మనదే మొదటి స్థానం

18 Mar, 2021 00:33 IST|Sakshi
ఆదీ సాయికుమార్‌

‘‘ప్రేమలో పడ్డ ఓ మధ్యతరగతి కుర్రాడి ఇబ్బంది ఎలా ఉంటుంది? ప్రేమ తర్వాత కుటుంబంతో, స్నేహితులతో అతనికి రిలేషన్స్‌ ఎలా మారతాయి? అనే అంశాలు ‘శశి’ సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి. ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావాల్సినంత డ్రామా ఉంది. సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి’’ అని ఆదీ సాయికుమార్‌ అన్నారు. శ్రీనివాస్‌ నాయుడు నడికట్ల దర్శకత్వంలో ఆది హీరోగా నటించిన చిత్రం ‘శశి’. ఆర్‌.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఆది మాట్లాడుతూ– ‘‘నా ‘లవ్లీ’ సినిమాను వైజాగ్‌లో పంపిణీ చేసిన వర్మగారు ఈ చిత్రకథ వినమన్నారు. శ్రీనివాస్‌ ‘శశి’ కథ చెప్పినప్పుడు వర్కౌట్‌ అవుతుందన్న నమ్మకంతో ఓకే చెప్పాను. ఇందులో రెండు షేడ్స్‌ ఉన్న రాజ్‌కుమార్‌ పాత్రలో కనిపిస్తాను.

నా రగ్డ్‌ లుక్‌ కోసం రెండు నెలలు కష్టపడ్డాను. ఈ సినిమాలో లవ్‌స్టోరీ ఉంటూనే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. గతంలో నేను చేసిన కొన్ని సినిమాలు పలు కారణాల వల్ల సరైన విజయం సాధించలేదు. నా కథలను నాన్నగారు (సాయికుమార్‌) వింటారు కానీ తుది నిర్ణయం నాదే. పెళ్లికి ముందు ఏ పాత్ర అయినా చేసే స్వతంత్రం ఉంటుంది. ఇప్పుడు అలా లేదు (నవ్వుతూ).. బోల్డ్‌ తరహా క్యారెక్టర్స్‌ చేయను. గడచిన 2020 అందరికీ బ్యాడ్‌.. యువ హీరోలంతా ఓ గ్రూప్‌ పెట్టుకుని సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం. హీరోల మధ్య సఖ్యత విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమ తర్వాతే ఏదైనా! ఈ విషయంలో టాలీవుడ్‌దే మొదటి స్థానం’’ అన్నారు.

మరిన్ని వార్తలు