పుస్తకంగా ఆధార్‌ చిత్ర రివ్యూలు

30 Sep, 2022 12:15 IST|Sakshi

నటుడు కరుణాస్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ఆధార్‌. వెన్నిలా క్రియేషన్స్‌ పతాకంపై శశికుమార్‌ నిర్మించిన ఈ చిత్రానికి రామ్‌నాథ్‌ పళణికుమార్‌ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. గత 23వ తేదీ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకాదరణతో మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌ చెన్నైలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

ఆధార్‌ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని దర్శకుడు రామ్‌నాథ్‌ పళణికుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాత శ్రీమతి శశికుమార్‌ దర్శకుడికి కారును బహుమతిగా అందించారు. దీనిపై దర్శకుడు స్పందిస్తూ.. తన మిత్రుడు, నిర్మాత శశికుమార్‌ ఆధార్‌ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు అన్నారు. ఈ చిత్ర విజయానికి కారకులైన వారికి కృతజ్ఞతలు తెలియచేయడానికే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ చిత్రానికి మీడియా వర్గాలు రాసిన రివ్యూలు చాలా సంతృప్తినిచ్చాయన్నారు. ప్రతి అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్నారని చెప్పారు. తాము కొన్ని నెలల పాటు తయారు చేసుకున్న కథనాన్ని చిత్రంగా రూపొందిస్తే దానిని రెండు గంటల్లో చూసి ఇంత స్పష్టంగా రివ్యూలు రాయడం ఆశ్చర్యపరిచిందన్నారు. ఆధార్‌ చిత్రానికి మంచి రివ్యూలు వచ్చాయని, ఇంతకుముందు తాను తెరకెక్కించిన అంబా సముద్రపు అంబానీ, తిరునాళ్‌ చిత్రాలు కూడా ఇంత మంచి రివ్యూలు రాలేదన్నారు.

అందుకే నిర్మాతతో సంప్రదించి ఆధార్‌ చిత్ర రివ్యూలను పుస్తకరూపంలో తీసుకురావాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. కార్యక్రమంలో నటుడు కరుణాకరన్, దిలీపన్, నటి ఇనియ, సంగీత దర్శకుడు శ్రీకాంత్‌ దేవా, ఎడిటర్‌ రామర్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు