ఇవన్నీ సిద్ధం.. మీరు సిద్ధమా?

29 Jan, 2021 00:26 IST|Sakshi

థియేటర్స్‌లో సినిమాలు లేక 2020 వెలవెలబోయింది.  2021 కొత్త చిత్రాల రిలీజులతో జోరుగా హుషారుగా ఉండబోతోంది. గత ఏడాది మిస్సయిన మజాని రెండింతలు ఈ ఏడాది ఇవ్వబోతోంది. స్టార్స్‌ అందరూ తమ చిత్రాలను థియేటర్స్‌కు తీసుకొచ్చే డేట్స్‌ ఫిక్స్‌ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. తాజాగా మరిన్ని అప్‌ డేట్స్‌ వచ్చాయి. వేసవి నుంచి దసరా వరకూ ఒక్కో డేట్‌ను ఒక్కో సినిమా తీసుకుంది. ఆ విశేషాలు.

ట్రిపుల్‌ ఫన్‌
‘ఎఫ్‌2’తో డబుల్‌ ఫన్‌ ఇచ్చాం. ఇప్పుడు ట్రిపుల్‌ ఫన్‌ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటోంది ‘ఎఫ్‌ 3’ చిత్రబృందం. వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. ‘ఎఫ్‌ 2’ (ఫన్‌ అండ్‌ ఫ్రస్ట్రేషన్‌) చిత్రానికి ఇది సీక్వెల్‌. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ‘దిల్‌’ రాజు నిర్మాత. ఈ సీక్వెల్‌లో కో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్‌ డబ్బు సంపాదించడం మీద ఎక్కవ దృష్టి పెడతారట. ఈ సినిమాను ఆగస్ట్‌ 27న విడుదల చేస్తున్నట్టు తెలిపారు.

పుష్పరాజ్‌ వేట త్వరలో..
అల్లు అర్జున్, సుకుమార్‌ది స్పెషల్‌ కాంబినేషన్‌. వీరిద్దరూ గతంలో ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు చేశారు. తాజాగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్‌ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్‌ 13న విడుదల చేస్తున్నారు. ‘పుష్పరాజ్‌ వేట త్వరలోనే ఆరంభం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

కూత మొదలు
‘సీటీమార్‌’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్‌. ఏప్రిల్‌ 2నుంచి థియేటర్స్‌లో కూత మొదలవుతుందట. సంపత్‌ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్‌ డ్రామా ‘సీటీమార్‌’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌ 2న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గోపీచంద్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది.

కపటధారి రెడీ?  
క్రైమ్‌ని పరిష్కరించేందుకు ట్రాఫిక్‌ పోలీస్‌ సుమంత్‌ సిద్ధమయ్యారు. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్‌ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. ఇందులో సుమంత్‌ ట్రాఫిక్‌ పోలీస్‌గా కనిపించనున్నారు. నాజర్, ‘వెన్నెల’ కిశోర్‌ ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడ చిత్రం ‘కవులుదారి’కి ఇది తెలుగు రీమేక్‌. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు.

గని రెడీ
బాక్సర్‌ గని తన పంచ్‌ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. జూలైలో తన  పంచ్‌ పవర్‌ చూపించనున్నారు. నూతన దర్శకుడు కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ భామ సయీ  మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

రాధాకృష్ణ
‘ఢమరుకం’ ఫేమ్‌ శ్రీనివాసరెడ్డి స్క్రీన్‌ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్‌ సేథీ జంటగా టి.డి. ప్రసాద్‌ దర్శకత్వం వహించారు. లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటించారు. పుష్పాల సాగరిక నిర్మించారు. నిర్మల్‌ బొమ్మలు తయారు చేసే కళాకారుల సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

కామ్రేడ్‌ రవన్న వస్తున్నాడు
ప్రజల సమస్యలపై పోరాడటానికి కామ్రేడ్‌ రవన్న అయ్యారు రానా దగ్గుబాటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీరావ్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నివేదా పేతురాజ్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో నక్సలైట్‌ పాత్రలో కనిపిస్తారు రానా. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు