స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లి..

20 Feb, 2024 05:28 IST|Sakshi

అల్లాదుర్గం/పాపన్నపేట(మెదక్‌): స్నేహితుడి నిశ్చితార్థానికి వెళ్లిన ముగ్గురు స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. ఈసంఘటన అల్లాదుర్గం మండల పరిధిలోని పెద్దాపూర్‌ గ్రామ శివారులో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. సాయంత్రానికి తిరిగి వస్తారనుకున్న కొడుకులు శవాలుగా మారారన్న వార్త విన్న ఆ కుటుంబీకులు తల్లడిల్లిపోయారు.

వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని బాచారం గ్రామానికి చెందిన చిలుంగారి సుభాష్‌కు అందోల్‌ మండలం నాదులాపూర్‌కు చెందిన అమ్మాయితో పెళ్లి ఖాయమైంది. ఈక్రమంలో సోమవారం నిశ్చితార్థం నిర్ణయించారు. దీంతో అతడి స్నేహితులైన గడ్డం ప్రభాకర్‌ (28), గడ్డం భీమయ్య (24), శ్రీకాంత్‌ (24)తో పాటు తుడుం మాసయ్య నలుగురు ఒకే బైక్‌పై నాదులాపూర్‌ వెళ్లారు. నిశ్చితార్థం ముగించుకొని తిరిగి వస్తుండగా గడీ పెద్దాపూర్‌ వద్ద ఓ కారు వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో మాసయ్య తప్ప మిగిలిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. కాగా గాయపడిన మాసయ్యను చికిత్స నిమిత్తం జోగిపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.

మూడు పదులకే మృత్యుఘోష..
స్నేహితుని నిశ్చితార్థానికి వెళ్లిన ముగ్గురు స్నేహితుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. మూడు పదుల వయసులోనే నూరేళ్లు నిండాయని కుటుంబ సభ్యులు విలపించారు. ప్రభాకర్‌కు భార్య భాగ్య, ఒక కొడుకు, కూతురు ఉన్నారు. వృద్ధులైన తల్లిదండ్రులు కొడుకు మరణవార్త విని తల్లడిల్లిపోయారు. భీమయ్య, శ్రీకాంత్‌కు పెళ్లిళ్లు కాలేదు. కాగా శ్రీకాంత్‌ ఒక్కడే కొడుకు. అతడికి చెల్లెలు, తల్లిదండ్రులు ఉన్నారు. భీమయ్యకు నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. గ్రామంలో అందరితో కలిసిమెలసి ఉండే స్నేహితులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంతో బాచారం ఘోల్లుమంది. బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు పెద్దఎత్తున సంఘటన స్థలికి తరలివెళ్లి కన్నీరుమున్నీరయ్యారు.

whatsapp channel

మరిన్ని వార్తలు