29 Years of SRK: తరగని అభిమానానికి థ్యాంక్స్‌

25 Jun, 2021 10:18 IST|Sakshi

గాడ్‌ఫాదర్‌ లేడు. బ్యాక్‌గ్రౌండు లేదు. ఏదో సాధించాలని రైలేక్కి ముంబై చేరుకున్నాడు. ‘అసహ్యంగా ఉన్నాడనే’ ఛీదరింపు అతనిలో కసి పెంచింది. నటనలో మరింత రాటుదేలేలా చేసింది. బుల్లితెరపై నాలుగేళ్ల రాణింపు ఫలితం.. వెండితెరకు సాదరంగా ఆహ్వానం పలికింది. అక్కడ అశేష అభిమానాన్ని సంపాదించి పెట్టింది. ఆ సినీ స్టార్‌డమ్‌ ఇవాల్టికి 29 ఏళ్లు పూర్తి చేసుకుంది. 

బాలీవుడ్‌ బాద్‌షా, కింగ్‌ ఆఫ్‌ ఖాన్స్‌.. ఈ ట్యాగుల్ని వరుస ఫ్లాపులు, డిజాస్టర్లు ఇప్పటికీ షారూఖ్‌ ఖాన్‌ నుంచి దూరం చేయలేకపోతున్నాయి. దీవానా(జూన్‌ 25, 1992న రిలీజ్‌)తో సెకండ్‌ హీరోగా మొదలైన షారూఖ్‌ నటన.. తొలినాళ్లలో నెగెటివ్‌ రోల్స్‌తో జనాలకు దగ్గరైంది. మేనరిజం, చేతుల చాచే స్టయిల్‌, నటన.. యువతలో చెరగని ఓ ముద్ర వేశాయి. 90వ దశకం నుంచి దాదాపు పదిహేనేళ్లకుపైగా లవర్‌బాయ్‌, ఫ్యామిలీమ్యాన్‌ తరహా పాత్రలతో షారూఖ్‌ను అలరించేలా చేశాయి.

  

కి..కి..కిరణ్‌
ఇప్పుడున్న యాక్టింగ్‌ జనరేషన్‌ నెగెటివ్‌ రోల్స్‌ను తేలికగా ఓన్‌ చేసుకుంటోంది. కానీ, అప్పట్లో ఆడియెన్స్‌ ఎలా రియాక్టర్‌ అవుతారో అనే సంగ్ధిగ్దం నడుమే స్టార్లు పచ్చ జెండా ఊపేవాళ్లు. అలాంటిది యాక్టింగ్‌ తొలినాళ్లలో.. అదీ ఛాలెంజింగ్‌ రోల్స్‌తో ఆడియెన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు షారూఖ్‌. పగతో రగిలిపోయి ప్రేమను సైతం చంపుకునే యువకుడిగా ‘బాజీఘర్‌’లో, సైకో లవర్‌గా ‘డర్‌’, ‘అంజామ్‌’ సినిమాలతో హీరో‘విలని’జం పండించాడు. ‘కరణ్‌ అర్జున్‌, దిల్‌వాలే దుల్హానియా లే జాయేంగే, కోయ్‌లా, దిల్‌ తో పాగల్‌ హై, డుప్లికేట్‌, కుచ్‌కుచ్‌ హోతా హై, జోష్‌, మోహబ్బతేన్‌, మైహూనా’ లాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్జెక్టులు యూత్‌లో షారూఖ్‌ క్రేజ్‌ను అమాంతం పెంచాయి. అన్ని భాషల్లో షారూక్‌ పేరు మారుమోగేలా చేయడంతో పాటు బాలీవుడ్‌కి బాద్‌షాగా షారూఖ్‌ను నిలబెట్టాయి.

      

ప్రయోగాలు వెక్కిరించినా.. 
షారూఖ్‌ కెరీర్‌లో పర్‌దేశ్‌, డీడీఎల్‌జే, దేవదాస్‌, కల్‌హోనహో, వీర్‌జరా, చక్‌దే ఇండియా లాంటి పర్‌ఫార్మెన్స్‌ బేస్డ్‌ సినిమాలే కాదు.. ప్రయోగాలు చాలానే ఉన్నాయి. దిల్‌ సే, అశోక, ఛల్తే ఛల్తే, స్వదేశ్‌, మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌, రా వన్‌, ఫ్యాన్‌, రాయిస్‌ సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద నిరాశ మిగిల్చినప్పటికీ.. షారూఖ్‌ యాక్టింగ్‌కు ఆడియెన్స్‌ను ఫిదా చేయకుండా ఉండలేకపోయాయి. ఇక డిజాస్టర్ల సంగతి సరేసరి. అయినప్పటికీ షారూఖ్‌ స్టార్‌ హీరో క్రేజ్‌, ఫ్యాన్‌డమ్‌ ఈనాటికి తగ్గలేదు. అందుకు కారణం.. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లో రాణించాడనే. ముంబైలోని మన్నత్‌ ముందు ప్రతీ పుట్టినరోజుకి క్యూ కట్టే అభిమానం చాలు.. షారూక్‌పై అభిమానం ఏనాటికీ తరిగిపోదని చాటి చెప్పడానికి.

మరిన్ని వార్తలు