9 Hours Web Series Review: 9 అవర్స్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. ఎలా ఉందంటే ?

3 Jun, 2022 18:27 IST|Sakshi
Rating:  

టైటిల్‌: 9 అవర్స్‌ (వెబ్‌ సిరీస్‌)
నటీనటులు: తారక రత్న, మధుశాలిని, అజయ్‌, రవిప్రకాశ్, వినోద్ కుమార్, బెనర్జీ, సమీర్ తదితరులు
మూల కథ: మల్లాది కృష్ణమూర్తి 'తొమ్మిది గంటలు' నవల
సమర్పణ, స్క్రీన్‌ప్లే: క్రిష్‌ జాగర్లమూడి
దర్శకత్వం: నిరంజన్‌ కౌషిక్‌, జాకబ్‌ వర్గీస్‌
సంగీతం: శక్తికాంత్‌ కార్తీక్‌
సినిమాటోగ్రఫీ: మనోజ్ రెడ్డి
విడుదల తేది: జూన్‌ 2, 2022 (డిస్లీ ప్లస్ హాట్‌స్టార్‌) 

ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తి రాసిన 'తొమ్మిది గంటలు' నవల ఆధారంగా తెరకెక్కిన వెబ్‌ సిరీస్‌ '9 అవర్స్‌'. ఈ వెబ్‌ సిరీస్‌కు క్రిష్‌ స్క్రీన్‌ప్లే అందించగా, నిరంజన్‌ కౌషిక్‌, జాకబ్‌ వర్గీస్‌ దర్శకత్వం వహించారు. చాలా గ్యాప్‌ తర్వాత తారక రత్న ఈ వెబ్‌ సిరీస్‌తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చాడు. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ స్పెషల్స్‌గా వచ్చిన ఈ వెబ్‌ సిరీస్‌ను క్రిష్‌ తండ్రి జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మించారు. హాట్‌స్టార్‌లో జూన్‌ 2 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ '9 అవర్స్‌' వెబ్‌ సిరీస్‌ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

కథ:
ఈ వెబ్‌ సిరీస్‌ కథ 1985 కాలంలో జరుగుతుంది. ముగ్గురు చొప్పున తొమ్మిది మంది మూడు బ్యాంక్‌లను దొంగతనం చేసేందుకు వెళ్తారు. ఈ మూడు దొంగతనాలకు రాజమండ్రి సెంట్రల్‌ జైలులోని ముగ్గురు ఖైదీలు ఒక్కో బ్రాంచ్‌కు ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే వాటిలో రెండు దొంగతనాలు విజయవంతగా పూర్తి చేస్తారు. కానీ కోఠి బ్రాంచ్‌లో రాబరీ జరుగుతున్నట్లు పోలీసులకు తెలియడంతో దొంగలు చిక్కుల్లో పడతారు. మరీ ఆ దొంగలు పోలీసుల నుంచి ఎలా బయటపడ్డారు ? బంధీలుగా ఉన్న బ్యాంక్‌ ఉద్యోగులు, కస్టమర్లు తప్పించుకోడానికి ఏం చేశారు ? ఈ దొంగతనాల వెనుక అసలు ఎవరున్నారు ? అనేది తెలియాలంటే కచ్చితంగా ఈ వెబ్‌ సిరీస్‌ చూడాల్సిందే. 

విశ్లేషణ:
1985లో జరుగుతున్న దొంగతనం బ్యాక్‌డ్రాప్‌కు తగినట్లుగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఒకేసారి మూడు చోట్ల మూడు దొంగతనాలు జరగడం అనే అంశం ఆసక్తిగా ఉంటుంది. జైలు నుంచి వెళ్లిన ఖైదీలు 9 గంటల్లో మూడు రాబరీలు చేసుకుని మళ్లీ జైలుకు రావాలి. అయితే ఈ 9 గంటలను 9 ఎపిసోడ్స్‌గా మలిచారు. ఒకేసారి మూడు రాబరీలు చేయాలన్న కాన్సెప్ట్‌ బాగున్నా సిరీస్‌ ప్రారంభం ఎపిసోడ్స్ కొంచెం బోరింగ్‌గా ఉంటాయి. బ్యాంకు ఉద్యోగులు, దొంగతనానికి వచ్చిన వారి జీవిత కథలు ఒక్కో ఎపిసోడ్‌లో చూపించారు. అవి అక్కడక్కడ సాగదీతగా అనిపిస్తాయి. భర్త చనిపోతే వితంతు పరిస్థితి ఎలా ఉంటుంది ? భార్యభర్తల బంధం తదితర అంశాలను ఆకట్టుకునేలా చూపించారు. 

అప్పడప్పుడు వచ్చే ట్విస్ట్‌లు చాలా ఆకట్టుకుంటాయి. బంధీలుగా ఉన్న ఉద్యోగులు బయటపడే మార్గాలు, పోలీసుల అంచనాలను పటాపంచలు చేసే దొంగల తెలివి చాలా బాగా చూపించారు. ఈ సీన్లు బాగా ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇంట్రెస్టింగ్‌గా సాగుతున్న కథనంలో అక్కడక్కడా వచ్చే కామెడీ సీన్లు కావాలని జొప్పించినట్లే ఉంటాయి. సిరీస్‌లో అనేక అంశాలను టచ్‌ చేశారు. అందుకే కథనం చాలా స్లోగా అనిపిస్తుంది. అక్కడక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ బాగుంది. టైటిల్‌ 9 అవర్స్‌ కాబట్టి ఎపిసోడ్‌లను కూడా 9గా చేశారు. అదే మైనస్‌ అయింది. అలా కాకుండా 5 ఎపిసోడ్స్‌లో సిరీస్‌ ముగిస్తే సూపర్ థ్రిల్లింగ్‌గా ఉండేది. 

ఎవరెలా చేశారంటే?
చాలా కాలం తర్వాత తారక రత్నకు మంచి పాత్రే దొరికందని చెప్పవచ్చు. కానీ ఆ పాత్ర హైలెట్‌గా నిలిచే సన్నివేశాలు ఎక్కడా లేవు. జర్నలిస్ట్‌గా మధుశాలిని పాత్ర కూడా అంతంతమాత్రమే. కానీ రాబరీలో బంధీలుగా ఉన్న పాత్రధారులు ఆకట్టుకున్నారు. దొంగతనంలో కూడా తన కామవాంఛ తీర్చుకునే సహోద్యోగి పాత్రలో గిరిధర్‌ మెప్పించాడు. అజయ్‌, వినోద్‌ కుమార్‌, బెనర్జీ, ప్రీతి అస్రానీ, సమీర్‌, అంకిత్‌ కొయ్య, రవివర్మ, జ్వాల కోటి, రవిప్రకాష్ వారి నటనతో బాగానే ఆకట్టుకున్నారు. ఒక్కొక్క అంశాన్ని, జీవిత కథలను చెప్పే కథనం స్లోగా సాగిన మలుపులు, రాబరీ ప్లానింగ్‌ ఆశ్చర్యపరుస్తాయి. ఓపికతో చూస్తే మంచి డీసెంట్‌ వెబ్‌ సిరీస్‌ ఇది. అయితే ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు అనే తదితర విషయాలపై ముగింపు ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఈ సిరీస్‌కు సెకండ్‌ సీజన్‌ రానున్నట్లు తెలుస్తోంది. 

Rating:  
(3/5)
మరిన్ని వార్తలు