38 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ క్షణాలు.. కపిల్‌ దేవ్ భావోద్వేగపు వ్యాఖ్యలు

24 Dec, 2021 05:28 IST|Sakshi
విష్ణు, రణ్‌వీర్, నాగార్జున, కపిల్‌ దేవ్, శ్రీకాంత్, కబీర్‌ ఖాన్, సుభాశిష్‌

– కపిల్‌ దేవ్‌

‘‘1983 జూన్‌ 25న జరిగిన వరల్డ్‌ కప్‌ పోటీలో నా సార థ్యంలోని భారత క్రికెట్‌ జట్టు విశ్వ విజేతగా నిలిచిన క్షణాలు మరచిపోలేనివి. 38 ఏళ్ల తర్వాత ‘83’ ద్వారా మరోసారి ఆ క్షణాలను వెండితెరపై ప్రేక్షకులతో కలిసి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని భారత క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ కపిల్‌ దేవ్‌ అన్నారు. 1983లో ఇండియా వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘83’. కపిల్‌ దేవ్‌గా రణ్‌వీర్‌ సింగ్, కపిల్‌ సతీమణి రూమీ భాటియాగా దీపికా పదుకోన్‌ నటించారు.

కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌ సమర్పణలో దీపికా పదుకోన్, సాజిద్‌ నడియాద్‌వాలా, కబీర్‌ ఖాన్, నిఖిల్‌ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింస్‌ లిమిటెడ్, ఫాంటమ్‌ ఫిలింస్‌ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘1983లో ఇండియా వరల్డ్‌ కప్‌ గెలవగానే భారతదేశం అంతా పండగ వాతావరణం నెలకొంది. ‘83’ ట్రైలర్‌ చూశాక కపిల్‌ దేవ్‌ నటించారా? అనిపించింది. ఆ పాత్రలో రణ్‌వీర్‌ అంతలా ఒదిగిపోయారు’’ అన్నారు.

రణ్‌వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ– ‘‘కపిల్‌దేవ్‌లాంటి లెజెండ్‌ పాత్ర చేయడం గర్వంగా ఉంది’’ అన్నారు. విష్ణు ఇందూరి మాట్లాడుతూ– ‘‘83’ రషెస్‌ చూసుకున్న ప్రతిసారీ కన్నీళ్లు వచ్చాయి.. అంతలా ఈ చిత్రంలోని భావోద్వేగాలుంటాయి’’ అన్నారు. మాజీ క్రికెటర్‌ కృష్ణమాచారి శ్రీకాంత్‌ మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్రను జీవా అద్భుతంగా చేశాడు. నేను, నాగార్జున ఇంజినీరింగ్‌లో క్లాస్‌మేట్స్‌. కాలేజ్‌లో సైలెంట్‌గా ఉన్న నాగ్‌.. ‘శివ’తో వైలెంట్‌గా ట్రెండ్‌ సెట్‌ చేశాడు’’ అన్నారు.

కబీర్‌ ఖాన్‌ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా కోసం కపిల్‌తో పాటు అప్పటి టీమ్‌ని కలిసి సలహాలు తీసుకున్నాను. అప్పటి వార్తా కథనాలనూ రిఫరెన్స్‌గా తీసుకున్నాను. 1983లో వరల్డ్‌ కప్‌ గెలుచుకున్న క్షణాలు, ఆ తర్వాత పరిస్థితులను చూపించాం’’ అన్నారు. ‘‘అందరూ... ముఖ్యంగా యువతరం చూడాల్సిన సినిమా ఇది’’ అని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సుభాశిష్‌ అన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు