మహేష్‌ అన్నా నువ్వు ఒంటరి కాదు.. మేమంతా తోడుగా ఉన్నాం

17 Nov, 2022 20:52 IST|Sakshi

పాపం మహేష్‌బాబు.. విధి ఆయన జీవితంలో తీరని విషాదం నింపింది. ఒక్క ఏడాదిలోనే కుటుంబంలోని పెద్ద దిక్కులను దూరం చేసి ఆయనకు పీడకలను మిగిల్చింది. ఒకరి మరణం నుంచి కోలుకునేలోపే మరొకరు.. మొదట అన్న.. తర్వాత తల్లి.. ఇప్పుడు నాన్న ఇలా వరుస విషాదాలు మహేష్‌బాబును ఒంటరిగా మిగిల్చాయి. అయితే బాధాతప్త హృదయంతో దిగాలుపడ్డ మహేష్‌కి మేమున్నామంటూ ఆయన అభిమానులు ముందుకొస్తున్నారు. సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్స్‌ చేస్తున్నారు. నువ్వు ఒంటరి కాదు.. మేమంతా నీకు తోడుగా ఉన్నామని ధైర్యాన్నిస్తున్నారు.

సాధారణంగా కుటుంబంలోని ఒక వ్యక్తి మరణిస్తేనే ఆ కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతారు. ఆ విషాదం నుంచి కోలుకోవడానికి కనీసం ఏడాదైనా పడుతుంది. అలాంటిది మహేష్‌బాబు ఒక్క ఏడాదిలోనే ముగ్గురు సొంతవాళ్లను కోల్పోయారు. అన్న నిష్క్రమణ నుంచి కాస్త కోలుకుంటున్నసమయంలోనే తల్లి ఈలోకాన్ని విడిచి పెట్టడంతో మహేష్‌ శోకసంద్రంలో మునిగిపోయారు. దుఃఖాన్ని దిగమింగుకొని చూస్తూ ఉండిపోయారు. యావత్‌ ప్రపంచం ఆయనను ఓదారుస్తున్నా గుండెల్లోని బాధ కళ్లలో కనిపిస్తోంది. పెద్దగా ఆరోగ్య సమస్యలు లేని తన తండ్రి కృష్ణ అకాల మరణం మహేష్‌ను మరింత కృంగదీసింది. మునుపెన్నడూ లేనంత నైరాశ్యంలో ఆయన కూరుకుపోయారు.

చదవండి: (సీఎంకు కాల్‌చేసి నా కుమార్తె పెళ్లికి రావొద్దన్న కృష్ణ.. ఎవరా సీఎం?)

కడసారి చూపునకు నోచుకోలేదు..
ఈ ఏడాది ప్రారంభంలోనే సోదరుడైన రమేష్‌బాబును కోల్పోయాడు. అప్పుడు మహేష్‌బాబు బాగా ఢీలా పడిపోయాడు. తండ్రి తర్వాత తండ్రిగా భావించిన అన్నను కడసారి కూడా చూడలేకపోయాడు మహేష్‌బాబు (క్వారంటైన్‌ కారణంగా). అప్పుడు మహేష్‌బాబుకు ఎంత కష్టం వచ్చిందంటూ అభిమానులు బాధపడ్డారు. ఈ బాధ నుంచి పూర్తిగా బయటకు రాకముందే మహేష్‌బాబు తల్లి ఇందిరాదేవి కన్నుమూశారు. ఆ సమయంలో యావత్‌ సినీ ప్రపంచం వచ్చి మహేష్‌ను ఓదార్చారు.

తల్లి అస్తికలను ఇటీవలే వారణాసిలో గంగానదిలో నిమజ్జనం చేసి వచ్చారు. ఆ బాధ నుంచి తేరుకుంటున్న సమయంలోనే కొండంత అండగా ఉన్న తండ్రి కృష్ణను కూడా కోల్పోయారు. కెరీర్‌ పరంగానే కాక అన్ని విషయాల్లోనూ మద్దతుగా నిలిచిన అన్న, అమ్మ, నాన్న దూరం కావడం మహేష్‌బాబుకు తీరనిలోటుగా మిగిలింది. కుటుంబంలో ఒకే ఏడాది ముగ్గురిని కోల్పోవడం సాధారణ విషయం కాదు.

కృష్ణ పార్థివదేహానికి నివాళులర్పించడానికి వచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు మహేష్‌బాబు కష్టాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు. మేమున్నామంటూ ధైర్యం చెప్పారు. అయినా మహేష్‌బాబు బాధ తీర్చలేనిది. ఇప్పటి వరకూ తనకు స్తంభాలుగా ఉన్న ముగ్గురిని కోల్పోవడం తీరనిలోటే. ఈ కష్టకాలంలో అందరూ మహేష్‌కు సంతాపం తెలుపుతున్నారు. సోషల్‌మీడియాలోనూ మేమున్నామంటూ భరోసా ఇస్తున్నారు. #StayStrongMaheshAnna అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తున్నారు. ఈ బాధ నుంచి మహేష్‌బాబు త్వరగా బయటపడాలని అభిమానలోకం కోరుకుంటోంది.

మరిన్ని వార్తలు