Aadi Sai Kumar: తీస్‌ మార్‌ ఖాన్‌ టీమ్‌తో ఆది సాయి కుమార్‌ బర్త్‌డే సెలబ్రేషన్స్‌

24 Dec, 2021 21:06 IST|Sakshi

'ప్రేమ కావాలి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆది సాయి కుమార్ అంచెలంచెలుగా ఎదుగుతూ భారీ పాపులారిటీ దక్కించుకుంటున్నారు. ప్రేమ కావాలి సినిమాకు బెస్ట్ డెబ్యూ మేల్ యాక్టర్‌గా అవార్డు అందుకున్న ఆయన ఆ తర్వాత వరుస ఆఫర్స్ పట్టేస్తూ విలక్షణ కథలతో అలరిస్తున్నారు. యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను కూడగట్టుకున్న ఈ హీరో మరికొద్ది రోజుల్లో 'తీస్ మార్ ఖాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ నేపథ్యంలో 'తీస్ మార్ ఖాన్' నిర్మాత తమ విజ‌న్ సినిమాస్ ఆఫీసులో ఆది సాయి కుమార్ బర్త్ డే వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 'తీస్ మార్ ఖాన్' దర్శకనిర్మాతలు నాగం తిరుప‌తి రెడ్డి, కళ్యాణ్ జి గోగణ.. ఆది సాయి కుమార్‌కి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ యాక్షన్ ప్యాక్డ్ మూవీ 'తీస్ మార్ ఖాన్' ఘన విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతకు కృతజ్ఞతలు చెప్పిన ఆది సాయి కుమార్.. ముందు ముందు మరిన్ని వినూత్న కథలతో అలరిస్తానని అన్నారు.  

ఇక 'తీస్ మార్ ఖాన్' సినిమా విషయానికొస్తే.. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. 'నాటకం' ఫేమ్ కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తున్నారు. RX 100 సినిమాతో యువతను ఆకట్టుకున్న పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఫస్ట్ గ్లాన్స్ ఆది సాయి కుమార్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేయగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకుంటోంది.

మరిన్ని వార్తలు