4 Years Of Yatra Movie: ‘యాత్ర’.. ఓ మహానాయకుడి వ్యక్తిత్వానికి వెండితెర రూపం

8 Feb, 2023 11:25 IST|Sakshi

కొన్ని కథలు ప్రేక్షకులను అలరిస్తాయి.. ఆలోచింపజేస్తాయి. మరికొన్ని కథలు హృదయాలను హత్తుకుంటాయి. కన్నీళ్లను తెప్పిస్తాయి. అలా మనసుల్ని హత్తుకునే కథలు అప్పుడప్పుడు మాత్రమే వస్తాయి. అలాంటి వాటిలో ‘యాత్ర’ ఒకటి. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన బయోగ్రాఫికల్‌ మూవీ ఇది. వైఎస్సార్‌లో రాజకీయపరంగానే కాక వ్యక్తిత్వ పరంగా కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చిన ప్రజా ప్రస్థానం యాత్ర నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు.

నాడు ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్సార్‌.. పాదయాత్ర ద్వారా జనంలోకి ఎలా వెళ్లగలిగారు? సమస్యలు ఎలా తెలుసుకున్నారు? కష్టాలకు పట్టించుకోకుండా.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు.. మండుటెండల్లో ఎలా ముందడుగు వేశారు? ఆయన పాదయాత్రకు దారి తీసిన పరిస్థితులేంటి? పాదయాత్ర రాజశేఖర్‌రెడ్డి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు తీసుకు వచ్చింది? యాత్రలో ఆయనకు ఎదురైన అనుభవాలేంటి ? పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి కష్టాల్లో ఉన్న పార్టీని వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తన పట్టుదలతో ఎలా విజయతీరాలకు చేర్చారు? అన్నదే ఈ సినిమా కథ.

ఒక సినిమాకు కథతో పాటు క్యారెక్టర్‌ సెలక్షన్‌ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ని నిర్ణయిస్తుంది. వైఎస్సార్‌ పాత్రకు మలయాళ నటదిగ్గజం మమ్ముట్టిని ఎంపిక చేయడంతోనే ఈ సినిమా సగం విజయం సాధించింది.

‘యాత్ర’ సినిమా అనేది ఓ ఎమోషనల్ జర్నీ. ఇందులో పెద్దగా కథ కంటే పాత్రలే ముఖ్యం. వైఎస్సార్‌ పాత్రకు మమ్ముట్టి ప్రాణం పెట్టి నటించాడు. ఫస్ట్‌ సీన్‌ నుంచి చివరి వరకు తెర మీద రాజన్ననే చూస్తున్నామన్నంతగా ప్రేక్షకుడిని కథలో లీనం చేశాడు మమ్ముట్టి. రాజశేఖరరెడ్డి రాజసం, హుందాతనం, రాజకీయం, నమ్మిన వారికోసం ఎంతకైన తెగించే వ్యక్తిత్వం లాంటి విషయాలను తెర మీద అద్భుతంగా పలికించాడు.

సినిమా అంతా ఒక ఎత్తైయితే క్లైమాక్స్‌లో వచ్చే వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీన్స్‌ మరో ఎత్తు. అప్పటి వరకు వైఎస్సార్‌ గొప్పతనాన్ని తెలుసుకొని ఉప్పొంగిపోయిన ప్రేక్షకులను చివర్లో చూపించే రియల్‌ ఫుటేజ్‌ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

అన్ని బయోపిక్‌ మూవీస్‌లా కేవలం కథను మాత్రమే చెప్పే ప్రయత్నం చేయలేదు దర్శకుడు మహి వీ రాఘవ. సినిమా తొలి సన్నివేశం నుంచే ప్రేక్షకుడిని కథలో లీనం చేసి రాజన్నతో ప్రయాణం చేసేలా చేశాడు. అందుకే విమర్శకులు సైతం రాఘవపై ప్రశంసలు కురిపించారు. సూటిగా సుత్తి లేకుండా,  చెప్పాల్సిన విషయాన్ని ఎమోషనల్‌గా.. ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా.. కంటతడి పెట్టించేలా ‘యాత్ర’ను తీర్చి దిద్దారు.
(యాత్ర సినిమా విడుదలై నేటికి(ఫిబ్రవరి 8)  నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా..)

మరిన్ని వార్తలు