మూడు నామినేషన్ల ఉపసంహరణ

15 Nov, 2023 04:36 IST|Sakshi
శ్రావికను అభినందిస్తున్న ఉపాధ్యాయులు

నర్సాపూర్‌: నర్సాపూర్‌ నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ముగ్గురు తమ నామినేషన్లను మంగళవారం ఉపసంహరించుకున్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు గాలి అనీల్‌కుమార్‌ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా, బీఆర్‌ఎస్‌కు చెందిన లకావత్‌ రమేశ్‌ స్వతంత్ర అభ్యర్థిగా, పిట్ల నవీన్‌కుమార్‌ యుగతులసి పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేయగా, వారు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

నర్సాపూర్‌రూరల్‌: నర్సాపూర్‌ మండలం జక్కపల్లి మోడల్‌ స్కూల్‌ విద్యార్థిని ఎస్‌జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి ప్రథమ స్థానంలో నిలిచారు. తొర్రూర్‌లో జరిగిన ఎస్‌జీఎఫ్‌ పోటీల్లో భాగంగా అండర్‌–19 విభాగంలో ఉషు ఆటలో ఇంటర్‌ విద్యార్థిని శ్రావిక ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా శ్రావికను పాఠశాల అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, పీడీ అశోక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

బాలలతో పనులు చేయిస్తే

చట్టరీత్యా చర్యలు

శివ్వంపేట(నర్సాపూర్‌): బాలలతో పనులు చేయిస్తే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని నర్సాపూర్‌ కోర్టు ిసివిల్‌ జూనియర్‌ న్యాయమూర్తి అనిత హెచ్చరించారు. మంగళవారం మండల పరిధి మగ్దూంపూర్‌లోని బేతానీ సంరక్షణ అనాథ ఆశ్రమంలో జాతీయ బాలల దినోత్సవం నిర్వహించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ నర్సాపూర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి అనిత ముఖ్య అతిథి గా హాజరై మాట్లాడారు. అనంతరం పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు. ఆశ్రమానికి రూ.8 వేలు విరాళం అందజేశారు. అనాథ పిల్లలను ఆదరిస్తున్న ఆశ్రమ నిర్వాహకుడు సజీవ్‌ వర్గీస్‌ని అభినందించారు. కార్యక్రమంలో లీగల్‌ సర్వీస్‌ న్యాయవాది స్వరూపరాణి, సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటేశ్వర్లు, హెడ్‌ కానిస్టేబుల్‌ దేవదాస్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

మూకుమ్మడి రాజీనామా

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

సింగాయిపల్లి గోపి

నర్సాపూర్‌ : తనతోపాటు చాలా మంది పార్టీ నాయకులు మూకుమ్మడిగా బీజేపీకి రాజీనామా చేస్తున్నామని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సింగాయిపల్లి గోపి తెలిపారు. మంగళవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలోని 138 మంది బూత్‌ కమిటీల అధ్యక్షులు, శివ్వంపేట పార్టీ మండల అధ్యక్షుడు రవిగౌడ్‌, నర్సాపూర్‌ మండల మాజీ అధ్యక్షుడు మాణయ్య, కౌన్సిలర్‌ సునీతా, మండల రూరల్‌ పార్టీ ఇన్‌చార్జి బాల్‌రెడ్డి, ఎనిమిది మంది వార్డు మెంబర్లు రాజీనామా చేసి తమ రాజీనామా పత్రాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపుతున్నామని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలానికి చెందిన ఎంపీటీసీ నర్సింలు, మరో మండల పార్టీ అధ్యక్షుడితోపాటు మరి కొందరు నాయకులు త్వరలో పార్టీకి రాజీనామా చేస్తారని వివరించారు. ఈటల రాజేందర్‌ బీజేపీలో చేరిన తర్వాత సిద్ధాంతాలు కనుమరుగయ్యాయని, కుల రాజకీయాలకు ప్రాధాన్యత పెరిగిందని ఆయన ఆరోపించారు. ఇటీవల పార్టీలో చేరిన మురళీయాదవ్‌కు నర్సాపూర్‌ టికెట్‌ ఇవ్వడాన్ని సింగాయిపల్లి తప్పుపడుతూ పార్టీలోకి వచ్చిన వారికి పార్టీ హోల్‌సెల్‌గా అమ్ముడు పోయిందని ఆరోపించారు. మురళీయాదవ్‌ కాంగ్రెస్‌ పార్టీతో కుమ్ముక్కు అయ్యారని ఇటీవల ఆయన హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి రాజిరెడ్డితో సమావేశమయ్యారని ఆరోపించారు. సమావేశంలో శివ్వంపేట పార్టీ మండల అధ్యక్షుడు రవిగౌడ్‌, బాల్‌రెడ్డి, మాణయ్య పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు