మైనంపల్లి రోహిత్‌ దారెటు?

22 Aug, 2023 18:41 IST|Sakshi

మెదక్‌: మెదక్‌ టికెట్‌ తనకే వస్తుందని ఆశాభావంతో గత ఆరు నెలలుగా నియోజకవర్గంలో సొంత డబ్బులతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు డాక్టర్‌ మైనంపల్లి రోహిత్‌. తీరా సోమవారం సీఎం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారు. కాగా ఇన్నాళ్లు తననే నమ్ముకుని వెంట వచ్చిన వారికి న్యాయం చేయాలంటే తన కొడుకును పోటీలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి.

మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళతారా..? లేక బీజేపీలో చేరి పోటీలో నిలబడతారా, లేక స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా.. అనే చర్చసాగుతోంది. మంత్రి హరీశ్‌రావుపై ఆయన చేసిన విమర్శల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌లో కొనసాగే అవకాశం లేదని, మల్కాజ్‌గిరి టిక్కెట్‌ను కూడా హన్మంతరావు తిరస్కరిస్తారని ఆయన వర్గీయులు చెబుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. మెదక్‌ బరిలో దిగి సత్తా చాటాలని హన్మంతరావు భావిస్తున్నట్లు చెబుతున్నారు. మొత్తానికి ఈ సారి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మకు పలువురు నుంచి గట్టి పోటీ తప్పేలాలేదు.

మైనంపల్లి రోహిత్ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ?

ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొడుకయిన రోహిత్ గత కొన్నాళ్లుగా వేర్వేరు రాజకీయ, సామాజిక  కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మెడిసిటీ నుంచి MBBS చదివి డాక్టర్ అయిన రోహిత్.. మెడికల్ ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రూటు మార్చారు. "మైనంపల్లి సోషల్ సర్వీస్ అర్గనైజేషన్" పేరిట ఓ స్వచ్ఛంధ సంస్ధను నెలకొల్పి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. ముఖ్యంగా కోవిడ్ సమయంలో మల్కాజ్ గిరితో పాటు మెదక్ లో వేర్వేరుకార్యక్రమాలు చేపట్టారు. శానిటైజర్లు, మాస్క్ ల పంపిణీ, కమ్యూనిటీ హళ్ల నిర్మాణం, పేదలకు బియ్యం పంపిణీ, కాలనీల్లో సిసి కెమెరాల ఏర్పాటు చేశారు. మెదక్ నుంచి ఎలాగైనా టికెట్ వస్తుందన్న నమ్మకంతో ఇప్పటికే కోట్లాది రుపాయలు అక్కడ ఖర్చు పెట్టినట్టు సమాచారం. 

ఇక సిల్వర్ స్పూన్ తో పుట్టిన రోహిత్ లైఫ్ స్టైల్ లోనూ అదే తరహాలో కనిపిస్తాడు. ఫెర్రారీ 488 స్పైడర్, మెర్సిడెస్ AMG, రేంజ్ రోవర్స్, ఆడి కార్లతో పాటు తరచుగా హర్లీ డేవిడ్ సన్ బైక్ లపై తిరుగుతాడు. ముఖ్యంగా మల్కాజ్ గిరిలో సీఎం కెసిఆర్ కు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా రోహిత్ సందడే ఎక్కువగా కనిపిస్తుంది. వేలాది బ్యానర్లు, నిలువెత్తు కటౌట్లతో బోలెడు ప్రచారం నిర్వహించడం మైనంపల్లి కుటుంబానికే చెల్లింది. 

చదవండి: మైనంపల్లిపై వేటుకు రంగం సిద్ధం! 

మరిన్ని వార్తలు