ఆమిర్ టైర్ల కంపెనీ యాడ్‌పై అభ్యంతరం! రోడ్లుంది పటాసులు పేల్చడానికి కాదంటూ..

2 Oct, 2021 09:13 IST|Sakshi

Boycott CEAT Trending in Twitter: సినిమాలు, వెబ్‌ సిరీస్‌లను వివాదాస్పద కాన్సెప్ట్‌లు, సీక్వెన్స్‌లతో తెరకెక్కించడమే కాదు.. అప్పుడప్పుడు అడ్వర్టైజ్‌మెంట్‌ల రచ్చ ద్వారానూ వార్తల్లో నిలుస్తోంది బాలీవుడ్‌. ముఖ్యంగా సున్నితమైన అంశాల్ని టచ్‌ చేయడం ద్వారా సోషల్‌ మీడియాలో నెటిజన్ల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. 


ఈమధ్య వివాహ దుస్తులమ్మే ఓ బ్రాండ్‌ నటి అలియా భట్‌తో తీసిన  ‘కన్యాదాన్‌’ అడ్వర్టైజ్‌మెంట్‌ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే.  ఆ వేడి చల్లారకముందే బాలీవుడ్‌ సీనియర్‌ హీరో ఆమిర్ ఖాన్ యాక్ట్‌ చేసిన ఓ యాడ్‌పై తీవ్ర దుమారం నడుస్తోంది.


ఆమిర్ ఖాన్ నటించిన సీయట్‌ టైర్ల కంపెనీ యాడ్‌ ఒకటి ఈమధ్య రిలీజ్‌ అయ్యింది. ‘‘రోడ్లు ఉంది పటాసులు(టపాకులు) పేల్చడానికి కాదు’’ అంటూ తన ఎదురుగా ఉన్న జనాలకు క్లాస్‌ పీకుతూ.. సదరు టైర్ల యాడ్‌ను ప్రమోట్‌ చేశాడు. అయితే అమీర్‌ ఖాన్‌ ఈ యాడ్‌ చేయడం, పైగా తమ మతాన్ని కించపరిచేదిగా ఉందంటూ కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేయడం మొదలుపెట్టారు.  ఆ అభ్యంతరాలు తారాస్థాయికి చేరగా.. సీయట్‌ను బాయ్‌కాట్‌ చేయాలంటూ  Boycott_Hinduphobic_CEAT వేల ట్వీట్లు, రీట్వీట్లతో నింపేస్తున్నారు. 

ఈ యాడ్‌ చేసింనందుకు నటుడు ఆమిర్ ఖాన్ క్షమాపణలు చెప్పాలని, యాడ్‌ను తొలగించాలని సీయట్‌ కంపెనీని మరికొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక కొందరైతే ఆర్‌పీజీ గ్రూప్‌ చైర్మన్‌ హర్ష్‌ గోయెంకాను ఇందులోకి తీసుకొస్తున్నారు. గతంలోనూ ఇలా సున్నితమైన అంశాలపై హర్ష గోయెంకా అనుచిత ట్వీట్లు వేశాడని, ఆ టైంలోనూ బాయ్‌కాట్‌ ఉద్యమం నడిచిందని కొందరు స్క్రీన్ షాట్లను రీట్వీట్లు చేస్తున్నారు. మతాన్ని, పండుగల్ని కించపరిచేలా సీయట్‌ కంపెనీ యాడ్స్‌ తీయాల్సిన అవసరం, అందులో ఆమిర్‌ ఖాన్‌ లాంటి స్టార్‌ నటించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు చాలామంది.

చదవండి: అండర్‌వేర్‌ యాడ్‌.. ఏం మెసేజ్‌ ఇద్దామని రష్మిక?

మరిన్ని వార్తలు