Tollywood: ద్యావుడా.. ఒకే రోజు 17 సినిమాలు...ఎందుకిలా?

7 Dec, 2022 11:51 IST|Sakshi

ఒకే వారంలో నాలుగైదు చిన్న సినిమాలు రిలీజ్‌ అవ్వడం టాలీవుడ్‌కి కొత్తేమి కాదు. ఒక్కోసారి 7-8 సినిమాలు కూడా రిలీజ్‌ అయిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ వారంతం ఒకటి కాదు రెండు కాదు.. ఒకేసారి 17 సినిమాలు బాక్సాఫీస్‌ బరిలోకి దిగబోతున్నాయి. టాలీవుడ్‌లో ఇదో రికార్డు అని చెప్పొచ్చు. 

సాధారణంగా పండుగ సీజన్స్‌లో పెద్ద సినిమాలు ఎక్కువగా విడుదలవుతాయి కాబట్టి చిన్న చిత్రాలు వెనక్కి తగ్గి.. పోటీలేని టైమ్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి. ఈ క్రమంలో చిన్న చిత్రాల మధ్య బాక్సాఫీస్‌ వార్‌ మొదలవుతుంది. ‘తగ్గేదే లే’ అన్నట్లుగా ఒకేసారి ఐదారు బరిలోకి దిగుతాయి.  కొంచెం పాజిటివ్‌ టాక్‌ వచ్చినా చాలు సేఫ్‌ జోన్‌లోకి వెళ్లిపోతాయి. కానీ నెగెటివ్‌ టాక్‌ వస్తే.. మరుసటి రోజే థియేటర్స్‌ నుంచి బయటకు వెళ్లాల్సిందే. అందుకే పోటీగా ఎక్కువ చిత్రాలు ఉన్నా.. విడుదలకు వెనక్కి తగ్గరు చిన్న నిర్మాతలు. 

(చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!)

అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్‌ పోరు మాములుగా లేదు. ఈ ఏడాది చివరి మాసం కావడం.. సంక్రాంతి బరిలో వరుసగా పెద్ద చిత్రాలు ఉండడంతో.. డిసెంబర్‌ 9న ఏకంగా 17 చిన్న చిత్రాలు రిలీజ్‌ అవుతున్నాయి. ఎన్ని థియేటర్స్‌ దొరికాయి.. ఎక్కడెక్కడ దొరకలేదు అనే విషయాన్ని పట్టించుకోకుండా.. మన సినిమా విడుదలైతే చాలు..అదే పదివేలు అన్నట్లుగా చిన్న నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. 

ఈ శుక్రవారం విడుదలయ్యే సినిమాల జాబితాలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్‌జీ, ప్రేమదేశం(ఈ ఓల్డ్‌ చిత్రం మళ్లీ థియేటర్స్‌లో విడుదలవుతుంది), రాజయోగం, డేంజరస్‌, విజయానంద్‌, ఏపీ 04 రామపురం, ఐ లవ్ యు ఇడియట్, మనం అందరం ఒక్కటే, ఆక్రోశం, ఏయ్ బుజ్జి నీకు నేనే, సివిల్‌ ఇంజనీర్‌ చిత్రాలు ఉన్నాయి. వీటిలో గుర్తుందా శీతాకాలం, పంచతంత్రం, డేంజరస్‌తో పాటు మరో  రెండు, మూడు చిత్రాలు మాత్రమే ప్రచారం ప్రారంభించాయి. మిగతా చిత్రాలన్ని కేవలం పోస్టర్‌, ట్రైలర్‌ విడుదల చేసి నేరుగా థియేటర్స్‌లోకి వస్తున్నాయి. మరి వీటిలో ఏ సినిమాలు ప్రేక్షకులను మెప్పించి విజయం సాధిస్తాయో చూడాలి.

మరిన్ని వార్తలు