ఒక్క సినిమాకే పది సినిమాల అనుభవం!

20 Aug, 2021 16:31 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. శ్రీ సరిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంతో ‘88’ రామారెడ్డి నిర్మాతగా పరిచయం అవుతున్నారు. శుక్రవారం (ఆగస్టు 20) రామారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ‘‘మాది తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలోని కొంకుదరు గ్రామం. ప్రముఖ దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డిగారిది మా ఊరే. నా స్నేహితుడు, డిస్ట్రిబ్యూటర్‌ వినోద్‌ వల్ల సినిమాలపై నాకు ఆసక్తి పెరిగింది. ‘రాజా విక్రమార్క’ కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో ఎన్‌ఐఏ (నేషనల్‌ ఇన్విస్టిగేషన్‌ ఏజెన్సీ) అధికారిగా నటించారు కార్తికేయ.

ప్రేమ, వినోదం, యాక్షన్‌ ఇలా అన్ని అంశాలు ఉన్న ఈ చిత్రం కార్తికేయ హిట్‌ మూవీ ‘ఆర్‌ఎక్స్‌ 100’ను మించిన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. ‘రాజా విక్రమార్క్‌’ షూటింగ్‌ పూర్తయింది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. అక్టోబరులో మా చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను’’ అని అన్నారు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారికి నేను వీరాభిమానిని. ‘ఇంద్ర’ సినిమా చూసేందుకు సైకిల్‌పై మండపేట వెళ్లి, ఆ షోకు టిక్కెట్స్‌ దొరక్కపోతే నెక్ట్స్‌ షో వరకు వెయిట్‌ చేసి మరీ సినిమా చూశాను. ‘రాజావిక్రమార్క’ చిరంజీవిగారి సినిమా టైటిల్‌. కథ ప్రకారం కుదిరందని ఈ టైటిల్‌ పెట్టాం.

ఈ సినిమాలో చిరంజీవిగారి అభిమానులకు ఓ సర్‌ప్రైజ్‌ ఉంది. ‘రాజా విక్రమార్క’ జర్నీలో కరోనా పరిస్థితుల వల్ల పది సినిమాలు తీసిన నిర్మాతగా అనుభవం వచ్చింది. నేను నిర్మించబోయే తర్వాతి రెండు సినిమాల వివరాలను త్వరలో వెల్లడిస్తాను. ఇక నా పేరు ‘88’ అని ఎందుకు పెట్టుకున్నానో ఓ నాలుగు సినిమాలు పూర్తి చేసుకున్న తర్వాత చెబుతాను’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు