కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి

5 Dec, 2023 05:30 IST|Sakshi
యాదగిరిగుట్టలో నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి తదితరులు

నర్సాపూర్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ను నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం ఎర్రవల్లి ఫాంహౌజ్‌లో కలిశారు. ఎన్నికల అధికారులు ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటించిన అనంతరం మొదటిసారి కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను మర్యాద పూర్వకంగా కేసీఆర్‌ను కలిసినట్లు తెలిపారు. ఎన్నికల అధికారులు అందజేసిన సర్టిఫికెట్‌ను కేసీ ఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకరామిరెడ్డికి చూపించినట్టు సునీత వివరించారు. గెలిచిన ఎమ్మెల్యేలతో త్వరలో లెజిస్టేచర్‌ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ తెలిపినట్టు ఆమె చెప్పారు. జిల్లాతో పాటు ఇతర జిల్లాలలో గెలిచిన పలు వురు ఎమ్మెల్యేలతో పాటు ఓడిన అభ్యర్థులు సైతం కేసీఆర్‌ను కలిసినట్లు తెలిసింది.

లక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఎమ్మెల్యే

నర్సాపూర్‌: ఎన్నికల్లో నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందిన సునీతారెడ్డి సోమవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకుని తన మొక్కును చెల్లించారు. ఆమె బీఆర్‌ఎస్‌ నర్సాపూర్‌ అభ్యర్థిగా బీ ఫామ్‌ను అక్టోబరులో అందుకున్నారు. అదే రోజు ఆమె యాదగిరిగుట్టకు వెళ్లి స్వామికి పూజలు చేశారు. ఈ నెల 3న ఓట్లను లెక్కించగా ఆమె నర్సాపూర్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తన మొక్కును తీర్చుకునేందుకు ఆమె తన కుటుంబ సభ్యులతో సోమ వారం ఉదయం యాదగిరిగుట్టలో ప్రత్యేక పూజలు చేసి మొక్కును చెల్లించారు.

నేతల శుభాకాంక్షలు

మనోహరాబాద్‌(తూప్రాన్‌): నర్సాపూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా గెలిచిన సునీతారెడ్డిని జిల్లా ఉపసర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు రేణుకుమార్‌ కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం మండలంలోని పర్కిబండ, పోతారం, గౌతోజీ గూడెం గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు పూల అర్జున్‌, మాధవరెడ్డి, వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ శ్రీలతాఆనంద్‌, పలువురు ప్రజాప్రతినిధులు గోమారంలోని ఆమె నివాసంలో సునీతారెడ్డిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

>
మరిన్ని వార్తలు