జాతీయ అవార్డులు: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని

22 Mar, 2021 17:29 IST|Sakshi

జాతీయ సినిమా అవార్డుల్లో తెలుగు పరిశ్రమకు చెందిన రెండు సినిమాలు సత్తా చాటాయి. తాజాగా ప్రకటించిన అవార్డుల్లో తెలుగు చిత్రసీమకు సంబంధించి మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’కి మూడు అవార్డులు, న్యాచురల్‌ స్టార్‌ నాని సినిమా ‘జెర్సీ’కి రెండు అవార్డులు దక్కాయి.

వంశీ పైడిపల్లి దర్శకత్వంతో మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు లభించింది. దీంతో పాటు ఈ సినిమాకు సంబంధించే ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం, ఉత్తమ నిర్మాణ సంస్థగా దిల్‌రాజుకు చెందిన శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ అవార్డులు పొందాయి. ఈ అవార్డు దక్కడంపై శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ హర్షం వ్యక్తం చేసింది.

ఇక ఉత్తమ తెలుగు చిత్రంగా నాని హీరోగా గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కించిన ‘జెర్సీ’ ఎంపికైంది. దీంతోపాటు ఉత్తమ ఎడిటర్‌గా నవీన్‌ నూలి జాతీయ అవార్డు దక్కించుకున్నారు. మొత్తం ఐదు అవార్డులు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ హర్షం వ్యక్తం చేసింది. దీనిపై ఆయా చిత్రబృందాలు సంతోషంలో మునిగాయి. గతేడాది ‘మహానటి’ చిత్రానికి కీర్తి సురేశ్‌ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు