ఇది సిసలైన కేరళ స్టోరీ.. పది రోజుల్లో వందకోట్ల క్లబ్‌లోకి..!

16 May, 2023 21:25 IST|Sakshi

భారత చలన చిత్ర పరిశ్రమల్లో మాలీవుడ్‌ ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. చిన్న కథలు.. విలేజ్‌ డ్రామాలే అయినా సూపర్‌ సక్సెస్‌ అవుతుంటాయి. అయితే గత కొంతకాలంగా అక్కడి కలెక్షన్ల విషయంలో వరుసగా చిన్నాపెద్ద చిత్రాలు నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో ‘2018’ పెనుసంచలనం సృష్టించింది.  వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిందీ చిత్రం.

సుమారు 15 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ‘2018’.. మే 5వ తేదీన రిలీజ్‌ అయ్యింది. కేవలం పదిరోజుల్లోనే వంద కోట్ల రూపాయలు వసూలు చేసింది. అదీ పాన్‌ ఇండియా సినిమాగా కాదు.. కేవలం మలయాళంలోనే రిలీజ్‌ అయ్యి మరి. సర్వైవల్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు అక్కడి ఆడియొన్స్‌.

జూడ్‌ ఆంథనీ జోసెఫ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘2018’ చిత్రం.. కేవలం పదిరోజుల్లోనే వందకోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇంత వేగంగా ఈ ఘనత సాధించిన మలయాళ చిత్రం మాత్రం ఇదే. గతంలో లూసిఫర్‌, కురూప్‌ లాంటి చిత్రాలు ఈ లిస్ట్‌లో ఉన్నా ఫుల్‌ రన్‌లో ఆ ఫీట్‌ను సాధించాయి.  

2018లో కేరళను వరదలు అతలాకుతలం చేశాయి. వందల మంది మరణించారు. లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఆ నేపథ్యాన్ని కథాంశంగా ఎంచుకున్నారు డైరెక్టర్‌ జూడ్‌ ఆంథనీ. సామాన్యుడు అసాధారణ హీరోలుగా మారితే ఎలా ఉంటుందనేది ఈ చిత్ర కాన్సెప్ట్‌. 

2018.. ఎవ్రీవన్‌ ఈజ్‌ ఏ హీరో అనేది ఈ చిత్ర క్యాప్షన్‌. క్యాప్షన్‌కు తగ్గట్లే కథ నడుస్తుంది. అంటే ఈ చిత్రంలో అందరూ హీరోలే.  కేరళలోని ఓ మారుమూల పల్లెటూరు ఇతివృత్తంగా చిత్ర కథ నడుస్తుంది. ఆకస్మాత్తుగా పోటెత్తిన వరదలతో అతలాకుతలం అయిన ఆ ప్రాంతంలో సహాయక చర్యలు ఎలా సాగాయి?. వాటిలో అక్కడి ప్రజలు ఎలా భాగం అయ్యారు? చివరికి ఏం జరుగుతుందనేది ఈ చిత్ర కథ.

రెండున్నర గంటలపాటు సాగే కథలో.. ద్వితియార్థం సినిమాకు ఆయువు పట్టుగా నిలిచింది. ప్రేమ, ధైర్యం, సాహసం, త్యాగాలు.. రకరకాల భావోద్వేగాలను తెరపై అద్భుతంగా పండించడంతో ఈ చిత్రం భారీ సక్సెస్‌ అందుకుంది.

దొంగ మెడికల్‌ సర్టిఫికెట్‌తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్‌ అనూప్‌ పాత్రలో అలరించాడు. బిజీ గవర్నమెంట్‌ ఉద్యోగి చివరికి వరదల్లో చిక్కుకున్న తన కుటుంబం కోసం తాపత్రయపడే షాజీ రోల్‌లో కున్‌చాకో బోబన్‌,  ఎన్నారై రమేష్‌గా వినీత్‌ శ్రీనివాసన్‌, నిక్సన్‌ పాత్రలో అసిఫ్‌ అలీ, లాల్‌, అపర్ణ బాలమురళి.. లాంటి పేరున్న ఆర్టిస్టులు మాత్రమే కాదు, సినిమాలో చిన్నపాత్ర కూడా సినిమా ద్వారా ప్రభావం చూపుతుంది.

మరిన్ని వార్తలు