుతుంది.

● సబ్‌స్టేషన్‌ స్థాయికి మించి విద్యుత్‌ సరఫరా కావడంతో లోఓల్టేజీ సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా బోరు మోటార్లు కాలిపోతున్నాయి.

● దీనిని అధిగమించేందుకు జంగరాయిలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం కోసం గతేడాది రూ. సుమారు రు. కోటి నిధులు మంజూరు చేశారు.

● సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం లేకపోవడంతో రైతులే సుమారు రూ. 5 లక్షలు వెచ్చించి స్వయంగా స్థలాన్ని కొనుగోలు చేసి అప్పగించారు.

● పనులు గతేడాది ప్రారంభమైనప్పటికీ సదరు కాంట్రాక్టర్‌ కొంతమేర పనులు చేసి వివిధ కారణాలతో నిలిపివేశాడు.

● మళ్లీ ఆన్‌లైన్‌ టెండర్‌ వేయగా మరో కాంట్రాక్టర్‌ ముందుకు వచ్చి పనులు చేస్తున్నాడు.

సబ్‌స్టేషన్ల నిర్మాణానికి గ్రహణం

జిల్లాలో ఐదు చోట్ల మంజూరు

టెండర్‌ దశలో రెండు, స్థల సేకరణలో మరో రెండు

జంగరాయిలో కొనసా..గుతున్న పనులు

పెండింగ్‌లో మరో నాలుగు..

అలాగే మెదక్‌ పట్టణం, మెదక్‌ మండలంలోని బాలనగర్‌, చేగుంట మండలంలోని గొల్లపల్లి, చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లికి సబ్‌స్టేషన్లు కేటాయించారు.

నిర్మాణం కోసం నిధులు సైతం మంజూరు చేశారు. మెదక్‌లో రెండు సబ్‌స్టేషన్ల నిర్మాణానికి స్థలం లేకపోవడంతో విద్యుత్‌ అధికారులు ఇప్పటికే రెవెన్యూ శాఖకు విన్నవించారు.

అలాగే చేగుంట మండలం గొల్లపల్లికి ఇంకా టెండర్‌ కాలేదు. చిన్నశంకరంపేట మండలం మీర్జాపల్లి సబ్‌స్టేషన్‌ టెండర్‌ ప్రాసెస్‌లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు.

>
మరిన్ని వార్తలు