Oscar: ఆస్కార్‌ సందడి షురూ.. భారత్‌ నుంచి 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌'

9 Feb, 2022 10:34 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్‌ అవార్డ్స్‌ నామినేషన్స్‌ ఫిబ్రవరి 8 (మంగళవారం) వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్‌ రాస్, లెస్లీ జోర్డాన్‌ ఆస్కార్‌ నామినేషన్స్‌ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్‌’ చిత్రం 10, ‘వెస్ట్‌ సైడ్‌ స్టోరీ’, ‘బెల్‌ఫాస్ట్‌’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ఈ నాలుగు చిత్రాలూ ఉత్తమ చిత్రం విభాగంలో ఉండటం విశేషం.

అలా ఉత్తమ చిత్రం అవార్డు కోసం మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే నామినేషన్స్‌ దక్కించుకున్న వారిలో ఫైనల్‌గా ఎవరు ఆస్కార్‌ ప్రతిమను సొంతం చేసుకుంటారో చూడాలంటే ఈ ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. మార్చి 27న ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్‌ రిటు థామస్, సుస్మిత్‌ ఘోష్‌ తీసిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంటే బాగుంటుందన్నది భారత సినీ ప్రేమికుల అభిలాష.

దర్శకురాలు జేన్‌  కాంపియన్‌ రెండు విభాగాల్లో ఆస్కార్‌ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్‌ దక్కించుకున్నారు. ఈ ఫీట్‌ సాధించిన తొలి మహిళ కాంపియనే కావడం విశేషం. ∙డేమ్‌ జూడీ డెంచ్‌ (87) ‘బెల్‌ ఫాస్ట్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్‌ దక్కించుకున్నారు. ఆస్కార్‌ చరిత్రలో నామినేషన్‌ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్‌ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఏడు భిన్నమైన విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకుని రికార్డు సృష్టించారు కెన్నెత్‌ బ్రానాగ్‌. ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్‌ యాక్టర్, అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే, లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్నారు కెన్నెత్‌. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘బెల్‌ఫాస్ట్‌’కి బెస్ట్‌ పిక్చర్, ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే విభాగంలో చోటు దక్కింది. దీంతో కెన్నెత్‌ బ్రానాగ్‌ ఏడు విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా...
ఉత్తమ చిత్రం:
బెల్‌ ఫాస్ట్, కోడా, డోన్ట్‌ లాకప్, డ్రైవ్‌ మై కార్, డ్యూన్, కింగ్‌ రిచర్డ్, లికోరైస్‌ పిజా, నైట్‌మేర్‌ అల్లీ. ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్, వెస్ట్‌ సైడ్‌ స్టోరీ  
ఉత్తమ దర్శకుడు: జాన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌), పాల్‌ థామస్‌ ఆండ్రూసన్‌ (లికోరైస్‌ పిజ్జా), స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్‌ మై కార్‌), కెన్నెత్‌ బ్రానాగ్‌ (బెల్‌ఫాస్ట్‌) 
ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్‌ఫీల్డ్‌ (టిక్, టిక్‌ ... బూమ్‌), విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌), బెనెడిక్ట్‌ కంబర్‌ బ్యాచ్‌ (ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌), డెంజిల్‌ వాషింగ్టన్‌ (ది ట్రాజెడీ ఆఫ్‌ మెక్‌బెత్‌), జేవియర్‌ బార్డెమ్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌)
ఉత్తమ నటి: నికోల్‌ కిడ్‌మెన్‌ (బీయింగ్‌ ది రికార్డోస్‌), ఓలీవియా కోల్మన్‌ (ది లాస్ట్‌ డాటర్‌), క్రిస్టెన్‌ స్టీవర్ట్‌ (స్పెన్సర్‌), జెస్సికా కాస్టెయిన్‌ (ది ఐస్‌ ఆఫ్‌ టమ్మీ ఫేయీ), పెనెలోప్‌ క్రజ్‌ (సమాంతర తల్లులు)

మళ్లీ నిరాశ
బెస్ట్‌ ‘ఫీచర్‌ ఫిల్మ్స్‌ ఇన్‌ కన్సిడరేషన్‌ ఫర్‌ 94 ఆస్కార్‌ అవార్డ్స్‌’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్‌ ఎంట్రీ పోటీలో ఆస్కార్‌ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్‌’, మలయాళ ‘మరక్కర్‌: అరబికడలింటే సింహమ్‌’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్‌ ఫైనల్‌ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు. కానీ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌ ప్రకటించడానికి ముందు సోషల్‌ మీడియా, నెట్టింట్లో కాస్త డ్రామా నడిచింది.

‘ఆస్కార్‌ నామినేషన్స్‌ ఎవరికి దక్కుతాయి’ అనే చర్చలో భాగంగా అమెరికాకు చెందిన ఓ వెబ్‌సైట్‌ ఎడిటర్‌ జాక్వెలిన్‌ కోలే చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది. ‘జై భీమ్‌’ చిత్రానికి నామినేషన్‌ దక్కుతుంది. నన్ను నమ్మండి’ అంటూ జాక్వెలిన్‌ ట్వీట్‌ చేశారు. దీంతో ‘జై భీమ్‌’కు ఆస్కార్‌ నామినేషన్‌ దక్కుతుందా? అనే చర్చ జోరుగా నెట్టింట్లో సాగింది.

>
మరిన్ని వార్తలు