TS Election 2023: '4,700 మందితో జాబితా'.. 45 రకాల అంశాలతో..

18 Aug, 2023 06:34 IST|Sakshi

మెదక్‌: రానున్న శాసనసభ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఎన్నికల నోడల్‌ అధికారులను నియమించగా, ఎన్నికల్లో పాల్గొనే సిబ్బంది వివరాల సేకరణలో నమగ్నమయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన నమూనా పత్రంలో సిబ్బంది వివరాలను పొందుపర్చాలని ఎన్నికల సీఈఓ జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఆయా నియోజకవర్గాల నుంచి 4,700 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులతో జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపించారు. ఉద్యోగులు, పోలింగ్‌ కేంద్రాల వారిగా విధుల కేటాయింపు, స్థానికులు, స్థానికేతరులు, సొంత నియోజకవర్గం తదితర వివరాలను ఇందులో నమోదు చేశారు. కాగా డిసెంబర్‌లో ఎలక్షన్‌ నిర్వహణకు రెండు నెలల్లో షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

అంశాల వారీగా సమాచారం..
జిల్లా నుంచి పోలింగ్‌లో పాల్గొనే ఉద్యోగుల వివరాలను పొందుపర్చేందుకు 45 అంశాలతో కూడిన ప్రత్యేక ఫార్మాట్‌ను ఇవ్వగా, ఇప్పటికే ఉద్యోగుల వివరాలను అందులో నమోదు చేసి అప్‌లోడ్‌ చేశారు. ఉద్యోగి వేతనం, ఐడీ నంబర్‌తో సహా ఏ శాఖ, హోదా, ఏ నియోజకవర్గంలో పని చేస్తున్నారు, పోలింగ్‌ సమయంలో ఎక్కడ ఉంటారు, సొంత గ్రామం ఏ నియోజకవర్గ పరిధిలో ఉంది, ప్రస్తుత చిరునామా, అతడు దివ్యాంగుడా, సకలాంగుడా వంటి.. వ్యక్తిగత సమాచారం సేకరించినట్లు ఓ అధికారి తెలిపారు.

గత ఎన్నికల్లో ఏ పోలింగ్‌ కేంద్రంలో ఏ హోదాలో విధులు నిర్వర్తించారు, ఉద్యోగి ఐడీ కార్డు, నేరచరిత్ర, బ్యాంకు ఖాతా తదితర అంశాలు కూడా ఈ ఫార్మట్‌లో ఉన్నాయి. వాటి ప్రకారం ఉద్యోగులు ఎన్నికల విధులు నిర్వర్తించేలా వారి వివరాలను పొందుపరిచారు. మెదక్‌ నియోజకవర్గంలో 274, నర్సాపూర్‌లో 302పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి. రెండు చోట్ల పని చేస్తున్న ఉద్యోగుల వివరాలను ఈ ఫార్మాట్లలో చేర్చారు. కాగా గతంలో ఏ ఎన్నికల్లోనూ ఇన్ని రకాల వివరాలు అడగలేదని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

ఓటరు నమోదుపై ప్రచారం..
18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు కావాలని అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్‌ 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతను ఓటరుగా చేర్పించేందుకు అధికారులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ నెల 26, 27 తేదీల్లో ఓటరు నమోదుకు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. 21న ఓటరు ముసాయిదా జాబితాపై ప్రకటన చేయడంతోపాటు సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.

ఈ సమయంలో బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటి వరకు ఓటరు జాబితాలో పేరు లేని వారు ఫారం 6, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిన వారు, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఫారం 7ను పూర్తిచేయాలి. పేరు, తల్లిదండ్రుల పేర్లు తప్పుగా ప్రచురణ అయినా, ఇంటి నంబర్‌ మార్పుల కోసం ఫారం 8ను ఉపయోగించి వివరాలను అందించాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు