Karan Arjun Movie Telugu Review: 'కరణ్‌ అర్జున్‌' సినిమా రివ్యూ..

24 Jun, 2022 14:12 IST|Sakshi

టైటిల్‌: క‌ర‌ణ్ అర్జున్‌ 
నటీనటులు: అభిమన్యు, నిఖిల్ కుమార్, షిఫా, మాస్ట‌ర్ సునీత్, అనితా చౌదరి, రఘు. జి, జగన్, ప్రవీణ్ పురోహిత్ తదితరులు 
నిర్మాణ సంస్థ: రెడ్ రోడ్ థ్రిల్ల‌ర్స్ 
నిర్మాతలు: డా. సోమేశ్వ‌ర‌రావు పొన్నాన, బాలక్రిష్ణ ఆకుల, సురేష్ , రామకృష్ణ , క్రాంతి కిరణ్ 
దర్శకత్వం: మోహ‌న్ శ్రీవ‌త్స 
సంగీతం: రోషన్ సాలూర్
సినిమాటోగ్రఫీ: మురళి కృష్ణ వర్మన్
ఎడిటర్‌ : కిషోర్ బాబు
విడుదల తేది: జూన్‌ 24, 2022

నిఖిల్ కుమార్, షిఫా హీరో హీరోయిన్లుగా మోహ‌న్ శ్రీవ‌త్స ద‌ర్శ‌క‌త్వంలో డా.సోమేశ్వ‌ర‌ రావు పొన్నాన ,బాలక్రిష్ణ ఆకుల, సురేష్ ,రామకృష్ణ ,క్రాంతి కిరణ్  లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం  'క‌ర‌ణ్ అర్జున్‌'. రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం(జూన్‌ 24) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఏ మేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.

కథ: 
కరణ్ (నిఖిల్ కుమార్) తనకి కాబోయే భార్య వృషాలి (షిఫా)తో కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పాకిస్తాన్ బోర్డర్‌లో ఉన్న జైసల్మేర్ ఎడారి ప్రాంతానికి వెళతాడు. ఆ దారిలో అర్జున్ (అభిమన్యు) వీళ్లిద్దరినీ వెంటాడుతూ ఇబ్బందులకు గురి చేస్తుంటాడు. ఒకానొక సమయంలో అర్జున్‌ ఆ ఇద్దరిని షూట్ చేసి చంపాలనుకుంటాడు. అర్జున్ నుంచి తప్పించుకోవడానికి ఎడారి ప్రాంతంలో అనేక పాట్లు పడతారు కరణ్, వృషాలి. వీరిద్దరిని అర్జున్‌ ఎందుకు వెంబడించాడు ? అసలు ఈ ముగ్గురి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? లారీ డ్రైవర్‌ ఎత్తుకెళ్లిన వృషాలిని అర్జున్‌ ఎందుకు కాపాడాడు ? చివరికి క్లైమాక్స్‌లో ఏం తెలిసింది ? వంటి ఆసక్తికర విషయాలు తెలియాలంటే 'కరణ్‌ అర్జున్‌' సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ: 
ఇది ఒక రోడ్‌ ట్రిప్‌ నేపథ్యంతో సాగే కథ. గుప్పెడంత మనసుకి సముద్రమంత గాయం అయితే.. చివరకు ప్రాణాలు తీసే అంత క్రూరత్వం పనికి రాదు అని దర్శకుడు మోహన్ శ్రీవత్స చెప్పిన నీతి సూత్రం బాగుంది. అమ్మాయి, అమ్మ మీద ప్రేమతో ఒకరి ప్రాణం తీయడం సరికాదనే అంశాన్ని దర్శకుడు థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో చక్కగా చూపించారు. సినిమా అసలు కథలోకి వెళ్లేందుకు సమయం పట్టినా ఇంటర్వెల్‌ నుంచి చాలా ఆసక్తికరంగా, ట్విస్టులతో కథను బాగా నడిపించాడు. అనుకున్న కథను తెరపై థ్రిల్లింగ్‌గా ఆవిష్కరించి డైరెక్టర్ మోహ‌న్ శ్రీవ‌త్స సక్సెస్‌ అయ్యారనే చెప్పవచ్చు. సంగీతం, బీజీఎం పర్వాలేదనిపించింది. 

ఎవరెలా చేశారంటే?
రెండు షేడ్స్‌ ఉన్న పాత్రల్లో నిఖిల్ కుమార్‌, అభిమన్యు చక్కగా నటించారు. ఒకరు తల్లిని, మరొకరు అమ్మాయిని ప్రేమించే ప్రాత్రల్లో ఒదిగిపోయారు. హీరోయిన్ షిఫా కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేసిందనే చెప్పవచ్చు. చాలాకాలం తర్వాత సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించిన సునీత చౌదరి తన పాత్ర పరిధిమేర బాగా నటించింది. ఎడారిలో వచ్చే చేజింగ్‌ సీన్స్ఆకట్టుకుంటాయి. రాజస్థాన్ లొకేషన్స్‌ను అందంగా చూపించారు. ఫైనల్‌గా చెప్పాలంటే ఈ 'కరణ్‌ అర్జున్‌' ఎంగేజింగ్‌గా ఉండే ఒక రోడ్‌ ట్రిప్‌ థ్రిల్లర్‌. 

మరిన్ని వార్తలు