Palnati Surya Pratap: మా గురువు సుకుమార్‌ అలా కాదు: పల్నాటి సూర్య ప్రతాప్‌

21 Dec, 2022 08:50 IST|Sakshi

‘‘చాలామంది ఓ ఐడియా కోసం వర్క్‌ చేస్తారు. కానీ నా గురువు, నేను అన్నయ్యలా భావించే సుకుమార్‌గారు మాత్రం ఓ కొత్త ఐడియా వచ్చిన తర్వాత దానిపై డెప్త్‌గా వర్క్‌ చేస్తుంటారు. అలాగే అన్నింటికన్నా కథే గొప్పదని ఆయన అంటారు. నేనూ అదే నమ్ముతాను’’ అన్నారు పల్నాటి సూర్య ప్రతాప్‌. నిఖిల్, అనుపమా పరమేశ్వరన్‌ జంటగా నటించిన చిత్రం ‘18 పేజెస్‌’. దర్శకుడు సుకుమార్‌ అందించిన కథతో పల్నాటి సూర్యప్రతాప్‌ దర్శకత్వంలో అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో పల్నాటి సూర్యప్రతాప్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో కేవలం ప్రేమకథే కాదు.. విభిన్న రకాల భావోద్వేగాలు ఉన్నాయి.

అలాగే ఫన్, థ్రిల్లింగ్‌ అంశాలు ఉన్నాయి. అందుకే ఇది రొటీన్‌ లవ్‌స్టోరీ కాదని చెబుతున్నాం. సినిమా చూస్తున్నంత సేపూ ప్రేక్షకులు ఇందులోని క్యారెక్టర్స్‌తో ట్రావెల్‌ అవుతుంటారు. కొన్ని సందర్భాల్లో తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నిఖిల్, అనుపమ అద్భుతంగా నటించారు. గీతా ఆర్ట్స్‌లో సినిమా చేస్తున్నానని దర్శకులు గౌరవంగా చెప్పుకుంటారు. అలాంటి బ్యానర్‌ అది. కొంత గ్యాప్‌ తర్వాత ‘18 పేజెస్‌’ సినిమాతో దర్శకుడిగా వస్తున్న నాకు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు అల్లు అరవింద్‌గారు. ఈ సినిమా ఎండింగ్‌ పాజిటివ్‌గా ఉంటుంది’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ.. ‘‘కుమారి 21ఎఫ్‌’ చిత్రం తర్వాత దాదాపు ఏడేళ్లకు నా దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. నేను కావాలని గ్యాప్‌ తీసుకోలేదు. ‘కుమారి 21ఎఫ్‌’ తర్వాత రైటింగ్‌ గురించి ఇంకా నేర్చుకోవాలని నా గురువు సుకుమార్‌గారి దగ్గర చేరాను. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను. అయితే దర్శకుడిగా ఇక నాకు గ్యాప్‌ ఉండకూడదని మేం నిర్ణయించుకున్నాం. సుకుమార్‌గారు, నేను అనుకున్న కథలు మూడు ఉన్నాయి. నేనూ ఓ కథ అనుకున్నాను. నా తర్వాతి చిత్రం మైత్రీ మూవీస్‌లో ఉంటుంది. అలాగే సితార ఎంటర్‌ టైన్మెంట్స్‌లో ఓ కమిట్‌మెంట్‌ ఉంది’’ అన్నారు.  

మరిన్ని వార్తలు