బాలకృష్ణతో సినిమాపై క్లారిటీ ఇచ్చిన బి. గోపాల్‌

7 Oct, 2021 07:41 IST|Sakshi

‘‘దర్శకుడికి రాయడం కూడా తెలిసి ఉండాలి. డైరెక్టర్‌.. రచయిత కాకపోవడం ఓ రకంగా లోపమే అని నాకు అనిపిస్తుంది. నాకు దర్శకత్వంలో ఉన్న ప్రావీణ్యత, కథలు రాయడంలో కూడా ఉన్నట్లయితే నా నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు వచ్చి ఉండేవి’’ అన్నారు దర్శకుడు బి.గోపాల్‌. ‘సమరసింహారెడ్డి’, ‘నరసింహనాయుడు’, ‘ఇంద్ర’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన బి. గోపాల్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. గోపీచంద్, నయనతార జంటగా తాండ్ర రమేశ్‌ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా బి. గోపాల్‌ చెప్పిన విశేషాలు.

తండ్రీకొడుకల కథే ‘ఆరడుగుల బుల్లెట్‌’ చిత్రం. ఓ తండ్రికి ఇద్దరు కొడుకులు. అందులో ఒక కొడుకు బాధ్యత లేకుండా ఉంటాడు. దీంతో తండ్రి అతన్ని ఇంటి నుంచి బయటకు పంపేస్తాడు. కానీ కొందరు రౌడీల వల్ల తండ్రి ఇబ్బందిపడుతున్న విషయాన్ని తల్లి ద్వారా తెలుసుకున్న కొడుకు ఆ రౌడీల నుంచి తన కుంటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు? అన్నదే కథ.

తండ్రి పాత్రలో ప్రకాశ్‌రాజ్, కొడుకు పాత్రలో గోపీచంద్‌ నటించారు. ఇందులో ఎమోషన్స్‌ ఆసక్తికరంగా ఉంటాయి. మణిశర్మ సంగీతం, వక్కంతం వంశీ కథ, అబ్బూరి రవి మాటలు హైలైట్స్‌. గోపీచంద్‌ అద్భుతంగా నటించారు. దాదాపు పన్నెండేళ్లు దర్శకత్వ శాఖలో (అసిస్టెంట్‌ డైరెక్టర్, కో డైరెక్టర్‌)గా చేసిన నేను 1985లో డైరెక్టర్‌ అయ్యాను. అయితే ఇప్పటవరకు 33 సినిమాలే చేయగలిగాను. నిజానికి ఈపాటికి వంద సినిమాలు చేయాల్సింది. కానీ స్క్రిప్ట్‌ నచ్చితేనే చేస్తాను. హిట్టూ, ఫ్లాప్‌కు మధ్య ఉన్న తేడా స్క్రిప్టే. కానీ స్క్రిప్ట్‌ రాసుకోవడం నాకు చేతకాదు.

బాలకృష్ణగారితో ఆరంభించిన ‘హరహర మహాదేవ’ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. మంచి కథ కుదిరితే ఆయనతో ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’లను మించిన హిట్‌ తీయాలని ఉంది. నాకు సూపర్‌హిట్స్‌ ఇచ్చిన రైటర్సే కథలు చెబుతున్నారు కానీ ఫుల్‌ సబ్జెక్ట్‌గా కుదరడం లేదు. రైటర్స్‌ చిన్నికృష్ణ, సాయిమాధవ్‌ బుర్రా కూడా కథలు చెప్పారు. అందుకే ఎక్కువ సినిమాలు చేయలేకపోయా!

మరిన్ని వార్తలు