110 మంది నటించిన ‘చిత్రం’

22 Oct, 2020 13:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : సలామ్‌ బాంబే, ది నేమ్‌సేక్, మాన్‌సూన్‌ వెడ్డింగ్‌ లాంటి విభిన్న కథాంషాలతో సినిమాలు తీసి బాలీవుడ్‌ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యక స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ప్రముఖ మహిళా దర్శకురాలు మీరా నాయర్‌ నుంచి మరో ఆణిముత్యం లాంటి సినీ సిరీస్‌ వెలువడింది. ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ పేరిట ఆమె తీసిన ఆరు అంకాల (ఆరు గంటల) సినీ సీరిస్‌ను బీబీసీ టెలివిజన్‌ ఛానల్‌ జూలై నెలలోనే ప్రసారం చేయగా, శుక్రవారం నుంచి (అక్టోబర్‌ 23) ‘నెట్‌ఫ్లిక్స్‌’లో ఇది ప్రసారం అవుతుంది.

ఈ సినీ సిరీస్‌ ఇంగ్లీషు వర్షన్‌ను బీబీసీ ప్రసారం చేయగా, ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఇంగ్లీషుతోపాటు ప్రత్యేకించి భారతీయుల కోసం హిందీ వర్షన్‌కు అందుబాటులోకి వస్తోంది. ఎంతో ప్రజాదరణ పొందిన విక్రమ్‌ సేథ్‌ రాసిన ‘ఏ సూటబుల్‌ బాయ్‌’ నవలనే మీరా నాయర్‌ తెర కెక్కించారు. ఈ సినిమాకు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ సినిమాను బీబీసీయే నిర్మించినప్పటికీ బీబీసీ నిబంధనలను ఉల్లంఘించి మరి మీరా నాయర్‌ తెరకెక్కించారు. ఆంగ్ల చిత్రంలో 20 శాతానికి మించి సంభాషణల్లో అన్య భాషా పదాలుండకూడదన్నది బీబీసీ నియమం. అంతకుమించి సంభాషణల్లో హిందీ, ఉర్దూ, అవిధి భాషలను మీరా నాయర్‌ ఉపయోగించారు.

తొలి భారత స్వాతంత్య్ర ఎన్నికల నేపథ్యంలో సాగే కథాకాలానికి ఆధునికతను జోడించి తీసిన ఈ సినీ సిరీస్‌లో ఏకంగా 110 మంది నటీనటులు పాల్గొనడం విశేషం. టబూ, తాన్య మానిక్తాలా, ఇషాన్‌ కట్టర్, నమిత్‌ దాస్‌ లాంటి విశిష్ట నటీ నటులున్నారు. కరోనా కట్టడి కోసం లాక్‌డౌన్‌లో భాగంగా సినిమా థియేటర్లు మూత పడడంతో ప్రేక్షకులు సినిమాల కోసం ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫారమ్‌లనే ఆశ్రయిస్తున్న విషయం తెల్సిందే. 

మరిన్ని వార్తలు