Bollywood Movies 2022: సినిమా ఎండ్‌ కాలేదు..పిక్చర్‌ అభీ బాకీ హై.. సీక్వెల్‌  చూపిస్త మామా..

22 Feb, 2022 23:10 IST|Sakshi

సినిమాకి ఎండ్‌ కార్డు పడింది.. కానీ సినిమా ఎండ్‌ కాలేదు. పిక్చర్‌ అభీ బాకీ హై.. అంటే... సినిమా ఇంకా ఉందని అర్థం. అలా హిందీలో ఇప్పుడు ‘కొనసాగింపు’ సినిమాలు చాలా ఉన్నాయి. ‘సీక్వెల్‌ చూపిస్త మామా..’ అంటూ అరడజనకు పైగా నిర్మాణంలో ఉన్న సీక్వెల్స్‌ గురించి తెలుసుకుందాం.

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌లో ‘టైగర్‌’, ‘దబాంగ్‌’ చిత్రాల ఫ్రాంచైజీలు చెప్పుకోదగ్గవి. ‘ఏక్తా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాల తర్వాత ‘టైగర్‌’ ఫ్రాంచైజీలో వస్తోన్న తాజా చిత్రం ‘టైగర్‌ 3’. సల్మాన్, కత్రినా కైఫ్‌ జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇదే కాదు.. ‘దబాంగ్‌ 4’ చిత్రం చేసే ఆలోచన ఉందని ఇటీవల సల్మాన్‌ చెప్పారనే వార్తలు వచ్చాయి. ఇవే కాదు.. కామిక్‌ టచ్‌ ఉన్న ‘నో ఎంట్రీ’, ఎమోష నల్‌ టచ్‌ ఉన్న ‘భజరంగీ బాయిజాన్‌’ చిత్రాలకు సల్మాన్‌ ఇటీవల సీక్వెల్స్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇక దాదాపు 20 ఏళ్ల గ్యాప్‌ తర్వాత నాగార్జున నటించిన హిందీ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. ఈ చిత్రం తొలి భాగం ‘బ్రహ్మాస్త్ర: శివ’ సెప్టెంబరులో విడుదల కానుంది. ఇందులో రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా, అమితాబ్‌ బచ్చన్, నాగార్జున లీడ్‌ రోల్స్‌లో నటించారు. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించారు. యాక్షన్‌ హీరో హృతిక్‌ రోషన్‌ను సూపర్‌ హీరోను చేసిన ఫ్రాంచైజీ ‘క్రిష్‌’. ఇప్పటికే మూడు సార్లు వెండితెరపైకి వచ్చిన క్రిష్‌ నాలుగోసారి కూడా రావాల్సింది. అయితే ‘క్రిష్‌’ దర్శకుడు రాకేష్‌ రోషన్‌ (హృతిక్‌ తండ్రి, రచయిత) క్యాన్సర్‌ బారిన పడి కోలుకోవడం, కరోనా పరిస్థితులు వంటి కారణాల చేత ‘క్రిష్‌ 4’ సినిమా సెట్స్‌పైకి వెళ్లలేదు. ప్రస్తుతం ‘ఫైటర్‌’, ‘విక్రమ్‌ వేదా’ చిత్రాలతో బిజీగా ఉన్నారు హృతిక్‌. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక ‘క్రిష్‌ 4’ను ఆరంభించాలని అనుకుంటున్నారట.

మరోవైపు బాలీవుడ్‌లో ఆమిర్‌ఖాన్‌ ‘లగాన్‌’ చిత్రం ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. ఈ సినిమా విడుదలైన రోజు  (15 జూన్‌ 2001)నే రిలీజైన మరో మూవీ సన్నీ డియోల్‌ ‘గదర్‌: ఏక్‌ ప్రేమ్‌కథ’ కూడా బంపర్‌హిట్‌ సాధించింది. ఇరవయ్యేళ్ల తర్వాత ‘గదర్‌ 2’ను అనౌన్స్‌ చేశారు. ‘గద ర్‌’ ఫస్ట్‌ పార్ట్‌కు దర్శకత్వం వహించిన అనిల్‌ శర్మయే ‘గదర్‌: ప్రేమ్‌ కథ కంటిన్యూ’ను తెరకెక్కిస్తున్నారు. తొలి భాగంలో నటించిన సన్నీ డియోల్, అమీషా పటేల్‌ నటిస్తున్నారు. ఇంకోవైపు రెండు సీక్వెల్‌ సినిమాల్లో గెస్ట్‌గా కనిపించనున్నారు అక్షయ్‌ కుమార్‌. హిట్‌ ఫిల్మ్‌ ‘ఓ మైగాడ్‌’ (2012)కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఓ మై గాడ్‌ 2’లో తొలి భాగంలో కనిపించినట్లుగానే అక్షయ్‌ గెస్ట్‌ రోల్‌లో కనిపించనున్నారు. ‘ఓ మై గాడ్‌’కి ఉమేష్‌ శుక్లా దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు అమిత్‌ రాయ్‌ డైరెక్టర్‌. తొలి భాగంలో పరేష్‌ రావల్‌ చేసిన లీడ్‌ రోల్‌ను సీక్వెల్‌లో పంకజ్‌ త్రిపాఠి చేస్తున్నారని తెలిసింది. ఇటు ‘భూల్‌ భులెయ్యా 2’ టీమ్‌కు కూడా అక్షయ్‌ కుమార్‌ అతిథే.

అనీష్‌ బాజ్మి దర్శకత్వంలో కార్తీక్‌ ఆర్యన్, కియారా అద్వానీ, టబు ప్రధాన తారాగణంగా రూపొందుతోన్న చిత్రం ఇది. 2007లో అమీషా పటేల్, విద్యా బాలన్, అక్షయ్‌ కుమార్‌ ప్రధాన తారాగణంగా ప్రియదర్శన్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘భూల్‌ భులెయ్యా’ చిత్రం అప్పట్లో ఓ హిట్‌ మూవీగా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరోవైపు మలయాళంలో ఘనవిజయం సాధించిన హిట్‌ మూవీ ‘దృశ్యం’ను హిందీలో అజయ్‌ దేవగన్‌ రీమేక్‌ చేసి కెరీర్‌లో మరో హిట్‌ సాధించారు. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ ‘దృశ్యం 2’లో నటిస్తున్నారు అజయ్‌ దేవగన్‌. టబు, శ్రియ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు అభిషేక్‌ పాఠక్‌ దర్శకుడు. దాదాపు పదిహేనేళ్ల క్రితం అమితాబ్, అభిషేక్‌ బచ్చన్, రాణీ ముఖర్జీ కాంబినేషన్‌లో రూపొందిన ‘బంటీ ఔర్‌ బబ్లీ’కి సీక్వెల్‌ రెడీ అవుతోంది. ఈ క్రైమ్‌ కామెడీ మూవీలో సైఫ్‌ అలీఖాన్, రాణీ ముఖర్జీ నటిస్తున్నారు. ‘బంటీ ఔర్‌ బబ్లీ 2’కి వరుణ్‌ వి. శర్మ దర్శకుడు. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరోలు జాన్‌ అబ్రహాం, టైగర్‌ ఫ్రాష్‌లు కూడా సీక్వెల్స్‌పై ఓ కన్నేశారు.

క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘ఏక్‌ విలన్‌’కు సీక్వెల్‌గా ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’తో పాటు ఫ్లయిట్‌ హైజాకింగ్‌ డ్రామా ‘ఎటాక్‌ 1’, ‘ఎటాక్‌ 2’ లోనూ నటిస్తున్నారు జాన్‌ అబ్రహాం. మోహిత్‌ సూరి డైరెక్షన్‌లోని ‘ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌’, లక్ష్యరాజ్‌ ఆనంద్‌ దర్శకత్వంలోని ‘ఎటాక్‌ 1’ ఈ ఏడాదిలోనే విడుదలకు రెడీ అవుతున్నాయి. మరో యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కెరీర్‌ మొదలైంది ‘హీరో పంతి’ చిత్రంతో. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్‌ పనుల్లో బిజీగా ఉన్నారు టైగర్‌ ఫ్రాష్‌. ‘హీరో పంతి’కి సబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించగా, సీక్వెల్‌కు అహ్మద్‌ ఖాన్‌ దర్శకుడు. ఈ సీక్వెల్‌ ఏప్రిల్‌లో విడుదల కానుంది. అలాగే 2018 హిట్‌ మూవీ ‘దోస్తానా’కు సీక్వెల్‌గా ‘దోస్తా నా 2’ రానుంది. కోలిన్‌ డికున్హా తెరకెక్కించనున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ ఓ లీడ్‌ రోల్‌లో కనిపిస్తారు. 
ఇవే కాదు.. మరికొన్ని సీక్వెల్స్‌ హిందీ తెరపై కనిపించేందుకు రెడీ అవుతున్నాయి.  

మరిన్ని వార్తలు