సిరివెన్నెలను ఎక్కువగా శ్రమ పెట్టిన పాట ఏంటి..?

6 Jun, 2021 00:50 IST|Sakshi

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామాశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన ట్విటర్‌లో చేరి ఏడాది పూర్తయిన సందర్భంగా 2021, జూన్‌లో నెటిజనులతో ముచ్చటించారు. ఆ వివరాలు.‘సిరివెన్నెలను అడగండి’ అంటూ దాదాపు గంటసేపు అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు–సమాధానాలు ఈ విధంగా..

► అప్పట్లో ఉన్న పాటలు, సినిమాలు ఇప్పుడు ఎందుకు రావడం లేదు?
ప్రతీ కాలంలోనూ పాటలు, సినిమాలు అన్నీ అన్ని రకాలుగానూ ఉన్నాయి. ఏ రకం అభిరుచి ఉన్నవాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు. భిన్నంగా ఉన్నదాన్ని గురించి విసుక్కుంటారు. మన అభిరుచికి అనుగుణంగా ఉన్న పాటలను ఎంచుకునే అవకాశం మనకు ఉంది. విసుక్కునే చేదు మాని, మన అభిరుచిని ఆస్వాదించే తీపిని చవి చూద్దాం.

► త్రివిక్రమ్‌గారు మిమ్మల్ని రాత్రి ఉదయించే సూర్యుడు అని సంబోధించడానికి కారణం?
మనకు ఇష్టమైన విషయాన్ని, మనకు తోచిన విధంగా వ్యక్తీకరిస్తాం. నేను సాధారణంగా రాత్రిపూట పని చేస్తాను. కాబట్టి దానిని ఆయన భాషలో ఆయన వ్యక్తీకరించారు.

► ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌..’ పాట ఒక అద్భుతం. ఆ పాటలోని మీకు నచ్చిన ఒక లైన్‌ గురించి...
‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతు ఉన్నా’. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్రబిందువు.

► మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట?
పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు

► దైవాన్ని నిర్వచించాలంటే?
తనను తాను నిర్వచించుకోగలగాలి.

► మీకు బాగా నచ్చిన పుస్తకం?
‘భగవద్గీత’, ఖలీల్‌ జిబ్రాన్‌ రాసిన ‘ద ప్రాఫెట్‌’.

► వేటూరి సుందరరామ్మూర్తిగారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట ఇష్టం?
చాలా ఉన్నాయని వాళ్ళూ వీళ్ళూ అన్నారు. ‘నీలాల కన్నుల్లొ సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.

► మీరు మెలకువగా ఉన్న సమయంలో ఎక్కువగా ఏం చేస్తుంటారు?
ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్‌ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నాను.

► ఫిలాసఫీ చూపులో ప్రపంచమో బూటకమా?
మనని జీవితం అనే ప్రశ్న వెంటాడి వేధించకపోతే, ఊరికే తెలివితేటలతో మాటాడాల్సి వస్తే, ఆ వాచాలతలో బూటకమే!

► తెలుగులో ట్వీట్‌ చేసినవారికే బదులు ఇస్తున్నారు?
తెలుగులోనే నన్ను నేను స్పష్టంగా వ్యక్తపరుచుకోగలను అన్న కారణం వల్ల. అలానే టింగ్లీషు నాకు సరిగా రాదు.

► ఏకాగ్రతకు మీ నిర్వచనం?
నేను తప్ప ఇంకేం కనిపించకపోవడం, నేను తప్ప ఇంకేం అనిపించకపోవడం.

► ఒక రచయితకి ఉండాల్సిన మొదటి లక్షణం?
తానేం చెప్తున్నాడో, ఎందుకు చెప్తున్నాడో తనకి స్పష్టంగా తెలియడం.

► మళ్ళీ తెలుగు సాహిత్యపు స్వర్ణయుగాన్ని చూసేదెప్పుడు? రాను రాను పద ప్రయోగాలు తగ్గిపోతూ వచ్చి ఇంగ్లీష్‌ లేదా యాస పాటలు వచ్చేశాయి. మీ ప్రయోగాలను, అద్భుత కావ్యాలను ఎప్పుడు చూడగలం?
సాహిత్యానికి ముందు తెలుగు అనో, మరోటనో చేర్చకూడదు. భాషతో సంబంధం లేనిది భావం. భావాలనేవి అన్ని విధాలుగానూ ఉంటాయి. ధాన్యం పొట్టుతో పాటే ఉంటుంది. దూగర దులిపి, గింజను ఏరుకోవడం ఎప్పుడూ జరగాల్సిన పనే. ఎప్పుడూ మనకు కావాల్సింది ఉంటుంది. మనం చేయాల్సింది ఏరుకోవడమే.

► దేవులపల్లిగారి సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కవిత?
‘మ్రోయించకోయి మురళీ, మ్రోయించకోయి కృష్ణా... తియ్య తేనియ బరువు మోయలేదీ బరువు’ – వివరణ అనేది దాహం తీర్చుకునేవారి పాత్రతను బట్టి, పాత్రను బట్టి ఉంటుంది.

► ‘సామజ వర గమనా’ అన్న సమాసం వింటే త్యాగరాజస్వామి గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు అందమైన యువతి ఊరువులు, వాటిని మోహించే యువకుడు మదిలో మెదులుతున్నారు. తప్పంతా సామాజికుడిదేనంటారా?
దృశ్యంలో లేదు. చూసే కన్ను వెనకాల ఉన్న సంస్కారంలో ఉంది.

► మీరు హేతువాది అయినప్పటికీ దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతారు?
నేనున్నాను గనుక.

► రచయితలు – సాంఘికీకరణపై మీ అభిప్రాయం?
‘సరిగా చూస్తున్నదా నీ మది..
గదిలో నువ్వే కదా ఉన్నది..’
చుట్టూ అద్దాలలో విడివిడి రూపాలు నువ్వు కాదంటున్నది no man is island..

► లిరిక్స్‌ రాయడానికి మీకు ఫేవరెట్‌ ప్లేస్‌ ఏదైనా ఉందా?
నా బుర్రలో అలజడి.

► ‘యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం?’ అన్నారు. నిజమా?
తప్పే! మృగాలను అవమానించకూడదు.

► పాటలో  నిరాశానిస్పృహలను వ్యక్తపరిచే సందర్భంలో కూడా, ఆ స్టేట్‌ ఆఫ్‌ మైండ్‌ను దాటి ఓ ఆశావాద కోణం కూడా ఇనుమడింపజేస్తూ వచ్చారు. ఆ తూకం పాటించడానికి గల ప్రత్యేకమైన కారణం ఏదైనా ఉందా?
‘కాలం గాయాన్ని మాన్పుతుంది’ అన్న సత్యాన్ని గుర్తిస్తే ఏడుపైనా, నవ్వైనా, మరేదైనా మనం చెయ్యాలనుకున్నంత సేపు చెయ్యలేం. ఇది ముందే తెలుసుకుంటే, భావాల ఉద్ధృతిని మోతాదు మించనివ్వం. ‘‘నిన్న రాత్రి పీడకలను నేడు తలుచుకుంటూ నిద్ర మానుకోగలమా? ఎంత మంచి స్వప్నమైనా అందులోనే ఉంటూ లేవకుండా ఉండగలమా?’’

► తెలుగు భాష మీద పట్టు లేని కొంతమంది గాయకులు మీ కలం నుండి జారిన అద్భుతమైన పాటలను ఖూనీ చేసినట్టు గానీ, సంగీత దర్శకులు ఆ విషయాన్ని విస్మరించినట్టు గానీ మీకెప్పుడైనా అనిపించిందా ?
బియ్యంలో రాళ్ళు ఏరుకుని వండుకుంటాం. అన్నంలో తగిలిన రాళ్ళను పక్కన పెట్టి తింటాం. ‘చూపులను అలా తొక్కుకు వెళ్ళకు...’ అని మీకూ తెలుసు... ఎవరినో ఎందుకు నిందించడం!

► మీరు ‘గాయం’లో పాడిన ‘నిగ్గదీసి అడుగు’ పాట నాకు చాలా ఇష్టం. ఇలాంటి పాటలను మళ్ళీ రాయాలని మీకు ఎందుకు అనిపించలేదు?
అలాంటి భావాలున్న మిగిలిన పాటలను మీరెందుకు పరిశీలించరు? జిరాక్స్‌ కాపీని ఎందుకు అడుగుతున్నారు.

► ‘సిరివెన్నెలగారు’ పాటల రచయిత కాకపోయి ఉంటే?
జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది.

>
మరిన్ని వార్తలు