రంగుల రాజకీయం బ్రహ్మర్షి విశ్వామిత్ర

24 Apr, 2021 03:44 IST|Sakshi
మేనక, విశ్వామిత్రులుగా... మీనాక్షీ శేషాద్రి, ఎన్టీఆర్‌

సూపర్‌ హిట్‌ సినిమాలకే కాదు... కొన్ని సూపర్‌ ఫ్లాప్‌ సినిమాలకూ రకరకాల కారణాల రీత్యా చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి ఓ సినిమా ఎన్టీఆర్‌ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’. కళనూ, రాజకీయాన్నీ కలగలపాలని చూస్తే – పులగం కాదు కలగాపులగం అవుతుందని ఎన్టీఆర్‌ లాంటి స్టార్‌కు అవగతమైన అరుదైన సందర్భం అది. సి.ఎం. హోదాలో ఉంటూనే, మళ్ళీ తెరపై నటించి ఎన్టీఆర్‌ జాతీయస్థాయి సంచలనం రేపిన ఘట్టమూ అదే! అప్పట్లో రోజూ వార్తల్లో నిలిచిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’కు ఈ ఏప్రిల్‌తో 30 వసంతాలు.

అది 1989. దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన వత్సరం. ఎన్టీఆర్‌ అప్పటికే ‘నేషనల్‌ ఫ్రంట్‌’ ఛైర్మన్‌గా, దేశవ్యాప్తంగా కాంగ్రెసేతర ప్రతిపక్షాలను ఒక తాటిపైకి తెస్తూ, జాతీయ రాజకీయాలలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో సి.ఎం.గా మాత్రం ఆయనకు బోలెడు తలనొప్పులు. అప్పటికే వంగవీటి రంగా హత్య, కోర్టు కేసులు, నక్సలైట్లు పెచ్చుమీరడం, వారి చేతిలో కరీంనగర్‌ జిల్లా తాడిచర్ల మండల ప్రజాపరిషత్‌ అధ్యక్షుడు మల్హర్‌రావు హత్యకు గురవడం, 1989 ఫిబ్రవరిలో క్యాబినెట్‌ మొత్తాన్నీ ఎన్టీఆర్‌ రద్దు చేయడం లాంటి అనేక అంశాలు ఆయన జనాదరణకు గండికొడుతున్నాయి. ఆలోచించిన ఎన్టీఆర్‌ ఎన్నికల ముందు ఇటు తెలుగునేలతో పాటు దేశవ్యాప్తంగా తన ఇమేజ్‌ మళ్ళీ పెంచుకోవాలనుకున్నారు. అందుకు తనకు అలవాటైన సినిమా రంగాన్నీ, అదీ జనంలో తనను ఆరాధ్యదైవంగా మార్చిన పౌరాణిక పాత్రపోషణనూ అస్త్రంగా ఎంచుకున్నారు. 1981లోనే ప్రకటించిన తన కలకు ఎన్టీఆర్‌ ఎనిమిదేళ్ళ తర్వాత రూపమిచ్చారు. అదీ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’!

స్టూడియోలో సి.ఎం... ఓ సరికొత్త చరిత్ర
ప్రజలెన్నుకున్న ప్రజాస్వామ్య పదవిలో ఉన్న వ్యక్తి మళ్ళీ ఒకప్పటి తన రంగుల లోకంలో విహరించాలనుకోవడం అంతకు మునుపెన్నడూ చరిత్రలో జరగలేదు. అమెరికా అధ్యక్షుడు రీగన్‌ నుంచి తమిళనాడు సి.ఎం. ఎమ్జీఆర్‌ దాకా ఎవరూ మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. నటించనూలేదు. సి.ఎంగా అప్పటికీ, ఇప్పటికీ ఆ పని చేసింది ఎన్టీఆర్‌ ఒక్కరే!

ముఖ్యమంత్రి నటనపై కోర్టులో వివాదం
‘ముఖ్యమంత్రి ప్రభుత్వోద్యోగి కాబట్టి, ఆర్థిక ప్రయోజనమిచ్చే సినిమాల్లో నటించకూడ’దంటూ కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టులో రిట్‌ వేసింది. కానీ, పి.వి. నరసింహారావు ‘వేయిపడగలు’ నవలను హిందీలోకి అనువదించడాన్నీ, జలగం వెంగళరావు కోళ్ళఫారమ్‌ నిర్వహించడాన్నీ, సంజీవరెడ్డి వ్యవసాయం చేయడాన్నీ ప్రస్తావిస్తూ ఎన్టీఆర్‌ తరఫు వకీలు వాదనలు వినిపించారు. రాష్ట్రపతిగా ఉండగా ఫక్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ గోల్ఫ్‌ ఆడేవారనీ, సి.ఎం.గా ఉండగా బి.సి. రాయ్‌ డాక్టర్‌గా ప్రాక్టీస్‌ చేసేవారనీ గుర్తుచేశారు. ఎన్టీఆర్‌ సినిమాల్లో నటించడం వీటికి భిన్నమైనది కాదని వకీలు వాదించారు.

వాదోపవాదాలు విన్న హైకోర్టు చివరకు సినిమాల్లో సి.ఎం నటించవచ్చా లేదా అని పరిశీలించేందుకు కానీ, నటించకుండా నిషేధించే అధికారం కానీ తమకు లేదని తీర్పు చెప్పింది. నిర్ణయాన్ని ముఖ్యమంత్రి విచక్షణకే వదిలేసింది. 1989 జూన్‌ 18న ‘విశ్వామిత్ర’ చిత్రీకరణ మొదలైంది. హైదరాబాద్‌ రామకృష్ణా స్టూడియోస్‌లోని అతి పెద్ద ఫ్లోర్‌లో ఆ రోజు జరిగిన ప్రారంభోత్సవానికి అతిథులుగా వి.పి. సింగ్, ముఖ్యమంత్రులు కరుణానిధి, దేవీలాల్, పి.కె. మహంతా – ఇలా నేషనల్‌ ఫ్రంట్‌ నేతలు ఎందరో వచ్చారు. విశ్వామిత్రుడిగా దండ, కమండలాలతో ఎన్టీఆర్, మేనకగా మీనాక్షీ శేషాద్రి సెట్లోకి అడుగుపెడుతుంటే, నేతలందరూ ఫ్లోర్‌లో కింద పరచిన పరుపులపై కూర్చొని చూడడం చర్చ రేపింది.

రాజకీయాల వేడిలో... కరిగిపోయిన రంగులు
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ కథ, స్క్రీన్‌ప్లే, కూర్పు, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలన్నీ ఎన్టీఆర్‌వే! వశిష్టుడితో పంతం పట్టి, రాజర్షిగా, చివరకు బ్రహ్మర్షిగా మారిన చక్రవర్తి కౌశికుడి కథలో తనను తాను చూసుకున్నారు ఎన్టీఆర్‌. రావణ, దుర్యోధన పాత్రలను ‘సీతారామ కల్యాణం’, ‘దానవీరశూర కర్ణ’ లాంటి చిత్రాలలో పాపులర్‌ కోణానికి భిన్నంగా చూపి, సక్సెసైన రికార్డు ఆయనది. ఈసారీ ఆ బాటే పట్టారు. ‘‘బొందితో స్వర్గానికి పోదలచిన కడజాతి వాడైన త్రిశంకు కోసం స్వర్గానికి మారుగా త్రిశంకుస్వర్గాన్ని సృష్టించిన స్రష్ట’’ లాంటి అంశాలతో వెనుకబడిన వర్గాల్ని ఆకర్షించడం లక్ష్యంగా చేసుకున్నారు. విశ్వామిత్రుడి పూర్వాశ్రమ పుత్రుడైన ఆంధ్రుడికీ, తెలుగువారికీ ముడిపెట్టారు.

సినిమాలో కాసేపే కనిపించినా, విశ్వామిత్రుడిగా ఎన్టీఆర్‌ సరసన సరసమాడే కీలకమైన మేనక పాత్రధారి ఎవరన్నది అప్పట్లో ఓ ఆసక్తికరమైన చర్చ. శ్రీదేవి మొదలు రకరకాల పేర్లు వినిపించాయి. నటి లక్ష్మి సైతం అప్పటికి తెరంగేట్రం చేయని తన కుమార్తె ఐశ్వర్య కోసం ఎన్టీఆర్‌ను సంప్రతించారు. చివరకు హిందీ స్టార్‌ మీనాక్షీ శేషాద్రికి ఆ పాత్ర దక్కడం సంచలనమైంది. ఆమె హైదరాబాద్‌లో కాలు మోపినప్పటి నుంచి సెట్లో మేనక గెటప్‌ దాకా ఆమె ఫోటోలు పత్రికల ఫస్ట్‌ పేజీలకెక్కాయి. ‘భూకైలాస్‌’ (1958)లో తొలిసారి రావణపాత్ర ధరించిన ఎన్టీఆర్‌ 33 ఏళ్ళ తరువాత తన కెరీర్‌లో 5వసారి, ఆఖరుసారి ‘విశ్వామిత్ర’లో కూడా రావణాసురుడి పాత్ర పోషించడం విశేషం. అలా విశ్వామిత్ర, రావణ పాత్రలు రెంటిలో తెరపై కనిపించారు ఎన్టీఆర్‌. ఇక, కుమారుడైన హీరో బాలకృష్ణతో రాముడు, సత్య హరిశ్చంద్రుడు, దుష్యంతుడు – 3 పాత్రలు వేయించాలనుకున్నారు ఎన్టీఆర్‌. చివరకు శ్రీరాముడు మినహా మిగతా రెండు పాత్రలు వేయించారు. టీవీ ‘రామాయణ్‌’కి సంగీతం అందించిన ప్రసిద్ధ సంగీతజ్ఞుడు, అంధ గాయకుడు, గీత రచయిత రవీంద్ర జైన్‌ బాణీలు కూర్చారు.  

ట్రైలర్‌ మంత్రానికి ఓట్లు రాలతాయా?
అనుకోకుండా 1989 ఎన్నికలు ముందుకు తోసుకువచ్చాయి. ఆ లోపల ‘విశ్వామిత్ర’ చిత్రం పూర్తి కాలేదు. దాంతో, ఎన్నికల ప్రచారం కోసం ఈ సినిమా ట్రైలర్లను వాడుకున్నారు ఎన్టీఆర్‌. సినిమా హాళ్ళలో 1989 నవంబర్‌లో సుదీర్ఘమైన ట్రైలర్‌ వదిలారు. అదీ దాదాపు 300 ప్రింట్లు! ఒక సినిమాకు అంత పెద్ద నిడివి ట్రైలర్, పైపెచ్చు అన్ని ప్రింట్లు వేయడం తెలుగులో అదే తొలిసారి, చివరిసారి. అలాగే, సినిమా పాటలూ వదిలారు. లతా మంగేష్కర్‌ సహా పేరున్న గాయకులు పాడిన ఈ సినిమా ఆడియోను అప్పట్లో ‘లహరి’ సంస్థ దక్షిణాదిలోనే అత్యధిక రేటుకు కొన్నది. 1989 ఆగస్ట్‌ 15న పాటలు రిలీజ్‌ చేసింది. మామూలు కన్నా ఎక్కువ రేటు పెట్టి పాటల క్యాసెట్లు అమ్మింది. ఊరూరా ఎన్నికల ప్రచారంలో 22 నిమిషాల ‘చైతన్యరథం’ లఘుచిత్రం, అసంపూర్తి ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’లోని పాటలు, డ్యాన్సులతో ఏకంగా 18 నిమిషాల ట్రైలర్‌ ప్రదర్శించారు. జనం ఎగబడి చూసినా, అందులోని దృశ్యాలపై విమర్శలు వచ్చాయి. ఆ ఫీడ్‌ బ్యాక్‌తో ఆ తర్వాత రీషూట్‌ చేసుకోవాల్సి వచ్చింది.

ఇక, సి.ఎం. హోదాలో ఉన్నా సెట్లో విశ్వామిత్రుడి వేషంలో ప్రభుత్వ ఫైళ్ళపై ఎన్టీఆర్‌ సంతకాలు పెట్టడంతో దక్కిన విపరీత పబ్లిసిటీ జనంలో వ్యతిరేకత తెచ్చింది. 1989 ఎన్నికలలో కేంద్రంలో ‘నేషనల్‌ ఫ్రంట్‌’ అధికారంలోకి వచ్చింది కానీ, రాష్ట్రంలో ఎన్టీఆర్‌ అధికారం కోల్పోయారు. కల్వకుర్తిలో తానే ఓటమి పాలయ్యారు. రిజల్ట్స్‌కు ముందు ప్రధానమంత్రి పీఠానికి పోటీదారు అవుతారనుకున్న ఆయన చివరకు ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికే పరిమితం కావాల్సొచ్చింది.

సినిమా ఫ్లాప్‌...  ఎన్నికల తొలిదశ హిట్‌!
రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంటూనే, అనేక పనుల మధ్యలోనే ఆ తరువాత ‘విశ్వామిత్ర’ పూర్తి చేశారు ఎన్టీఆర్‌. 1991 మే నెలలో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. దేశంలో రాజకీయ అనిశ్చితి చూసి, ఎన్టీఆర్‌ ఈసారి త్వరపడ్డారు. ఎన్నికలకు ముందే 1991 ఏప్రిల్‌ 19న ‘విశ్వామిత్ర’ను రిలీజు చేసేశారు. సిన్మాను జనం ఫ్లాప్‌ చేశారు. సరిగ్గా నెల తర్వాత రాజీవ్‌ హత్య ముందు మేలో జరిగిన తొలిదశ ఎన్నికల్లో మాత్రం ఎన్టీఆర్‌ వైపే నిలిచారు. అధిక స్థానాల్లో పట్టం కట్టారు. ఎన్టీఆర్‌ను తామెలా చూస్తున్నదీ చెప్పకనే చెప్పేశారు. కానీ, జూన్‌లో జరిగిన రెండో దశ ఎన్నికల్లో రాజీవ్‌ హత్యానంతర సానుభూతి ప్రభంజనం ఎన్టీఆర్‌ గెలుపు గుర్రానికి కళ్ళెమేసింది.

క్యాన్సర్‌ ఆసుపత్రికి డబ్బులు తగ్గడంతో...
‘ఎన్టీఆర్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌’ పేర ఈ చిత్రం నిర్మాణమైంది. ‘‘వచ్చే ప్రతి పైసా నా ధర్మపత్ని బసవరామ తారకం మెమోరియల్‌ మెడికల్‌ ట్రస్ట్‌ నిర్వహించే మాతా శిశు ఆరోగ్య కేంద్రానికే అర్పితం, సమర్పితం’’ అని ఎన్టీఆర్‌ ప్రకటించారు. తీరా సిన్మా ఫ్లాపై, బయ్యర్లకు కొంత వెనక్కి ఇవ్వాల్సి వచ్చేసరికి బసవతారకం క్యాన్సర్‌ హాస్పటల్‌ నిర్మాణానికి డబ్బులు తగ్గాయి. దాంతో, తర్వాత ‘మేజర్‌ చంద్రకాంత్‌’(1993 ఏప్రిల్‌ 23)కు తీసుకున్న పారితోషికంతో ఆ ఆర్థికలోటును భర్తీ చేశారు ఎన్టీఆర్‌.

మోతబరువైన మైనస్‌లు!
విశ్వామిత్రుడితో పాటు సీతారామకల్యాణం, హరిశ్చంద్ర, దుష్యం తుల కథల మూడింటి కదంబంగా నడిచే మూడు గంటల సినిమా ఇది. కవి నాగభైరవ కోటేశ్వరరావు తన ఈ తొలి సినీరచనలో గ్రాంథికం, వ్యవహారికం కలగలిపేసి, ఎన్టీఆర్‌ మనసెరిగి డైలాగులు రాసిచ్చారు. కానీ, అవేవీ జనానికి పట్టలేదు. విశ్వామిత్రుడి ఇమేజ్‌ పెంచుకొనేందుకు పురాణ కథలను తెరపై యథేచ్ఛగా మార్చారు. రాజీవ్‌ గాంధీ సహా పలువురిని ఉద్దేశిస్తూ ఇంద్రుడు (నటుడు అశోక్‌ కుమార్‌), తదితర పాత్రలను చిత్రించారు. మొత్తానికి అనేక పనుల మధ్యలో మునిగి, అనుకున్న రీతిలో ఎన్టీఆర్‌ ఈ సినిమాను తీర్చిదిద్దలేకపోయారు.

ఎన్టీఆర్‌కు లాస్‌..! వాళ్ళకు గెయిన్‌..!!
విశ్వామిత్ర ఎన్టీఆర్‌కు దెబ్బకొట్టినా, ఆయన ప్రయత్నం అప్పట్లో చాలామందికి అడగని వరమైంది. అప్పటికే శివాజీ గణేశన్‌తో వచ్చిన తమిళ ‘రాజ ఋషి’ (1985) తెలుగులో హడావిడిగా ‘రాజ ఋషి విశ్వామిత్రుడు’గా డబ్బింగై, డబ్బులు చేసుకుంది. ఎన్టీఆర్‌ మీద పొలిటికల్‌ సెటైర్‌గా విజయచందర్‌తో ‘1990 – కలియుగ విశ్వామిత్ర’ (1989) వచ్చింది. మరోపక్క ఎన్టీఆర్‌ ‘విశ్వామిత్ర’ను దెబ్బతీసేందుకు అప్పటి రాజీవ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం అండతో, దర్శక–నిర్మాత దాసరి నారాయణరావు దూరదర్శన్‌కోసం హిందీలో ‘విశ్వామిత్ర’ (1989) పేరిట ఓ వీక్లీ సీరియల్‌ భారీగా తీశారు. అందులో ‘మహాభారత్‌’ సీరియల్‌ భీష్ముడు ముఖేశ్‌ ఖన్నా టైటిల్‌ రోల్‌ పోషించగా, సినీ నటి భానుప్రియ మేనకగా నటించడం ఓ సంచలనమైంది. అప్పట్లో అనేక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దాసరికి ఆదివారం ఉదయం ప్రైమ్‌ టైమ్‌లో ప్రసారమైన ఆ సీరియల్‌ లాభాలు తెచ్చి, కొత్త ఊపిరి పోసింది.

ఏమైనా, అటు ఎన్టీఆర్‌ సినీ జీవితంలో అత్యధికంగా హైప్‌ వచ్చిన సినిమా, ఇటు అత్యంత తీవ్రంగా నిరాశపరచిన సినిమా కూడా ఈ ‘విశ్వామి’త్రే! అయితే, ఆ తరువాత ఎన్టీఆర్‌ నటించిన ఆఖరి చిత్రం ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఘనవిజయంతో ఆయన ఫ్యాన్స్‌కు ఊరట కలిగింది. వెరసి సినీ, రాజకీయ రంగాల్లోనూ, అలాగే వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్‌ జీవితాన్ని పెను మలుపు తిప్పినందుకు ‘విశ్వామిత్ర’ చిత్రం, దాని ఫలితం చరిత్రలో గుర్తుండిపోతాయి.   

రికార్డ్‌బిజినెస్‌!
సినిమా రిలీజయ్యాక స్పందన మాటెలా ఉన్నా – అయిదున్నర కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌తో ‘విశ్వామిత్ర’ ముక్కున వేలేసుకొనేలా చేసింది. అప్పటి దాకా ఏ తెలుగు సినిమా వ్యాపారమైనా రెండు కోట్ల రూపాయల రేంజ్‌ లోపలే జరిగేది. బాక్సాఫీస్‌ చరిత్ర చూస్తే – తెలుగునాట 1984 జనవరి 1న సినిమా టికెట్‌ రేట్లు పెంచారు. చాలా కాలం అవే రేట్లు కొనసాగాయి. దాదాపు ఏడున్నరేళ్ళ తరువాత 1991 ఏప్రిల్‌ 1న మళ్ళీ టికెట్‌ రేట్లు పెరిగాయి. ఒక్కదెబ్బకు 35 శాతం మేర టికెట్‌ రేట్లు పెంచారు. అలా రేట్లు పెంచాకే మిగతా సినిమాల మార్కెట్‌ పెరిగింది. కానీ, వాటన్నిటి కన్నా ముందెప్పుడో ఎన్టీఆర్‌ ‘శ్రీమద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ (1984 నవంబర్‌ 29) ఒక్కటే రూ. 2.5 కోట్ల రేంజ్‌లో ప్రీరిలీజ్‌ వ్యాపారం చేయడం విశేషం. తర్వాత మళ్ళీ ‘విశ్వామిత్ర’ ఏకంగా రూ. 5.5 కోట్ల స్థాయిలో వ్యాపారం జరుపుకోవడం మరో విశేషం.

బెనిఫిట్‌ షో సంస్కృతికి శ్రీకారం
అంతకుముందు స్పెషల్‌ షోలు ఉన్నా, తెలుగునాట అన్ని ఏరియాలకూ తొలిసారిగా బెనిఫిట్‌ షో సంస్కృతి తెచ్చింది మాత్రం ‘విశ్వామిత్ర’. రిలీజ్‌ ముందు రోజు అర్ధరాత్రే ‘విశ్వామిత్ర’కు భారీగా బెనిఫిట్‌ షోలు పడ్డాయి. టికెట్‌ రేట్లు భారీయెత్తున పెట్టి అమ్మారు. కొన్నిచోట్ల అయితే ఏకంగా వేలంపాట పెట్టి మరీ ఒక్కో షో అమ్మితే, కార్యకర్తలు ఎగబడి కొన్నారు. అప్పట్లో సినిమాకు ఒక వారానికొచ్చే షేర్‌ ఈ బెనిఫిట్‌ షోలతోనే వచ్చిందట! ‘విశ్వామిత్ర’ శ్రీకారం చుట్టిన ఈ భారీ టికెట్ల బెనిఫిట్‌ షో సంస్కృతి పదేళ్ళ తర్వాతే పెద్ద సిన్మాలన్నిటికీ ఆనవాయితీగా మారి, నేటికీ కొనసాగుతోంది.

ఓటర్లకు సినిమా గాలం!
‘‘ఎన్నికల కోసం సినిమా తీయడం లేదు’’ అని ఎన్టీఆర్‌ చెప్పినా, ఎన్నికల ముందు ఇలా సినిమాతో జనం ముందుకు రావడం అంతకు ముందూ ఆయన చేసినదే! ‘తెలుగుదేశం’ పేరిట పార్టీని స్థాపించిన వెంటనే ఆయన 1983 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ‘నా దేశం’ తీశారు. రాజకీయ డైలాగులు పెట్టారు. ఎన్నికలకు రెండున్నర నెలల ముందే 1982 అక్టోబర్‌ 27న రిలీజ్‌ చేశారు. ఇక, రాజకీయా ల్లోకి రాక ముందే తీసిన ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సెన్సార్‌ వివాదాలతో, చివరకు 1984 లోక్‌సభ ఎన్నికలకు ముందు నవంబర్‌ 29న రిలీజైంది. బాక్సాఫీస్‌ వద్ద కాసులు కురిపించిన ఆ రెండు చిత్రాలూ జనంలో ఎన్టీఆర్‌ ఇమేజ్‌ను పెంచాయి. 1989 సార్వత్రిక ఎన్నికల ముందు దేశవ్యాప్తంగా ఇమేజ్‌ పెంచుకోవాలనుకొన్న ఎన్టీఆర్‌ ఏకకాలంలో తెలుగుతో పాటు, హిందీలోనూ ‘విశ్వామిత్ర’ తీశారు.

కలసిరాని విశ్వామిత్రుడు
అందరినీ కష్టాలకు గురిచేస్తాడని విశ్వామిత్రుడి పాత్రపై ఓ ముద్ర ఉంది. ఏ పనికి ఆ పనిగా క్రమశిక్షణతో ఉండే ఎన్టీఆర్‌ ఆ పాత్ర మోజులో పడి తొలిసారి అలసత్వం వహించారు. 1990 మార్చిలో జరగాల్సిన ఏ.పి. అసెంబ్లీ ఎన్నికలను 1989లో లోక్‌సభ ఎన్నికలతో పాటు పెట్టించేశారు. అనేక పనుల మధ్య షూటింగ్‌ ఒత్తిడితో రెండుసార్లు వేర్వేరుగా ప్రచారానికి బద్ధకించి ఎన్టీఆర్‌ తీసుకున్న ఆ జమిలి ఎన్నికల నిర్ణయం బెడిసికొట్టి, రాష్ట్రంలో అధికారానికి దూరం పెట్టింది. ఆయన రాజకీయ, వ్యక్తిగత జీవితాన్నీ వేరే మార్గం పట్టించింది. ఆ రోజుల్లో ఎన్టీఆర్‌కు కానీ, తరువాత ఆ మధ్య ‘విశ్వామిత్ర క్రియేషన్స్‌’ బ్యానర్‌ పెట్టి ‘యమదొంగ’ (2007) చిత్రం నిర్మించిన దర్శకుడు రాజమౌళికి కానీ, ఆ బ్యానర్‌ లోగో కోసం విశ్వామిత్రుడి గెటప్‌ వేసిన హీరో ప్రభాస్‌కు కానీ కొన్నాళ్ళు కలసి రాలేదని సినీరంగంలో ఇప్పటికీ ఓ బలమైన సెంటిమెంట్‌!

దాసరి  సీరియల్‌

జూనియర్‌ ఎన్టీఆర్‌ తెరంగేట్రం
‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ తెలుగు వెర్షన్‌ ఒక్కటే 1991 ఏప్రిల్‌ 19న రిలీజ్‌ చేశారు. తమిళంలోనేమో డబ్బింగ్‌ చేసి, ఏకనాథ్‌ వీడియోస్‌ వారికి విక్రయించి, విడుదల చేయించారు. తెలుగు, తమిళ రెండు చోట్లా ఫ్లాప్‌. ఇంతలో ఎన్టీఆర్‌కు కొత్త ఆలోచనలు వచ్చాయి. కన్నబిడ్డ శకుంతలకే విశ్వామిత్రుడు తన కథ చెప్పినట్టు చూపిస్తే బాగుంటుందని భావించి, హిందీ వెర్షన్‌ రీషూట్‌ చేశారు. ఆ క్రమంలో బాలకృష్ణ బదులు హిందీలో దుష్యంతుడి పాత్రకు బుల్లితెర ‘రామాయణ్‌’ ఫేమ్‌ అరుణ్‌ గోవిల్‌నూ, అలాగే ఇక్కడ మధుమిత (తొలి పరిచయం) చేసిన శకుంతల పాత్రకు అక్కడ అర్చనా జోగ్లేకర్‌నూ పెట్టి, 1992 అక్టోబర్‌ ప్రాంతంలో ఆ ఎపిసోడ్‌ మళ్ళీ తీశారు. హరికృష్ణ కుమారుడైన పసివాడైన తారక్‌తో ఆ హిందీ వెర్షన్‌లోనే శకుంతల, దుష్యంతుల సంతానమైన చిన్నారి భరతుడి వేషం వేయించారు ఎన్టీఆర్‌. అలా పెద్ద ఎన్టీఆర్‌ చేతుల మీదుగా చిన్న ఎన్టీఆర్‌ సినీ రంగప్రవేశం జరిగింది. కానీ, విచిత్రంగా హిందీ సినీ వ్యాపార ఏరియాలలో ఒకటైన ‘సి.పి – బేరార్‌’ (‘సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ – బేరార్‌’ అని పిలిచే మహారాష్ట్రలోని విదర్భ, దక్షిణ – తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాలు) సర్క్యూట్‌కు మాత్రం హిందీ వెర్షన్‌ను అమ్మారట. అక్కడ మాత్రం అది రిలీజైందనీ, మిగిలిన చోట్ల రైట్స్‌ అమ్మలేదనీ, నేటికీ రిలీజ్‌ కాలేదనీ ట్రేడ్‌ వర్గాల ఉవాచ.

సినీ, నిజజీవిత తాతా మనుమళ్లు


సెట్లోనే సి.ఎం.గా సంతకాలు

– రెంటాల జయదేవ

మరిన్ని వార్తలు