ప్రాణం తీసిన పంచాయితీ పెద్దల తీర్పు

20 Feb, 2024 13:25 IST|Sakshi

పాపన్నపేట(మెదక్‌): పెద్ద మనుషుల తీర్పు ఓ గిరిజన మహిళ పాలిట శాపంగా మారింది. ఈ సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని అమ్రియా తండాలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన లునావత్‌ విజయ (30), దీప్లా దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కూతురు, కొడుకు ఉన్నారు. మూడేళ్ల క్రితం దీప్లా విద్యుత్‌షాక్‌కు గురై మృతిచెందాడు. అయితే 2014లో గ్రామానికి చెందిన ఓ గిరిజన నాయకుడి వద్ద ఈ దంపతులు రూ. లక్ష అప్పు తీసుకున్నారు.

ఈ విషయమై ఇటీవల తండాలో పంచాయితీ నిర్వహించారు. ఇందులో రూ.1.50 లక్షల అప్పు కట్టాలని పెద్దలు తీర్పు చెప్పారు. అయితే తాము తీసుకున్న అప్పులో రూ. 80 వేలు చెల్లించామని బాధితురాలు విజయ పంచాయితీలో వాపోయింది. తమకు అప్పు ఇచ్చిన వ్యక్తి సొసైటీ చైర్మన్‌ కావడంతో తన మామ ధర్మా పేరు మీద రూ. 50 వేల బైక్‌ లోన్‌ సైతం తీసుకున్నాడని తెలిపింది.

కానీ ఇవేవి పంచాయితీ పెద్దలు పట్టించుకోకుండా రూ.1.50 లక్షలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు. దిక్కుతోచని విజయ.. సోమవారం పురుగు మందు తాగగా.. వెంటనే ఆమెను కుటుంబీకులు మెదక్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. కాగా, తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబ సభ్యులు పోలీస్‌స్టేషన్‌ ఎదుట భైఠాయించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేష్‌ తెలిపారు.

whatsapp channel

మరిన్ని వార్తలు