10Th Class Diaries Movie Review: శ్రీరామ్‌, అవికాగోర్‌ 'టెన్త్‌ క్లాస్ డైరీస్‌' సినిమా రివ్యూ

1 Jul, 2022 08:27 IST|Sakshi
Rating:  

టైటిల్‌: టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌
నటీనటులు: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాస్ రెడ్డి, అచ్యుత రామారావు, అర్చన, హిమజ, శివబాలాజీ, నాజర్‌ తదితరులు
దర్శకత్వం, సినిమాటోగ్రఫీ: 'గరుడవేగ' అంజి
నిర్మాతలు: అచ్యుత రామారావు, రవితేజ మన్యం, రవి కొల్లిపార
సంగీతం: సురేష్‌ బొబ్బిలి
విడుదల తేది: జులై 1, 2022

అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు. పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి అజయ్ మైసూర్ సమర్పకులు. ప్రముఖ- ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అయ్యారు. 'టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌' చిత్రం శుక్రవారం (జులై 1) ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేర మెప్పించిందో రివ్యూలో చూద్దాం.

10Th Class Diaries Movie Cast

కథ:
మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి సోమయాజ్‌ (శ్రీరామ్‌) బాగా చదువుకుని అమెరికాలో బిజినెస్‌ మ్యాన్‌గా స్థిరపడతాడు. డబ్బు, అమ్మాయిలు, లగ్జరీతో లైఫ్‌ ఎంజాయ్‌ చేస్తుంటాడు. కానీ తన జీవితంలో ఏదో చిన్న అంసతృప్తి. ఈ వెలితీతో జీవిస్తున్న అతనికి ఆనందం లేదు. అతని భార్య కూడా వదిలేస్తుంది. తను ఏది మిస్‌ అవుతున్నాడో తెలుసుకునేందుకు ఒక సైకియాట్రిస్ట్‌ను సంప్రదిస్తాడు. ఈ క్రమంలోనే అతని ఆనందం టెన్త్‌ క్లాస్‌ చదివేటప్పుడు ప్రేమించిన తన ఫస్ట్‌ లవ్‌ చాందినీ (అవికా గోర్‌) దగ్గర ఉందని. దీంతో టెన్త్ క్లాస్ రీ యూనియన్‌కు ప్లాన్‌ చేస్తాడు. మరీ ఆ రీ యూనియన్‌ ప్లాన్‌ ఎంతవరకు వర్కౌట్‌ అయింది ? చాందినీని కలుసుకున్నాడా ? అసలు చాందినీకి ఏమైంది ? అనే తదితర విషయాలను తెలుసుకోవాలంటే కచ్చితంగా ఈ 'టెన్త్‌ క్లాస్‌ డైరీస్‌'కు వెళ్లాల్సిందే. 

10Th Class Diaries Movie Review In Telugu

విశ్లేషణ:
యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు మనసులు హత్తుకునేలా ఉంటాయి. కానీ అలాంటి కథలతో వచ్చే సినిమాలు కాస్తా అటు ఇటు అయిన తేడా కొడుతుంటాయి. అలాంటిదే ఈ కథ. నిర్మాత అచ్యుతరామారావు జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమ కారణంగా ఒక అమ్మాయి జీవితం ఎలా మారిందనే అంశంతో ఈ కథను రూపొందించారు. ప్రేమికుడి నిర్లక్ష్యం, తండ్రి అతి ప్రేమ ఒక అమ్మాయి జీవితాన్ని ఎలా నాశనం చేశాయో ఈ సినిమా ద్వారా చూపించారు. నిజానికి ఇలాంటి ఒక మంచి కథను ఎంచుకున్నందుకు దర్శకనిర్మాతలను మెచ్చుకోవాల్సిందే. కానీ వారు ఎంచుకున్న కథను పక్కాగా వెండితెరపై ఆవిష్కరించలేకపోయారు. 

ప్రేమించిన అమ్మాయి కోసం వెతికేందుకు చేసిన రీ యూనియన్‌, దానిలో భాగంగా వచ్చే సీన్లు ఇంతకుముందు వచ్చిన కొన్ని సినిమాలను గుర్తు చేస్తాయి. హాఫ్‌ బాయిల్‌ (శ్రీనివాస్‌ రెడ్డి), గౌరవ్‌ నిర్మాత (అచ్యుత రామారావు) మధ్య వచ్చే సీన్లు మాత్రం చాలా ఆకట్టుకుంటాయి. వీరిద్దరి నటనతో ప్రేక్షకులను తెగ నవ్వించారు. కానీ సోమయాజ్‌, చాందినీ ప్రేమ సన్నివేశాలు కొంచెం రొటీన్‌ ఫీల్ కలిగిస్తాయి. ఈ లవ్‌ ఎపిసోడ్ అంతగా ఆకట్టుకోదు. అయితే సెకండాఫ్‌లో హీరోయిన్‌ కోసం వెతికే ట్రాక్ బాగుంటుంది. ఓవైపు నవ్విస్తూనే అమ్మాయిల జీవితంలో కోరుకునే విషయాలు, వారు ఎదుర్కొనే సమస్యలను బాగా చూపించారు. ఊహించని విధంగా ఉండే క్లైమాక్స్‌ ప్రేక్షకులను కదిలిస్తుంది. మూవీ మొత్తం ఎలా ఉన్న క్లైమాక్స్‌కు వచ్చేసరికి మాత్రం ఆడియెన్స్‌కు ఒక మంచి సినిమా చూశామనే అనుభూతిని కలిగిస్తుంది.

10Th Class Diaries Movie Stills 

ఎవరెలా చేశారంటే?
తన ఫస్ట్ లవ్‌ను దక్కించుకోవాలనే ప్రేమికుడిగా, ఆనందం మిస్ అయిన బిజినెస్‌ మ్యాన్‌గా శ్రీరామ్ పర్వాలేదనిపించాడు. అయితే ఇంతకుముందు 'రోజాపూలు' సినిమాలో చూసిన శ్రీరామ్‌ నటన, ఆ ఈజ్‌ ఎక్కడో మిస్‌ అయినట్లుగా అనిపిస్తుంది. ఇక అవికా గోర్ నటన కూడా పర్వాలేదనిపించింది. ఆమె పాత్ర నిడివి కాస్త తక్కువగా ఉంది. హీరో ఫ్రెండ్స్‌గా చేసిన శ్రీనివాస్ రెడ్డి, నిర్మాత అచ్యుత రామారావు కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తాయి. కమెడియన్‌గా అచ్యుత రామారావుకు మంచి భవిష్యత్తు ఉందనే చెప్పవచ్చు. వీరితోపాటు హిమజ, అర్చన, శివ బాలాజీ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. నాజర్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రి పాత్రలో ఆకట్టుకున్నారు. 

ఇక సినిమాలోని బీజీఎం '96' మూవీని తలపిస్తుంది. ఇక 'గరుడవేగ' అంజికి ఇది మొదటి సినిమా కావడంతో కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. కానీ సినిమాను తెరకెక్కించడంలో సక్సెస్‌ అయ్యారు. రీ యూనియన్‌ సీన్లు ఇంకొంచెం బాగా రాసుకోవాల్సింది. సినిమాలోని డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. ఆలోచింపజేసేలా ఉంటాయి. మొత్తంగా ఈ 'టెన్త్ క్లాస్ డైరీస్‌' మీ స్కూల్‌ డేస్‌ జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తుంది. చాలవరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే చెప్పవచ్చు. 

-సంజు (సాక్షి వెబ్‌డెస్క్‌)

Rating:  
(2.5/5)
మరిన్ని వార్తలు